శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 23, 2020 , 00:49:51

సమయానికి తాగితేనే..

సమయానికి తాగితేనే..

ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, మూడ్‌ను మార్చడానికి.. అన్నిటికీ ఇప్పుడు  ఏకైక మంత్రం గ్రీన్‌ టీ. పొద్దున లేవగానే ఒకటి, మధ్యాహ్నం మరొకటి, సాయంకాలం ఇంకోటి.. ఇలా ఆరోగ్య సాధనలో ఆపసోపాలు పడుతున్న ఎందరో గ్రీన్‌ టీని తెగ జుర్రేస్తున్నారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్‌ టీ తాగితే మేలు కలిగే మాట అటుంచితే, కీడు జరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.కాఫీ, టీ కంటే గ్రీన్‌ టీ ఆరోగ్యకరమైనదని చెప్పడంలో అనుమానమే లేదు. కానీ, లాభాలున్నాయి కదా అని అతిగా తాగితే సమస్యే. క్రమ పద్ధతిలో తీసుకుంటే ఈ తేనీరు వల్ల జీవక్రియలు సజావుగా సాగుతాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.

సరైన సమయం..

సరైన సమయంలో తాగితే గ్రీన్‌ టీ వల్ల ప్రయోజనాలను పొందొచ్చు. ఉదయాన్ని మించిన అనువైన సమయం లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వర్కవుట్లకు ముందు ఒక కప్పు గ్రీన్‌ టీ తాగితే మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇందులోని కెఫిన్‌, ఎల్‌-థియనైన్‌ రెండూ ఏకాగ్రతను పెంచుతాయి. బ్యాడ్‌ మూడ్‌ను పూర్తిగా మార్చేసి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. వర్కవుట్లకు ముందు తీసుకోవడం వల్ల కొవ్వులు కరిగే ప్రక్రియ వేగంగా సాగుతుంది. అంతగా అవసరం అనుకుంటే సాయంత్రం కొద్దిగా తాగవచ్చు.

ఇప్పుడొద్దు..

వేళ కాని వేళ గ్రీన్‌ టీ తాగితే అనర్థాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసిన తర్వాత గ్రీన్‌ టీ తాగితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందట. గ్రీన్‌ టీలోని కొన్ని కాంపౌండ్స్‌, ఆహారం ద్వారా లభించే మినరల్స్‌తో జట్టుకడతాయి. మినరల్స్‌ను శరీరం శోషించకుండా ఇవి అడ్డుకుంటాయి. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా గ్రీన్‌ టీ సిప్‌ చేస్తే సమస్యలు తప్పవంటున్నారు. ఉదయం పూట తాగితే ఉత్తేజాన్ని కలిగించే ఈ తేనీరు, రాత్రి పడుకునేబోయే ముందు తాగితే ఒత్తిడిని కలుగజేస్తుందట. అందుకే సమయానుకూలంగా గ్రీన్‌ టీని ఆస్వాదిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.