శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 19, 2020 , 22:59:40

ఈ జర్నీ చాలా చిన్నది

ఈ జర్నీ చాలా చిన్నది

రాత్రంతా తళుకులీనే తారలు పగలైతే కనిపించకుండా మాయమైపోతాయి. ఈ తారక మాత్రం పదిహేనేండ్లుగా వెండివెన్నెల తెరపై మెరుస్తూనే ఉంది. మొదటి సినిమాతోనే ‘సూపర్‌' అని ఈలలు వేయించుకున్నా, ‘అరుంధతి’గా ఠీవి ప్రదర్శించినా, దేవసేనగా రాజ్యమేలినా, ‘భాగమతి’గా భయపెట్టినా.. అనుష్క తెలుగు వారందరికీ స్వీటీనే! అవకాశాలను సోపానాలుగా మార్చుకొని అందనంత ఎత్తుకు చేరుకున్న ఈ బ్యూటీని ఇటీవల ‘జిందగీ’ పలుకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది. తేదీ సహా గుర్తుంది. మార్చి 12,  2005. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌. ‘సూపర్‌' సినిమా కోసం నాపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. నేను కెమెరా ముందుకు రావడం అదే మొదటిసారి. ఏం జరుగుతుందో తెలిసే లోపే షాట్‌ అయిపోయింది. కెమెరా ముందు నటించడం, డ్యాన్స్‌ చేయడం అన్నీ కొత్తే. చాలా భయపడిపోయా. ఎలా నటించానో తెలిసేలోపే సినిమా రిలీజైంది. సినిమాల్లోకి వచ్చి పదిహేనేండ్లు అయిపోయిందా? అనిపిస్తున్నది. ఈ రోజుల్లో 15 ఏండ్ల కెరీర్‌ పూర్తిచేయడం గ్రేట్‌ అంటున్నారంతా! నాకు అలా అనిపించడం లేదనుకోండి. అయినా వారి ప్రశంసలను బాధ్యతగా స్వీకరిస్తా. మరింత కష్టపడతా.  మంచి అవకాశాలు నన్నీ స్థాయిలో నిలబెట్టాయి. తొలి చిత్రం సూపర్‌ నుంచి ఇప్పటి నిశ్శబ్దం వరకు ప్రతీ సినిమాతో ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నా.

యోగా నా జీవితంలో ఓ భాగం. ఇప్పటికీ యోగా, మెడిటేషన్‌ రోజూ చేస్తాను. ట్రావెలింగ్‌కు ప్రాధాన్యమిస్తాను. సంగీతం వింటాను. విరామం దొరికితే సన్నిహితులకు సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతాను.  కొన్ని సార్లు ఏం చేయకుండా ఖాళీగా ఉంటాను. ఏదైనా కొత్తగా నేర్చుకుంటాను. 

చిన్నప్పటి నుంచీ నాకు చారిత్రక కథలంటే ఇష్టం. చారిత్రక వ్యక్తుల జీవితగాథల గురించి సినిమాలు వస్తే వెంటనే చూస్తాను. అందుకే ‘రుద్రమదేవి’ కథ వినగానే వెంటనే తెరపై చూసుకోవాలనే ఆత్రుత కలిగింది.

నేను టీవీ చూడను. వార్తలు చదవను. ఎవరైనా, నీ గురించి ఫలానా వార్త వచ్చిందని చెబితేనే నాకు తెలుస్తుంది.  ఎందుకు రాస్తారో నాకు తెలియదు. సోషల్‌ మీడియాలో నేను లేను. నా అభిమానులే ఓ ఖాతాను కొనసాగిస్తున్నారు. అందులో నా గురించి పాజిటివ్‌ వార్తలే పోస్ట్‌ చేస్తుంటారు.

స్టార్‌డమ్‌ తెలియదు

తెలుగు సినీ పరిశ్రమలోని గొప్ప గొప్ప నటుల ప్రయాణంతో పోలిస్తే నాది చిన్న జర్నీనే. 30 ఏండ్ల్లుగా పరిశ్రమలో ఉంటూ ఇప్పటికీ అంకిత భావంతో పనిచేసే నటీనటులు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు సినిమాలు పెద్దగా చూసింది లేదు. నటీనటులు, స్టార్‌డమ్‌ అంటే తెలియదు. తొలినాళ్లలో ప్రతిదీ కొత్తగానే ఉండేది. చిత్రసీమ నుంచి వెళ్లేలోపు ఏదో ఒకటి నేర్చుకోవాలి, కష్టపడాలనే తపనతో వచ్చాను. నేర్చుకున్నాననే అనుకుంటున్నాను.

అవకాశమే గొప్పది

సినిమాల్లోకే వస్తానని అనుకోని నాకు ఎన్ని అద్భుతమైన అవకాశాలు వచ్చాయో! బాహుబలి, రుద్రమదేవి వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటిస్తానని అస్సలు ఊహించలేదు. ఇదంతా అదృష్టమే! సినీరంగంలో అన్నింటికన్నా గొప్పది అవకాశమే. అది వచ్చిందంటే మన ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతైనా కష్టపడుతాం. అవకాశమే రాకపోతే ఎంత ప్రతిభ ఉండి ఏం లాభం. అదృష్టవశాత్తు నాకు మంచి చాన్స్‌లు వచ్చాయి. నటిగా ఎంతో నేర్చుకున్నా. నటనలో పరిణతి సాధించగలిగా. అన్నింటికన్నా ముఖ్యంగా  సుదీర్ఘకాలం కొనసాగడానికి కష్టపడేతత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తాను. నాలో ఏదో ప్రతిభ ఉందనే సూపర్‌లో అవకాశమిచ్చారు. అలాగే ‘విక్రమార్కుడు’ చేస్తున్నప్పుడు నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ‘అరుంధతి’ నాతో చేయొచ్చని నమ్మారు. కెరీర్‌లో వచ్చిన ప్రతి మంచి అవకాశాన్నీ ఒడిసిపట్టుకున్నాను. అది నన్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందా లేదా అన్నది పక్కనపెట్టి మనసుపెట్టి నిజాయతీగా శ్రమించాను. కొన్నిసార్లు మనం చేసే పని గొప్పది కాకపోయినా శ్రమించాల్సిందే. పరాజయాల మాటంటారా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని జీవితాన్ని కొనసాగించడం చాలా అవసరం.

కొత్త ప్రయత్నం ‘నిశ్శబ్దం’

‘నిశ్శబ్దం’ కథ చెప్పినప్పుడు పూర్తి ‘స్లైంట్‌' సినిమాగా రూపొందించాలని అనుకున్నాం. హేమంత్‌ మధుకర్‌ చక్కటి స్క్రీన్‌ ప్లేతో ఈ కథను తయారు చేశారు. కొత్తగా ఉంటుందనే ఆలోచనతో అంగీకరించాను. తొలుత  ఈ పాయింట్‌ విన్నప్పుడు డైలాగ్స్‌ లేకుండా ఎలా నటించాలో అర్థం కాలేదు. ఎలాగైనా చేయాలనే ఆసక్తి రేకెత్తించింది. మూగ యువతిగా నటించాలనే ప్లాన్‌ చేసుకోలేదు. కథలోనే నా పాత్ర అలా ఉండటంతో అలా జరిగిపోయింది. సంతోషంగా జీవితాన్ని వెళ్లదీసే చిత్రకారిణిగా కనిపిస్తాను. సియాటెల్‌లోని ఓ అనాథాశ్రమంలో పెరిగిన ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. హార్రర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుంది. నాతో పాటు అంజలి, మాధవన్‌, సుబ్బరాజు, షాలిని.. ప్రతి క్యారెక్టర్‌ కథలో కీలకమే.

టైమ్‌ రావాలి

పెండ్లి ఓ అందమైన భావన. దానిని రహస్యంగా దాచిపెట్టలేం. ఎవ్వరికీ తెలియకుండా ఎలా చేసుకుంటాం. రూమర్స్‌ అంటారా పట్టించుకోకుండా వదిలేస్తాను. పెండ్లికి నేను వ్యతిరేకం కాదు. వివాహమనేది నేచురల్‌గా జరగాలి. అందుకు టైమ్‌ రావాలి. సరైన భాగస్వామి దొరకాలి. ఇద్దరికీ పెండ్లి చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. జీవితంలో అమ్మానాన్నలు ఎంత ముఖ్యమో పెండ్లి చేసుకునే వ్యక్తికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. 

నాకు ఇష్టమైతేనే

మంచి కథలకు ప్రాధాన్యమిస్తున్నాను. ఇది వరకు చేసిన కథ, పాత్రలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాను. ప్రస్తుతం సినిమాల ట్రెండ్‌ మారిపోతున్నది. ఇన్నొవేటివ్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తున్నాయి. నా సహచర నాయికలు కూడా విభిన్నమైన కథల్ని ఎంచుకొని చాలెంజింగ్‌ రోల్స్‌ చేస్తున్నారు. కంఫర్ట్‌జోన్‌కు పరిమితం కాకుండా ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేయాలి. కథను ప్రేక్షకుల కోణంలో వింటాను. ఆ కథలో నన్ను నేను చూడటానికి ఇష్టపడితేనే ఒప్పుకొంటాను.