మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Sep 25, 2020 , 00:26:20

భార్యకూ కావాలి ఓ జీవితం!

భార్యకూ కావాలి ఓ జీవితం!

కాలం మారింది. ఆడామగా ఇప్పుడు సమానమే. పెండ్లయినా ఉద్యోగాలు చేస్తున్నారు కదా! వాళ్ల చీరల్ని వాళ్లే సెలెక్ట్‌ చేసుకుంటున్నారుగా. ఇంకేం కావాలి? అన్న అభిప్రాయమే వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కాస్తతో తృప్తిపడిపోయే వారికి, పెండ్లి తర్వాత కూడా ఎలా ఎదగవచ్చో నిరూపిస్తున్నారు అనితా పీటర్‌! ఆమె రచయిత, బైకర్‌, నాట్యకారిణి, శిక్షకురాలు.. అన్నింటికీ మించి ఇద్దరు పిల్లలను తనలా తీర్చిదిద్దుతున్న తల్లి. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న అనిత ‘జిందగీ’కి చెప్పిన కబుర్లివి..

నేను పుట్టి పెరిగింది కేరళలో. సంప్రదాయ వాతావరణంలోనే పెరిగినా... నాకంటూ ఓ వ్యక్తిత్వాన్ని అలవర్చుకునే స్వేచ్ఛను అందించారు నాన్న. అందుకే పెండ్లి నిశ్చయం అయిందని తెలియగానే జీవితం మారిపోతుందేమో అని భయపడ్డా. వివాహం తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. జెట్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తూ, ఒక్కో మెట్టూ ఎదిగాను. అటు ఉద్యోగానికి... ఇటు ఇంటికి సమన్యాయం  చేస్తున్న నన్ను చూసి... నేను ఏమైనా చేయగలననే నమ్మకం ఏర్పడింది మా వారికి. ప్రతి భర్తకీ, తన భార్య ఇంటిని సమర్థంగా చక్కబెట్టుకోవాలని ఉంటుంది. ఆ నమ్మకం కలిగించగలిగితే, ఆమె ఎదుగుదలకు అడ్డుపడడు. నిరంతరం ఎవరో ఒకరు మనల్ని ముందుకు వెళ్లమంటూ ప్రోత్సహించాలని ఎదురుచూస్తూ కూర్చుంటే మాత్రం, అడుగు కూడా ముందుకు వేయలేం. నా పిల్లలకి ఎలాగైతే ఓ మంచి జీవితం అందించాలని కోరుకుంటానో, అలా నాకు కూడా ఓ జీవితం ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! జీవితాంతం రాజీ పడిపోయి... ‘మీ కోసం నా జీవితాన్ని ధారపోశాను చూశారా’ అని దెప్పిపొడిచే తల్లిని చూసి ఎవరికి మాత్రం సంతోషంగా ఉంటుంది! కాకపోతే అటు కుటుంబాన్నీ, ఇటు వ్యాపకాలనీ సమన్వయం చేసుకుంటూ సాగడం ఓ సవాలే. అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అటు నృత్యం.. ఇటు డ్రైవింగ్‌


ఉద్యోగం మానేశాక మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను, నటనలోనూ ప్రవేశించాను.. నేను మలయాళంలో నటించిన ఓ సీరియల్‌కి మంచి పేరే వచ్చింది. ఓ బ్యూటీ కాంటెస్ట్‌లోనూ పాల్గొన్నాను. 2001లో నాకు ఇష్టమైన మోహినీ ఆట్టం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు మా పాపకి ఏడాదిన్నర వయసు. తనను తీసుకునే డాన్స్‌ క్లాసులకు వెళ్లేదాన్ని. క్రమంగా డాన్స్‌ నా ప్యాషన్‌గా మారిపోయింది. అందుకే 2015లో ‘లాస్య దృథ’ పేరుతో ఓ సంస్థను స్థాపించాను. ఇక్కడ నాట్యం, సంగీతం, నటన... దేన్నయినా నేర్చుకోవచ్చు. వయసుతో పని లేదు, కులమతాల ప్రసక్తి లేదు. తాపత్రయం ఉంటే చాలు. నాకు చిన్నప్పటి నుంచి బైక్‌ నడపడం అంటే చాలా ఇష్టం. అందుకే బైకర్‌గా మారాను. ఓసారి ఏకంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బైక్‌ మీదే ప్రయాణించాను. సుదూర ప్రాంతాలకు సాగే బైక్‌ సవారీ ఓ సాహసం మాత్రమే కాదు. కొత్త ప్రాంతాలు, కొత్త అనుభవాలు, కొత్త మనుషులు... మొత్తంగా ఓ కొత్త జీవితాన్నే అందిస్తుంది. దాంతోపాటుగా సురక్షితంగా ప్రయాణించాలనే బాధ్యతనూ గుర్తుచేస్తుంది. మగవాళ్లు ప్రయాణానికి బయల్దేరితే చాలా సహజంగా భావిస్తారు. కానీ ఆడవాళ్ల ప్రయాణం అనగానే... ‘కుటుంబం సంగతి ఏమిటి?’ అని అడుగుతారు. పనిమనిషికి అప్పగింతలు చెప్పి, పిల్లలకి జాగ్రత్తలు చెప్పి, కూరగాయలు తెచ్చిపెట్టి బయల్దేరాల్సి వస్తుంది.

మూడుసార్లు డిప్రెషన్‌!

ఎవరికన్నా క్యాన్సర్‌ వచ్చిందని వినగానే... ఎందుకు అని అడగరు. కానీ డిప్రెషన్‌ వచ్చిందని చెప్పగానే ఎందుకు అని అడిగేస్తారు. ‘కుటుంబంలో ఏదన్నా సమస్యా!’ అని వాకబు చేస్తారు. ఏమీ లేదని చెబితే... ‘మూడు కుక్కలున్నాయి, హార్లీ డేవిడ్‌సన్‌ ఉంది, పెద్ద కారుంది, మీ ఆయన కూడా మంచిగానే చూసుకుంటాడు... ఇక డిప్రెషన్‌ ఎందుకు వచ్చిందీ...’ అని ఆశ్చర్యపోతారు. డిప్రెషన్‌కు సవాలక్ష కారణాలుంటాయి. చాలా సందర్భాలలో చిన్నపాటి సమస్యే ఒత్తిడి కలిగించే స్థాయికి చేరుకోవచ్చు. అందుకని ఎలా వచ్చింది అనే దాని బదులు ఎలా బయటపడాలి అని ఆలోచించాలి. ఒక సైకియాట్రిస్ట్‌ని కలుసుకోవాలి. వాళ్లు ఇచ్చే మందులను ఆపకుండా వాడాలి. కౌన్సెలింగ్‌ కోసం సర్టిఫైడ్‌ కౌన్సిలర్ల దగ్గరకే వెళ్లాలి. నాట్యం లాంటి ప్రత్యామ్నాయాలు చికిత్సలో భాగంగా ఉపయోగపడతాయి కానీ... అవే చికిత్స అనుకుంటే మాత్రం మనసు మరింతగా అలసిపోయి, సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంది. డిప్రెషన్‌ మీద నా అనుభవాలు, అధ్యయనాల సారాంశంతో ‘To Win Your Battles STAY ALIVE’ అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం ఆధారంగా ఈమధ్యే మూడు లఘు చిత్రాలను కూడా రూపొందించాను. జీవితం నిరాశలో కూరుకుపోయినప్పుడు... మన మనసును తేలికపరచడానికి ఓ మనిషి కావాలి, అది అపరిచితుడైనా సరే! ఆ సమయంలో, నువ్వు ముందుకు వెళ్లాలి అని చెప్పేందుకు సాటి మనిషి ఒకరుండాలి; ఆత్మహత్య చేసుకోవాలనే బలమైన ఆలోచనను ఓ అరగంట పాటు నిలువరించగలిగితే ఆ ప్యానిక్‌ ఎటాక్‌ దాటిపోతుంది; ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాధపడి ఉపయోగం లేదు... ఎవరి జీవితంలో అయినా కష్టాలు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే బతికి ఉండాల్సిందే!... ఇదే ఆ మూడు లఘుచిత్రాల సారాంశం.

ఆడవాళ్లు జీవితంలో ఎదగాలంటే కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఎక్కడో దొరికేది కాదు. నైపుణ్యాలను అలవర్చుకుంటే... నమ్మకం దానంతట అదే వస్తుంది. అందుకే కార్పొరేట్‌ రంగంలోని మహిళలు నైపుణ్యం సాధించేందుకు ‘పర్సోనా స్క్రిప్ట్‌' అనే సంస్థను స్థాపించాను. మహిళా సాధికారత కోసం, డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యల పరిష్కారం కోసం మరింతగా కృషి చేయడమే నా లక్ష్యం. అందుకోసం హైదరాబాదే నా కార్యక్షేత్రం. ఇదే నా పుట్టిల్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి భాష, ఆహారం, శిల్పకళలు అన్నీ నాకు చాలా ఇష్టం. ఐ లవ్‌ హైదరాబాద్‌!

ఆ మూడూ ఉండాల్సిందే!

నా దృష్టిలో పరిపూర్ణమైన జీవితం కోసం మూడు అంశాలు చాలా అవసరం. వృత్తి- మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, జీవితం గడవడం కోసం, ఆర్థికపరమైన బాధ్యతలు తీరడం కోసం ఓ ఉద్యోగం చేయక తప్పదు. ప్రవృత్తి- మనతో మనం గడపడానికీ, మనసు తేలికపడటానికీ తోటపని చేయడం, సంగీతం వినడం.. లాంటివి అలవర్చుకోవాలి. అనురక్తి- ఓ విషయం పట్ల మనకి ఉండే ప్యాషన్‌ జీవితానికి ఓ అర్థాన్ని ఇస్తుంది. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవడానికీ, ఆ రంగంలో మరింత లోతులకు వెళ్లడానికీ ప్రోత్సహిస్తుంది. జీవితం ఓ సెలయేరులాంటిది.. ప్రవాహం ఆగిపోతే, మురికికూపంలా మారిపోతుంది.


logo