శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 28, 2020 , 00:21:55

మాకు పుట్టబోయే బిడ్డ..

మాకు పుట్టబోయే బిడ్డ..

‘అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది..’ అని కాబోయే తండ్రి సంబురపడటం, ‘అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు’ అని కాబోయే తల్లి మురిసిపోతూ ఊహల్లో తేలిపోవడం మామూలే. కానీ, ఇప్పుడు కొత్త ట్రెండ్‌ ఒకటి పురుడు పోసుకుంది. పుట్టబోయేది ఆడబిడ్డా, 

మగబిడ్డా అని ముందే తెలుసుకుంటున్నారు. చట్టాన్ని అతిక్రమించి మరీ తెలుసుకున్న రహస్యాన్ని చుట్టాలతో పంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జెండర్‌ రివీల్‌ పార్టీలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

కడుపులో నలుసు పడ్డప్పటి నుంచీ కాబోయే తల్లిదండ్రులకు ఆరాటం. ‘మా ఇంట మహాలక్ష్మి పుడుతుందా? చిన్ని కన్నయ్య పుడతాడా?’ అని నవమాసాలూ ఎదురుచూస్తుంటారు. స్కానింగ్‌కు వెళ్లినప్పుడల్లా స్క్రీన్‌పైన కదులుతున్న బొమ్మ అర్థం కాకున్నా మనసుకు తోచినట్టుగా ఊహించేసుకుంటారు. డాక్టర్‌ ఇచ్చిన రిపోర్టులో ఎక్కడైనా తమకు కావాల్సిన సమాచారం ఉందా అని తెగ వెతికేస్తుంటారు. ఇంట్లో పెద్దలు ఊరుకుంటారా? వేవిళ్ల నాటి నుంచి సీమంతం ముచ్చట వరకు గర్భిణి హావభావాలను నిశితంగా పరిశీలించి, క్రోడీకరించి  జోస్యం చెబుతూ ఉంటారు. బిడ్డ రూపాన్ని ఊహించుకుంటూ సంతృప్తి చెందకుండా.. ఎవరు పుట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈతరం తల్లిదండ్రులు. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఇప్పుడీ ట్రెండ్‌ జోరుమీదున్నది. అది అమ్మాయైనా, అబ్బాయైనా ఒకేలా ఆనందిస్తున్నా.. ఆ ముచ్చటేదో ముందుగానే తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

గులాబీ పువ్వా.. నీలం నవ్వా: లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 ప్రకారం.. పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. కానీ, సంపన్న కుటుంబాలకు చెందిన కొందరు ఈ విషయంలో చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. డాక్టర్‌ దగ్గర ఉన్న చొరవతో విషయాన్ని సంగ్రహించి ముందస్తుగానే సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీలు ఇస్తున్నారు. బంధుమిత్రులను పిలిచి ఘనంగాఅతిథి సత్కారాలు చేసి ఆ రహస్యాన్ని అందరితో పంచుకుంటున్నారు. పార్టీకి తగ్గట్టుగా పరిసరాలను గులాబీ, నీలం రంగు రిబ్బన్లు, కాగితాలతో అలంకరిస్తున్నారు. విదేశాల్లో ఈ సంస్కృతి రెండు దశాబ్దాల నుంచీ ఉన్నదే! పాశ్చాత్య పోకడ ఇప్పుడు ఇక్కడ కూడా మొదలైంది. ఈ పార్టీ కోసం లక్షల్లో ఖర్చుపెడుతున్నారు. విదేశాలకూ వెళ్తున్నారు. ఇందుకోసం ఈవెంట్‌ ఆర్గనైజర్లను సంప్రదిస్తున్నారు. కాన్సెప్ట్‌ను ప్రతిబింబించే కేకులూ తెప్పిస్తున్నారు! కాకపోతే, కరోనా కాలంలో ఈ సందడి కొంత మందగించింది.

ముందస్తుగా వద్దు: అనధికారికంగా జరిగే ఈ తంతు ఆనందాలు పంచుకునేంత వరకైతే ఇబ్బంది లేదు. కానీ, లింగవివక్షకు దారితీస్తే ఆ నేరంలో అందరూ భాగస్వాములు అయినట్టే. అయినా, ముందుగా తెలుసుకొని మురిసిపోవడంలో ఆనందం ఏముంటుంది. ఎవరు పుడతారా అన్న ఆరాటం ఆపరేషన్‌ థియేటర్‌లో నొప్పులు పడుతున్న అమ్మకు చిన్న ఉత్కంఠ. థియేటర్‌ బయట కంగారుగా పచార్లు చేస్తున్న తండ్రికి లోపలి నుంచి వినిపించే బిడ్డ ఏడుపు, తర్వాత డాక్టర్‌ వచ్చి చెప్పే తీపి కబురు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. వీటిని కాదని ముందస్తుగా సంబురాలు చేసుకోవడం.. ఆ ప్రయత్నంలో చట్టాన్ని అతిక్రమించడం అంటే - ఓ మధురమైన అనుభవాన్ని చేజార్చుకోవడమే!logo