ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Sep 19, 2020 , 22:59:47

ఆ సినిమా చేసి ఉంటే..

ఆ సినిమా చేసి ఉంటే..

చదువులో గ్యాప్‌ వస్తే విద్యార్థికి శ్రద్ధ తగ్గుతుంది. ఆటగాడికి గ్యాప్‌ వస్తే ఆ ప్రభావం ఫిట్‌నెస్‌ మీద పడుతుంది. ఈ ముద్దుగుమ్మ ఎన్నిసార్లు గ్యాప్‌ తీసుకున్నా.. అమె కీర్తి తగ్గలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 ఏండ్లు కావొస్తున్నా ఇప్పటికీ అదే జోష్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నది. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిన ఆమెకు తెలుగువారంటే ప్రత్యేక అభిమానం. ‘తూర్పు పడమర’ సీరియల్‌తో మొదలైన ఆమె కీర్తి పతాక ఇప్పుడు ‘హిట్లర్‌ పెళ్లాం’తో రెపరెపలాడుతున్నది. లేట్‌గా రీఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్‌గా అదరగొడుతున్న బుల్లితెర నటి కీర్తీ జై ధనుష్‌ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలివి.

ఇప్పుడంటే బుల్లితెరపై కనిపిస్తున్నది కానీ, కీర్తి మొట్టమొదటగా వెండితెరపై కనువిందు చేసింది. అదీ బాలనటిగా. తొమ్మిదేండ్లున్నప్పుడు ‘గట్టి మేళ’ అనే కన్నడ సినిమా కోసం తొలిసారి మేకప్‌ వేసుకుంది. బాలనటిగా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నది. అదే జోరులో పదిహేనో ఏట హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది. ‘వీఐపీ 5’ కన్నడ చిత్రంతో ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే చదువు మీద ఆసక్తితో ఇండస్ట్రీకి గ్యాప్‌ ఇచ్చింది. చదువులో కొన్నాళ్లు మునిగింది. 

నట కుటుంబం

కీర్తి ఇంట్లో తనొక్కతే నటి కాదు. వాళ్ల నాన్న రంగస్థల నటుడు. కీర్తి తండ్రి శివశంకర్‌ వృత్తిరీత్యా పోలీస్‌. నటనపై ఆసక్తితో కన్నడ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలు పోషించాడు. కీర్తి అక్క మంజుల కూడా బుల్లితెర నటి కావడం విశేషం. ‘అక్క, బావ, నేను, మా ఆయన మొత్తం నలుగురం నటనలో కొనసాగుతున్నాం. మాది నట కుటుంబమే’ అని చెప్పుకొచ్చింది కీర్తి. అయితే సినిమాల్లో అవకాశాలు వస్తున్న తరుణంలో చదువుపైకి దృష్టి మళ్లడం వల్ల గ్యాప్‌ వచ్చిందంటున్నది కీర్తి. ‘డైరెక్టర్‌ శశాంక్‌ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆ ఆఫర్‌ను అందుకొని ఉంటే టాప్‌ హీరోయిన్‌ అయ్యుండేదాన్నేమో!’ అంటుంది కీర్తి. తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న అక్కతో అప్పుడప్పుడు షూటింగ్‌కు వచ్చేది కీర్తి. ఆమెను చూసినవారంతా ‘నువ్వూ నటించొచ్చు కదా!’ అనేవారట. అనుకోకుండా ఓసారి దాసరి నారాయణరావు బ్యానర్‌లో వచ్చిన ‘తూర్పు పడమర’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది కీర్తి.

నా హీరో మా ఆయనే

‘తూర్పు పడమర’ చేస్తున్న సమయంలోనే తోటి కళాకారుడు జైధనుష్‌తో ఆమెకు స్నేహం కుదిరింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెండ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్పారు. ‘మా పెద్దలను ఒప్పించడం కష్టమైంది. ఇద్దరి భాషలు వేరు, ప్రాంతాలు వేరు, పైగా నేనంటే పిచ్చి ప్రేమ. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పంపడం మా వాళ్లకు అసలు ఇష్టం లేదు. అందుకే నో చెప్పారు. ఓపికగా నచ్చజెప్పి ఒప్పించి పెండ్లి చేసుకున్నాం. నా ఫేవరెట్‌ హీరో మా ఆయనే’ అని చెప్పుకొచ్చింది.

మళ్లీ రెండేండ్ల విరామం

తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న కీర్తికి తమిళం, మలయాళం నుంచి ఆఫర్లు వచ్చాయి. వాటి మీద దృష్టి పెట్టడంతో దాదాపు ఇక్కడ రెండేండ్ల గ్యాప్‌ వచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల అక్కడ సీరియల్స్‌ నిలిచిపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసింది కీర్తి. ‘హిట్లర్‌ గారి పెళ్లాం’తో తెలుగులో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. ‘ఈ సీరియల్‌లో చాలా మంచి పాత్ర దొరికింది. సరదాగా సాగిపోయే క్యారెక్టర్‌. ఈ కథే చాలా డిఫరెంట్‌. షూటింగ్‌ చాలా సందడిగా సాగుతున్నది. ఇంట్లో ఫంక్షన్‌ జరుగుతున్నట్టే ఉంద’ని అంటున్నది కీర్తి.

“వర్కవుట్‌ అంటే తెలియదు నాకు. ఏ రోజూ జిమ్‌కు వెళ్లింది లేదు. దేవుడి దయ వల్ల ఇలా ఉన్నాను. నటన విషయానికి వస్తే రమ్యకృష్ణ నా ఫేవరెట్‌. ఆమెలా అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలన్నది నా కల. హిందీ సీరియల్స్‌ చేయాలనుకున్నా.. లాక్‌డౌన్‌ కారణంగా ఓ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది.”

భవాని


logo