సోమవారం 26 అక్టోబర్ 2020
Zindagi - Sep 25, 2020 , 00:26:33

ఎద్దు పాలు!

ఎద్దు పాలు!

అక్బర్‌ పాదుషా ఓ రోజు బీర్బల్‌ను ఆటపట్టించాలనుకున్నాడు. ఏం చేసినా బీర్బల్‌ ఏదో ఒక యుక్తి పన్ని తప్పించుకుంటున్నాడు.కాబట్టి, ఈసారి అతడికి కఠినమైన సమస్య ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు వింతైన పని అప్పగించాలనుకున్నాడు. నిండు సభలో  బీర్బల్‌ను పిలిచి ఇలా ఆదేశించాడు... ‘బీర్బల్‌ నాకు ఎద్దుపాలు కావాలి. ఎలాగైనా సరే తీసుకురా’.   ఎద్దులు  పాలు ఇవ్వవు కదా! అందుకే బీర్బల్‌ని ఇబ్బంది పెట్టడానికి అక్బర్‌ ఇలా అడిగాడు.  అందుకు బీర్బల్‌ ‘ప్రభూ ఎద్దుపాలు అంతసులభంగా దొరకవు. కానీ మీరు అడిగారు కాబట్టి,  తెస్తాను.  నాకు  నాలుగు రోజుల సమయం ఇవ్వండి’ అని విన్నవించుకున్నాడు. ‘సరే’ అన్నాడు అక్బర్‌. ఆ మర్నాడు తన రాజప్రాసాదానికి దగ్గరలో యమునా నది ఒడ్డున విహరించడానికి అక్బరు వెళ్లాడు. అక్కడ  ఒక దృశ్యం కనిపించింది. ఒక స్త్రీ చెమటలు కక్కూతూ బండెడు బట్టలు నది ఒడ్డున ఉతుకుతున్నది. చూడటానికి ఆమె చాలా ఉన్నత కుటుంబం నుండి వచ్చినదానిలా కనిపిస్తున్నది. అందుకనే ‘అమ్మాయీ ! నువ్వు కలవారి పిల్లలా ఉన్నావు. ఇన్ని బట్టలు స్వయంగా ఉతుకుతున్నావేంటి. ? ఒక పని మనిషిని పెట్టుకోలేపోయావా?’ అని అడిగాడు. దానికి ఆమె ‘ప్రభూ మీరు ఊహించిన విధంగానే నేను అయినింటి పిల్లను. మా ఇంటి నిండా దాసీలు ఉన్నారు. కానీ మా ఆయన గర్భం దాల్చారు. ఈ పనులన్నీ నేను చేయాల్సి వస్తున్నది’ అని సమాధానం చెప్పింది. ‘మగవారు ఏమిటీ, గర్భం ధరించడం ఏమిటీ ?’ అని ఆశ్చర్యంగా అడిగాడు అక్బర్‌. ‘దీనికింత ఆశ్చర్యం ఎందుకు ప్రభూ? రోజులు మారాయి. ఈ రోజుల్లో ఎద్దులు పాలు ఇస్తున్నాయి. అలాగే   మగాళ్ళు గర్భం దాల్చి  పిల్లల్ని కూడా కంటున్నారు’  అన్నది.  అప్పుడు అక్బర్‌కు ఇదంతా బీర్బల్‌  ఎత్తుగడే అని తెలిసింది.  సాధ్యం కాని పనులు అప్పగిస్తే ఫలితం ఉండదని  గుర్తించాడు. బీర్బల్‌ తెలివితేటలకు మెచ్చిన అక్బర్‌ మర్నాడు సభలో అతడిని ఘనంగా సత్కరించాడు. సభికులు బీర్బల్‌ను ప్రశంసించారు.


logo