మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Sep 27, 2020 , 03:01:26

చాందినీగా.. పేరొచ్చింది

చాందినీగా.. పేరొచ్చింది

రెండేండ్ల జర్నీ.. నాలుగు సినిమాలు.. 

కానీ, ఈ అమ్మడి జోరు చూస్తుంటే ఇంకో రెండేండ్లలో అరడజను సినిమాల్లో కనిపించేలా ఉంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌'తో కెరీర్‌ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసుకున్న నభా నటేష్‌ తన అల్లరంతా సినిమాల్లోనే అంటున్నది. తెరవెనుక మాత్రం సైలెంట్‌ అని చెబుతున్నది. ఇంజినీరింగ్‌ చదివిన ఈ యువ హీరోయిన్‌ నాటకరంగం నుంచి వచ్చింది. వెండితెరపై నవతరం నాయికల్లో వైవిధ్యానికి చిరునామాగా నిలుస్తున్న బెంగళూరు భామ నభా నటేష్‌ను ‘జిందగీ’ పలుకరించింది.

కరోనా వేళ  చిత్రీకరణల్లో పాల్గొనేందుకు అందరూ ఆలోచిస్తున్నారు. మీరు సినిమా షూటింగ్‌లో బాగానే పాల్గొంటున్నారే..

షూటింగ్‌ అనగానే నేనూ కాస్త గాబరాపడ్డాను. ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎంత వరకు రక్షణ ఉంటుందో అన్న సంశయాలతోనే సెట్‌లో అడుగుపెట్టా. కానీ, నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌, గ్లౌవ్స్‌ ధరిస్తున్నారు. మేకప్‌ సిబ్బంది పీపీఈ కిట్స్‌లో ఉంటున్నారు. అందరిలోనూ స్వీయ అప్రమత్తత కనిపించింది. అన్నిటికన్నా ఆరేడు నెలల గ్యాప్‌ తర్వాత సెట్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. మొదటిసారి కెమెరా ముందుకొచ్చిన అనుభూతి కలిగింది.

ఇండస్ట్రీలోకి వచ్చి రెండేండ్లయింది కదా.. ఎలా అనిపిస్తున్నది?

మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే తపనతోనే ప్రతి ఒక్కరూ కెరీర్‌ ప్రారంభిస్తారు. నేనూ అదే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి వచ్చా. కథానాయికగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిసే సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టా. కానీ, రెండేండ్లలోనే జీవితం ఇంతలా మారిపోతుందని ఊహించలేదు. మూడు సినిమాలతోనే ఇంత సక్సెస్‌ సాధిస్తానని అనుకోలేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రం నేను ఆశించిన గుర్తింపునిచ్చింది. నా నటన, డ్యాన్స్‌, ముఖ్యంగా తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పిన తీరుకు మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్‌ సక్సెస్‌ లభించింది. సినిమా హిట్టవ్వడంతో పాటు నా పాత్ర కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పటికీ నన్ను చాలామంది ఆ చిత్రంలో చేసిన పాత్ర పేరుతోనే.. చాందినీ అని పిలుస్తున్నారు. ఆనందంగా ఉంది.

పాత్రల పరంగా మీరు ఎలాంటి సవాళ్లను ఇష్టపడతారు?

సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేసేదాన్ని. అక్కడే నటనకు మెరుగులు దిద్దుకున్నా. రంగస్థల అనుభవం కొత్త పాత్రలు చేయడానికి స్ఫూర్తి. ఒకే ఒరవడిలో సినిమాలు చేయ డం నాకు నచ్చదు. కమర్షియల్‌, ఆర్ట్‌ అన్న భేదాలు లేకుండా రకరకాల పాత్రలు చేయాలనుంది. సవాళ్లతో కూడిన పాత్రలతో నా ప్రతిభను పూర్తిస్థాయిలో నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.

 తెలుగు తెరకే పరిమితమవుతారా.. ఇతర భాషల్లోనూ నటించాలని భావిస్తున్నారా?

తెలుగులోనే నటించాలని ప్రణాళికలు వేసుకొని ఇండస్ట్రీలోకి రాలేదు. నాటకాల్లోని నా ప్రతిభను గమనించిన నిర్మాతలు ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నా నటనకు మంచి పేరురావడం, ‘ఇస్మార్ట్‌ శంకర్‌' కమర్షియల్‌ సక్సెస్‌ కావడంతో తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి.  తమిళంలో సినిమాలు చేయబోతున్నా. మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. కథ, పాత్రలు నచ్చితే కన్నడంలో మళ్లీ నటిస్తా.

సోలో బ్రతుకులో ఎలాంటి లాభనష్టాలుంటాయని అనుకుంటున్నారు? 

సింగిల్‌గానే కాదు  వైవాహిక జీవితంలో సంతోషం ఇమిడి ఉంటుందన్నది నా సిద్దాంతం. ఆనందం అనేది మనుషుల మనస్తత్వం, వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది.

ఆ భయం ఎప్పుడూ లేదు

నెపొటిజం కొత్తగా ఇప్పుడు మొదలైందేమీ కాదు. అలాగే వారసత్వం లేకుండా రాణించినవాళ్లు నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. నెపోటిజం వల్ల నాకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. 

ఇండస్ట్రీలో తెలిసిన వారు ఎవరూ లేరనే ఆలోచనలు, భయాలు నాలో ఎప్పుడూ కలుగలేదు. ప్రతిభే 

ఎదుగుదలకు ప్రామాణికమని విశ్వసిస్తా. వృత్తి గురించి తప్ప ఇతర అంశాలపై ఎప్పుడూ దృష్టిపెట్టను. నాటకాలు, సినిమా ఏదైనా నా పనిని ఎంజాయ్‌ చేస్తుంటాను. 


సంతోషాలు దూరమైనా..

లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత రెండు నెలలు కష్టంగా గడిచాయి. గతంలో షూటింగ్‌ల నుంచి విరామం దొరికితే విహార యాత్రలకు వెళ్లేదాన్ని. ఫ్రెండ్స్‌తో సరదాగా సమయాన్ని  గడిపేదాన్ని. కానీ, కరోనా వల్ల ఆ సంతోషాలన్నీ దూరమయ్యాయి. ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం మాత్రం లభించింది. నా చదువంతా హాస్టల్స్‌లోనే సాగడంతో చాలా ఏండ్లపాటు ఇంటికి దూరంగా ఉన్నా. ఆ తర్వాత సినిమాలతో బిజీ కావడంతో కుటుంబంతో ఒకటి రెండు రోజులు మినహా ఎక్కువ కాలం ఉండలేకపోయేదాన్ని. లాక్‌డౌన్‌  కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో ఏడెనిమిదేండ్ల తర్వాత మా సొంతూరు చిక్‌ మగళూరు వెళ్లా. అక్కడే అమ్మమ్మ ఇంట్లో మూడు నెలలు ఉన్నా. మళ్లీ బాల్యపు రోజులన్నీ తిరిగివచ్చినట్లయింది. చిన్నపిల్లగా మారిపోయిన అనుభూతి కలిగింది. కజిన్స్‌తో ఇండోర్‌ గేమ్స్‌ ఆడుతూ, అమ్మానాన్నలతో కబుర్లు చెబుతూ సంతోషంగా గడిపా.

సినిమా పరమైన ఒత్తిడుల నుంచి ఎలా దూరమవుతుంటారు..

ఒత్తిడితో ఉన్నప్పుడు ఎక్కువగా పెయింటింగ్స్‌ వేస్తూ రిలాక్స్‌ అవుతాను. బొమ్మలు గీయడంలో నాకు ఎక్కువ ఆనందం దొరుకుతుంది. 

నటిగా మీ సక్సెస్‌ వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత ఉంది?

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సినిమాల్లోకి పంపించడానికి భయపడుతుంటారు. కానీ మా అమ్మానాన్నలు మాత్రం నన్ను ప్రోత్సహించారు. నేను హీరోయిన్‌గా గొప్ప పేరుతెచ్చుకోవాలనేది మా అమ్మ కోరిక. కళల పట్ల నాకున్న అభిరుచిని గుర్తించిన అమ్మ నన్ను నాటక రంగంలోకి అడుగుపెట్టేలా వెన్నుతట్టింది. అమ్మ తోడ్పాటు వల్లే నటినయ్యాను. అలాగే అమ్మానాన్నల తర్వాత నా బలం తమ్ముడే. చాలా విషయాల్లో నాకు సపోర్ట్‌గా ఉంటాడు. ప్రస్తుతం తను చదువుకుంటున్నాడు. చిన్నతనంలో ఇద్దరం బాగా పోట్లాడేవాళ్లం.  ఇప్పుడు మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. 

 ప్రస్తుతం చేస్తున్న సినిమా సంగతులు చెబుతారా..

అల్లుడు అదుర్స్‌, సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాల్లో రెగ్యులర్‌కు భిన్నంగా నా పాత్రలుంటాయి. ఆడియన్స్‌ను మెప్పిస్తాయనే నమ్మకముంది. ‘సోలో బ్రతుకే సో బెటర్‌'లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే అమ్మాయిగా కనిపిస్తాను. ఎవరు చెప్పినా తన పంథా మార్చుకోని తత్వం అన్నమాట. నా గత చిత్రాలతో పోలిస్తే పాత్రచిత్రణ కొత్తగా ఉంటుంది. అలాగే అంధాధూన్‌ రీమేక్‌లో నటిస్తున్నా.

తెలుగు చిత్రసీమలో కన్నడ అమ్మాయిలు చాలామంది రాణిస్తున్నారు. మీరు కన్నడ అమ్మాయి కావడం కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడింది?

భాషాభేదాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఎవరైనా హార్డ్‌వర్క్‌ చేయాల్సిందే. తొలి సినిమా సమయంలో భాష తెలియక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కొత్త ఇండస్ట్రీ, తెలియని మనుషులు కావడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందోననే సందేహాలు ఉండేవి. గతంలో తెలుగు సినిమాలు చాలా చూశాను. చూడటం వేరు నటించడం వేరని సెట్స్‌లో అడుగుపెట్టిన తర్వాతే అర్థమైంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమా తొలిరోజు షూటింగ్‌కు వచ్చే ముందు నాకు ఇచ్చిన డైలాగ్స్‌ను నాలుగు రోజులు ప్రాక్టిస్‌ చేశాను. భాషపై పట్టుంటే పాత్రలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. అంతేకాదు సెట్స్‌లో ఇతరులు చెప్పేది ఏమిటో అర్థంచేసుకోవచ్చు. ఏడాదిపాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నా. కన్నడ భాషకు కొంత దగ్గర పోలికలు ఉండటంతో తెలుగు నేర్చుకోవడం సులభమైంది. కానీ, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే పరిజ్ఞానం ఇంకా రాలేదు. నా తెలుగులో కొన్నిసార్లు కన్నడ పదాలు దొర్లుతుంటాయి.

నరేష్‌ నెల్కి


logo