బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Sep 24, 2020 , 00:11:43

ఇక్కడ డాటా నొక్కితే!

ఇక్కడ డాటా నొక్కితే!

ఎక్కడ చికాగో, ఎక్కడ కోల్‌కతా?బేస్‌బాల్‌ టోర్నమెంట్‌కు కోల్‌కతాలోనిఆడవాళ్లకు సంబంధం ఏమిటి?కానీ, ఇక్కడ ఈ మగువలు చేసిన విశ్లేషణ అక్కడ విజేతను నిర్దేశించాయి. నమ్మశక్యం కాని ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఐమెరిట్‌ సంస్థ. చికాగో కబ్స్‌ 108 ఏండ్ల చరిత్రను తిరగరాసి 2016లో వరల్డ్‌ సిరీస్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? చదివేయండి మరి.

కోల్‌కతాలో మినీ లక్నోగా పేరున్న ప్రాంతం మెటియాబ్రజ్‌. ఆంగ్లేయుల కాలంలో అవధ్‌ నుంచి వలసొచ్చిన బాధితులు చాలామంది ఇక్కడ సిరపడ్డారు. చదువులు అంతంత మాత్రమే. పోటీ ప్రపంచంతో పరుగెత్తే తెలివితేటలు లేవు వాళ్లకు. ఇక మహిళల గురించి చెప్పాలంటే కష్టాలే తప్ప ఇష్టాలేం కనిపించవు. వీరి జీవితాలను ఓ మహిళ మార్చేసింది. ఆవిడ పేరే రాధా బసు. విద్యాధికురాలు, సామాజిక స్పృహ ఉన్న దార్శనికురాలు. 2006లో మార్పునకు శ్రీకారం చుట్టారామె. భర్త దీపక్‌తో కలిసి ‘అనుదీప్‌' ఫౌండేషన్‌ ప్రారంభించారు. ఈ నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ ఇ-కామర్స్‌ రంగంలో అడుగుపెట్టింది. ఏండ్లు గడిపోయాయి. పది మందికీ ఉపాధినిస్తున్నామన్న తృప్తితో రాధా బసు ఆనందంగా ఉంది. కానీ, మారుతున్న సాంకేతికత ఆమెలో కొత్త ఆలోచనలను పురిగొల్పింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్సీ, బిగ్‌ డాటా, విషయ విశ్లేషణ తదితర అంశాలు ఆమెకు ఆసక్తి కలిగించాయి. విదేశాలకు చెందిన మిత్రుల సలహాతో కొత్త అధ్యాయానికి తెరదీసింది రాధా బసు.

అనాలసిస్‌ అస్త్రం

డాటా అన్నోటేషన్‌ రంగానిదే భవిష్యత్తు అని నిర్ధారించుకున్న రాధ 2012లో ఐమెరిట్‌ సంస్థను ప్రారంభించింది. డాటా విశ్లేషణ చేసి సరైన పరిష్కారాలు చూపడం ఈ సంస్థ పని. ఆధునిక సాంకేతికతతో దీన్ని సాధించాలి. వ్యవసాయం, వైద్యం, క్రీడలు ఇలా పలు రంగాల్లో సేవలు అందించడం మొదలుపెట్టింది. సంస్థ కార్యాలయాన్ని కాలిఫోర్నియాతోపాటు కోల్‌కతాలోని మెటియాబ్రజ్‌లో నెలకొల్పింది. అదే ప్రాంతంలో ఉంటున్న యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అనుదీప్‌ ఫౌండేషన్‌ ద్వారా వారికి డాటా అనాలసిస్‌లో శిక్షణ ఇప్పించింది. ఆమె అంచనాలకు మించి నేర్చుకున్నారు వాళ్లు. నూతన ఉత్సాహంతో రంగంలోకి దిగారు. తమకు కావాల్సిన డాటా విశ్లేషించాల్సిందిగా ఎన్నో సంస్థలు ఐమెరిట్‌ తలుపుతట్టాయి. వాళ్లు కోరుకున్న సమాచారాన్ని, పరిష్కారాలను చూపి అనతి కాలంలోనే ఐమెరిట్‌ మంచి గుర్తింపు సాధించింది. ఆ క్రమంలోనే బేస్‌బాల్‌ క్లబ్స్‌ రాధా బసును సంప్రదించాయి. ప్రత్యర్థి జట్టు బలాబలాలు విశ్లేషణ చేయాల్సిందిగా కోరాయి. సాంకేతిక విద్యకు ఆమడ దూరంలో పెరిగిన యువతులకు ఈ బాధ్యతను అప్పగించింది రాధ. కృత్రిమ మేధ, ఇతర ఆధునిక సాంకేతిక విధానాలను అనుసరించి చికాగో కబ్స్‌కు కావాల్సిన సమాచారం ఇచ్చారు. వారి విజయంలో పరోక్ష భూమికను పోషించారు.

సింహభాగం మహిళలే

రెండు కార్యాలయాలతో ప్రారంభమైన ఐమెరిట్‌ ఇప్పుడు తొమ్మిది కేంద్రాల నుంచి సేవలు అందిస్తున్నది. 60 మంది ఉద్యోగులున్న చోట ప్రస్తుతం 2,800 మంది పనిచేస్తున్నారు. వీరిలో 50 శాతం మంది మహిళలే! మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది నాన్‌ మెట్రో నగరాలకు చెందిన వారే! పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు అవకాశాలు కల్పిస్తే.. వాళ్లు అద్భుతాలు చేస్తారని తమ సంస్థ నిరూపించిందని అంటున్నది రాధా బసు. మనదేశంలో కోల్‌కతా, బారుయీపుర్‌, రాంచీతోపాటు భూటాన్‌లోనూ ఐమెరిట్‌ శాఖలున్నాయి. ఆధునిక సాంకేతికతో సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి అవసరమైన పరిష్కారాన్ని చూపుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఐమెరిట్‌ ఉద్యోగులు. తమ ఉద్యోగులు విజయం సాధించినప్పుడల్లా వారికి అవకాశం ఇచ్చినందుకు ఒకింత గర్వంగా ఉందంటారు రాధా బసు. బిడ్డలు గెలిచినప్పుడు ఏ తల్లికి మాత్రం గర్వంగా ఉండదు!


logo