గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 23, 2020 , 00:49:45

దక్షిణాది..ట్విట్టర్‌ స్టార్స్‌!

దక్షిణాది..ట్విట్టర్‌ స్టార్స్‌!

ఓ ట్వీట్‌ ఏం చేయగలదు? ఏమైనా చేయగలదు. సమస్యని నేరుగా ప్రధానమంత్రికే మొరపెట్టగలదు. వేలకోట్ల వ్యాపారాన్ని తారుమారు చేయగలదు. యుద్ధాన్ని ఆపగలదు. పోరుకు ఆజ్యం పోయనూగలదు. ఆ ‘నూట నలభై’ అక్షరాలకు ఉన్న శక్తి అపారం. రాజకీయాల్లో అయితే, ట్విట్టర్‌లో బలగాన్ని బట్టే ఓ నేత బలాన్ని అంచనా వేయవచ్చు. ‘తెలంగాణ జాగృతి’ అధినేత్రి కల్వకుంట్ల కవిత పది లక్షలమంది అనుచరులతో సోషల్‌ మీడియాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న సందర్భంగా దక్షిణాదిలోని మహిళా నేతల ట్విట్టర్‌ ఖాతాలపై ఓ కథనం. 

‘పది’లమైన స్థానం @10,00,000+

కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక సారథిగా నిలిచారు. బతుకమ్మకు గ్లోబల్‌ హోదా తెచ్చారు. #SistersForChange, #GiftAHelmet లాంటి హాష్‌టాగ్‌లతో ట్విట్టర్‌లో సామాజిక ఉద్యమాలను నడిపించారు. కొవిడ్‌ సమయంలో అయితే, దేశవిదేశాల్లో ఉన్నవారు ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు... స్పందించి వీలైనంత సాయాన్ని అందించారు. సామాజిక మాధ్యమం అనేది సామాన్యుడి చేతిలోని బ్రహ్మాస్త్రమని విశ్వసించే కవిత.. పదిలక్షల ఫాలోవర్ల మైలురాయితో తన బాధ్యత మరింత పెరిగిందని చెబుతారు. రాజకీయ రంగంలో ఈ మార్కును అధిగమించిన తొలి దక్షిణాది నేతగా కవిత ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. 

‘స్వతంత్ర’ భావాలు @2,49,800+


తెలుగింటి అమ్మాయి సుమలత... కన్నడిగుల మనసులోనూ చోటు సంపాదించుకున్నారు. అంబరీష్‌ను పెండ్లాడి కస్తూరివారి ఆడపడుచుగా స్థిరపడిపోయారు. గత ఉప ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించారు.  కర్ణాటక నుంచి పార్లమెంటుకు ఎన్నికైన తొలి స్వతంత్ర మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. రాజకీయాలు, భాష, సమాజసేవ.. తదితర విషయాల మీద ఆమె చేసే ట్వీట్ల కోసం రెండున్నర లక్షల మంది అనుచరులు ఎదురుచూస్తుంటారు.

గళమే బలం @8,31,200+


కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘అభిమన్యు’లో కథానాయికగా తెలుగువారికి సుపరిచితురాలే. కర్ణాటకకు చెందిన దివ్య స్పందన ఉరఫ్‌ రమ్య... రాజకీయాల్లోనూ మంచి మార్కులే కొట్టేశారు. గతంలో, మాండ్యా నియోజకవర్గం నుంచి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ప్రస్తుతం అటు సినిమాలకూ ఇటు రాజకీయాలకూ దూరంగా ఉన్నా... సామాజిక సమస్యల మీద మాత్రం నిరంతరం తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. 8,31,200 మంది అభిమానులను నిత్యం పలకరిస్తూనే ఉన్నారు.

‘కని’కట్టు! @5,25,900+


కనిమొళి.. కరుణానిధి గారాల పుత్రిక. తన తరఫున ఢిల్లీలో వినిపించిన గొంతుక. తండ్రి రాజకీయాలకే కాదు, రచనా వ్యాసంగానికి కూడా వారసురాలు. 2జి స్కామ్‌తో ప్రతిష్ట కొంత మసకబారినా, ఒకనాటి వైభవాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రికెట్‌ నుంచి పార్లమెంట్‌ సమావేశాల వరకు... తన అభిప్రాయాల్ని ట్విట్టర్‌తో పంచుకోకుండా ఉండలేరు. 5,25,900 మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు.

టీచరమ్మ ట్వీట్స్‌ @1,33,300+


కేరళలో అంతా ‘శైలజా టీచర్‌' అనే గౌరవంగా పిలుచుకుంటారు. గతంలో టీచర్‌గా పనిచేయడం వల్ల మాత్రమే కాదు... జీవితాన్నే ఓ పాఠంగా మార్చుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే అందుకు ప్రధాన కారణం. కొవిడ్‌ లాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఆమె దక్షతకు దేశమంతా ఫిదా అయ్యింది. ఇంతకుముందు నిపా వైరస్‌ విజృంభించిన సమయంలోనూ ఆమె సేవల్ని రాష్ట్రం మర్చిపోలేదు. ఆరోగ్యం, మహిళా సాధికారత మీద తన పదునైన ప్రకటనలు వినేందుకు లక్షా ముప్పై మూడువేల మంది   సిద్ధంగా ఉంటారు.

పొలిటికల్‌ రైటర్‌ @1,26,100+


వ్యవసాయ నేపథ్యం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన జోతిమణి సెన్నిమళై...ప్రజాస్వామ్య విశిష్టతకు ప్రతీక. ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టే తమిళనాట, జాతీయ పార్టీ కాంగ్రెస్‌ నుంచి ఎంపీ స్థానాన్ని నెగ్గడం మరో ప్రత్యేకత. నేతగానే కాదు, రచయిత్రిగానూ గుర్తింపు తెచ్చుకున్న జోతిమణి ట్వీట్లు కూడా ఆమె రచనలంత ఆహ్లాదంగా ఉంటాయి. అందుకే 1,26,100 మంది ఆమెను అనుసరిస్తున్నారు.


logo