శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 28, 2020 , 00:21:40

చాటింగ్‌.. సాక్ష్యం అవుతుందా?

చాటింగ్‌.. సాక్ష్యం అవుతుందా?

మా పెండ్లయి ఎనిమిదేండ్లయింది. ఇప్పుడు ఆయనకు  వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. నేను చాటింగ్‌ కూడా చూశాను.  ఆయన్ని నిలదీస్తే.. అయితే ఏంటని పెద్ద గొడవ చేశాడు. ఇదంతా ఫోన్‌ కాల్‌ రికార్డులలో ఉంది. ఆయన, తన ప్రియురాలితో చేసిన చాటింగ్‌ ఆధారంగా.. నేను ఉండగానే, వాళ్లిద్దరూ ఇంకో కాపురం పెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. పైగా నాకూ, నా పిల్లలకూ సంబంధించిన ప్రాథమిక అవసరాలనూ నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆరు నెలలుగా ఇదంతా భరిస్తున్నాను. ఇక విసిగిపోయాను. ఇప్పుడు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను. నా దగ్గరున్న ఆధారాలతో విడాకులు వస్తాయా?- వినీల, హైదరాబాద్‌

మగవాడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారం ఇప్పటికీ మన సమాజంలో పాతుకుపోయి ఉండటం విషాదకరం. అందుకే ప్రశ్నించిన మిమ్మల్ని అతను దుర్భాషలాడాడు. ‘ఏం చేసుకుంటావో చేసుకొమ్మ’ని సవాలు విసిరాడు. తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది అమ్మాయిలు భర్త చేసిన తప్పులను బయటపెడితే తమను చులకన చేస్తారన్న భయంతో మౌనంగా ఉంటుంటారు. కానీ తప్పు చేసింది అతను. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు రావాలి. డైవోర్స్‌ (అమెండ్‌మెట్‌) యాక్ట్‌, 2001 ప్రకారం తొమ్మిది సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చని సూచించారు. అందులో మొదటిది అడల్టరీ. అంటే కుటుంబ బాధ్యతలు గాలికొదిలేసి మరో మహిళతో సంబంధం కొనసాగించడం. ఈ గ్రౌండ్‌ కింద వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంటే విడాకుల కోసం దావా వేయవచ్చు. మీ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగిందో వివరిస్తూ, మీరు చెప్పిన సాక్ష్యాలు ఉదహరిస్తూ, ఆ కారణంగా విడాకులు కోరుతున్నట్టు పిటిషన్‌లో తెలపాలి. మీ ఫోన్‌ రికార్డింగ్‌ని ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌గా పిటిషన్‌కు జత చేసి, కేసు ఫైల్‌ చేయాలి. మీకు పిల్లలు ఉంటే వారి వివరాలు కూడా రాయాలి. చిన్న పిల్లలైతే కస్టడీ తల్లికే ఇస్తారు. విజిటింగ్‌ రైట్స్‌ మాత్రమే తండ్రికి ఇస్తారు. పెద్ద పిల్లలైతే వారు ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారో కోర్టు విచారించి నిర్ణయిస్తుంది. పిటిషన్‌ ద్వారా  మెయింటనెన్స్‌ కోసం కూడా కోరవచ్చు. అతని ఆర్థిక స్థితిగతులను బట్టి, మీ పరిస్థితిని బట్టి ఎంత ఇవ్వాలో కోర్టు నిర్ణయిస్తుంది. పిల్లల ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రే భరించాల్సి ఉంటుంది.logo