శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 22, 2020 , 00:30:09

నవాబుల కోటలో లాజవాబ్‌ కళ

నవాబుల కోటలో లాజవాబ్‌ కళ

తెల్లచీరకు నల్లంచు అందాన్నిస్తుంది. పచ్చ చీరకు ఎర్ర కొంగు బంగారమై మెరిసిపోతుంది. ఏ రంగుకైనా హంగులిచ్చే లాజవాబ్‌ కళ ఒకటుంది. అదే చికన్‌కారీ. చీర అంచుల్లో గజిబిజి అల్లికలతో అలరించే ఎంబ్రాయిడరీ.. పైటనెక్కితే చూపు తిప్పుకోవడం కష్టమే! అంత అందంగా ఉంటుంది మరి!! నవాబుల నగరంగా ప్రసిద్ధి చెందిన లక్నోలో పుట్టింది చికన్‌కారీ. ఈ వస్త్ర అలంకరణ శైలి శతాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నది. చీరలకే కాదు డ్రస్‌ మెటీరియల్స్‌కు, చోళీ గాగ్రాలకు, చుడీదార్‌లకు కొత్త సొబగులు అద్దుతున్నది.

లక్నోలోని చౌక్‌ మార్కెట్‌. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ దొరకని వస్తువు లేదు. ఆ వస్తు వైభవాన్ని చూస్తూ వీధుల్లోకి వస్తే వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఆ పక్కనే కొందరు మహిళలు ఏదో పనిలో నిమగ్నులై ఉంటారు. తీక్షణంగా చూస్తూ సూదులతో విన్యాసాలు చేస్తుంటారు. సాదాసీదా చీరకు కొత్త సోకులు అల్లుతూ దర్శనమిస్తారు. ఏదో స్వరానికి లయ బద్ధంగా కదులుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి వారి చేతులు. సూదులతో చకచకా పొడుస్తూ పని కానిచ్చేస్తుంటారు. ఏ విత్తూ నాటకుండానే నిమిషాల్లో చీరంత లతలు పెనవేసుకుంటాయి. మరుక్షణంలో ఆ తీగలకు పూలు పూస్తాయి. ఇదంతా చికన్‌కారీ మహాత్మ్యం. ఉర్దూ భాష నుంచి వచ్చిన చికన్‌కారీ పదం లిపికి తగ్గట్టే విచిత్ర విన్యాసంతో సచిత్రంగా చీర స్వరూపాన్నే మార్చేస్తుంది.

కొత్తరూపుతో..

శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ ఎంబ్రాయిడరీ కళను నమ్ముకొని వేలమంది అక్కడ జీవనోపాధి పొందుతున్నారు. చేయి తిరిగిన ఈ కళాకారులు పట్టుచీర పల్లూపై ఎత్తుపల్లాల కొండలను ఇట్టే నిర్మించేస్తారు. ప్లేన్‌ ఆర్గంజాపై లైన్‌ లైనుకూ పూలు పూయిస్తుంటారు. మస్లిమ్‌ మెరుపులకు విరుపులు నేర్పిస్తారు. నెట్టెడ్‌ క్లాత్‌కు సెట్టయ్యే డిజైన్లు అల్లేస్తారు. వీళ్లే కాదు ఫ్యాషన్‌ డిజైనర్లు, సాధారణ మహిళలు సైతం ఏండ్లుగా చికన్‌కారీని ఆదరిస్తున్నారు. చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌పై ఎంబ్రాయిడరీ పరిచి మురిసిపోతున్నారు. యంత్రాల జోరు కొనసాగుతున్న ఈ రోజుల్లోనూ చికన్‌కారీకి డిమాండ్‌ తగ్గలేదు. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటున్నది. తెలుపులోనే లభ్యమయ్యే అల్లికలు ఇప్పుడు రంగురంగుల్లో దర్శనమిస్తున్నాయి. పట్టుదారాలతోనూ ఓ పట్టుపడుతున్నారు. కాటన్‌, సెమీ జార్జెట్‌, ప్యూర్‌ జార్జె ట్‌, సిల్క్‌, క్రేప్‌, చిఫా న్‌ తదితర ఫ్యాబ్రిక్‌లపై చికన్‌కారీ వర్క్‌ సరికొత్త హొయలు పోతున్నది.

అల్లుకున్న కథలెన్నో

చికన్‌కారీ అల్లికల్లో చాలా కథలు గూడుకట్టుకున్నాయి. ఎప్పుడో మూడో శతాబ్దంలో ఈ కళ పురుడు పోసుకుందని కొందరి అభిప్రాయం. మెగస్తనీస్‌ ఈ కళను చూసి అబ్బురపడ్డారని చెబుతారు. జహంగీర్‌ భార్య, మొఘల్‌ సమ్రాజ్ఞి నూర్జహాన్‌ హయాంలో చికన్‌కారీ ప్రభ వెలిగిందని చరిత్రకారులు చెబుతారు. మొఘల్‌ దర్బారులో పర్షియన్‌ కులీనులకు చికన్‌కారీపై మంచి పట్టు ఉండేదట. లక్నోలోని చౌక్‌ మార్కెట్‌లో అడిగితే మాత్రం  ఇంకేవో చిత్రమైన కథలు చెబుతారు. మా తాతముత్తాత ముత్తాత తాత దాహంగా ఉన్న ఓ బాటసారికి నీళ్లు ఇచ్చాడనీ, దాహం తీర్చినందుకు కృతజ్ఞతగా అతడు  చికన్‌కారీ కళ నేర్పాడనీ, అలా వంశపారంపర్యంగా ఈ కళను కొనసాగిస్తున్నామని వివరిస్తారు. ఎప్పుడు, ఎక్కడ పుట్టిందో గానీ, ఈ ఎంబ్రాయిడరీ కళ.. చీరలనే కాదు, రకరకరాల వస్త్రశ్రేణిలోనూ తన ఆధిపత్యం చెలాయిస్తున్నది.

లెహంగాకు కొత్త హంగులు 

చికన్‌కారీతో ముస్తాబైన ఫ్యాబ్రిక్‌తో లెహంగాలు, లాంగ్‌ గౌన్లు, ఇండో వెస్టర్న్‌ షార్ట్‌ ఫ్రాక్స్‌, స్కర్ట్‌ డిజైన్‌ చేసుకోవచ్చు. ప్లేన్‌, ప్రింటెడ్‌ శారీస్‌కు సరిపడా కాంట్రాస్ట్‌తో వర్క్‌ చేయించుకోవచ్చు. చికన్‌కారీతో కుర్తిస్‌ కూడా చాలా బాగుంటాయి. కాలేజ్‌ వేర్‌గా రెగ్యులర్‌గా వేసుకోవచ్చు. దుపట్టా లాగా కూడా క్యాచీగా ఉంటుంది. చికన్‌కారీ చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. నచ్చిన ఫ్యాబ్రిక్‌లో ప్లెయిన్‌ చీర తీసుకొని డిజైన్‌ చేసుకోవచ్చు. సీక్వెన్స్‌ బోర్డర్‌ కానీ ఫ్లవర్స్‌ బోర్డర్స్‌  కానీ బాగుంటాయి. హాఫ్‌ అండ్‌ హాఫ్‌లో సగం వరకు చికన్‌కారీ, మిగతా ఫ్లోరల్‌ సీక్వెన్స్‌ నెట్‌ ప్లాన్‌ చేసుకుంటే లుక్‌ బాగుంటుంది. పెండ్లిళ్లప్పుడు సంగీత్‌ ఫంక్షన్స్‌లో ధరిస్తే అందరి కండ్ల్లూ ఇటువైపే!