గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Sep 19, 2020 , 00:31:48

కండ్ల ముందే... భల్లాలదేవుడి పెండ్లి సందడి

కండ్ల ముందే...  భల్లాలదేవుడి పెండ్లి సందడి

ఓ పదేండ్ల తర్వాత... మన అభిమాన నటుడి ఆడియో ఫంక్షన్‌ జరుగుతున్నది.  వెయ్యి రూపాయల టికెట్‌ పెట్టి, హాయిగా దాన్ని వీఆర్‌ హెడ్‌సెట్‌లో చూసేయవచ్చు. బ్లాక్‌బస్టర్‌ సినిమా ఒకటి విడుదల అయ్యింది. వీఆర్‌ తగిలించేసుకుని అందులో లీనమైపోవచ్చు. మాయాబజార్‌ సినిమాలో ప్రియదర్శని పెట్టెలాగా, మనకు ఇష్టమైనవారిని నేరుగా కలిసినంత తృప్తితో మాట్లాడవచ్చు. ఏమో ఎవరికి తెలుసు! ఇప్పుడు కేవలం చూపులకు మాత్రమే పరిమితమైన వీఆర్‌, స్పర్శ లాంటి అనుభూతులను కూడా అందించే రోజులు వస్తాయేమో! అప్పుడిక నేరుగా వధూవరులను ఆశీర్వదించి అక్షతలు వేయవచ్చు. తథాస్తు!

పెండ్లంటే పందిళ్లు... సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు... తరాలు గడిచినా ఈ వరుసలో ఏ మార్పూ రాలేదు. కానీ కొవిడ్‌ పుణ్యమా అని అతిథులకు మాత్రం కొరత వచ్చేసింది. సామాజిక దూరం కోసమో, ప్రభుత్వ నిబంధనలను అనుసరించో, వైరస్‌కి భయపడో... కారణం ఏదైతేనేం కళ్యాణమండపంలో సందడి చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. అటో పదిమంది, ఇటో పదిమంది అన్నట్టుగానే ఉంది షాదీ వ్యవహారం.  ఈ లోటును తీర్చేందుకు ఇప్పుడు సాంకేతికత సాయపడుతున్నది.

మీరు ఓ ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నారు. దాని కోసం పదేపదే ఎక్కడెక్కడో ఉన్న ఇళ్ల చుట్టూ తిరగడం ఎంత శ్రమో కదా! కానీ రియల్‌ ఎస్టేట్‌ ఏజంట్‌ మీరున్న చోటే,  ప్రతి గదినీ తిప్పి చూపించగలిగితే! అలాగే ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు... దానికి సంబంధించిన అన్ని మోడల్స్‌ను సేల్స్‌మెన్‌ మీ ఇంట్లో ఉన్న వీఆర్‌ సెట్‌ ద్వారా వివరించగలిగితే! ఇది ఊహ కాదు. ఇప్పటికే మొదలైపోయిన ట్రెండ్‌. 

మర్చిపోయారా! ఇవాళ రాముడు బాబాయ్‌ వాళ్ల కూతురు పెండ్లి. మనం లేకపోతే బాబాయ్‌ బాధపడతాడని చెప్పా కదా...’ అంటూ ఓటీటీలో పదో సీజన్‌లో పన్నెండో ఎపిసోడ్‌ చూస్తున్న ప్రసాద్‌ను గదమాయించింది పార్వతి. ప్రసాద్‌ నాలిక్కరుచుకుంటూ సోఫా లోంచి లేచాడు. ఆపై లోపలికి వెళ్లి ఓ రెండు వీఆర్‌ హెడ్‌సెట్లు తీసుకువచ్చాడు. వాటిని పెట్టుకోగానే కళ్యాణమండపం ప్రత్యక్షమైపోయింది. నేరుగా అక్కడ ఉన్నట్టు 3డీ ఎఫెక్టులో పెండ్లి మొదలైపోయింది. కాశీయాత్ర దగ్గర నుంచి సప్తపది వరకు అంతా శుభ్రంగా వీక్షించారు ప్రసాద్‌ దంపతులు. చివరికి జీపేలో వెయ్యినూటపదహార్లు చదివించి కన్నీళ్లు తుడుచుకుంది పార్వతి. వినడానికి కాస్త వింతగా ఉన్నా, ఈ ట్రెండ్‌ ఇప్పటికే మొదలైపోయింది. ఆన్‌లైన్‌ క్లాసులు, జూమ్‌ మీటింగుల్లాగా... పెండ్లిండ్లకి వీఆర్‌ సాంకేతికత సరికొత్త అమరిక.

రానాతో ప్రచారంలోకి

భల్లాలదేవుడికి పెండ్లి కుదిరిందనగానే, అది ఎంత ధూంధాంగా జరుగుతుందా అని అందరూ ఎదురుచూశారు. ఇంతలో పానకంలో పుడకలా కొవిడ్‌ వచ్చేసింది. ఇప్పుడప్పుడే అది తగ్గుముఖం పట్టేలా లేకపోవడంతో మొన్న ఆగస్టులో వివాహానికి సిద్ధమైపోయారు. అందుకోసం రామానాయుడు స్టూడియోలో భారీ ఏర్పాట్లు చేశారు. కానీ యాభై మందికి మించి వివాహానికి హాజరు కాకూడదనే ప్రభుత్వ నిబంధన ఒకటుంది కదా! అందుకే నాగచైతన్య, సమంత, రామ్‌చరణ్‌, అలు ్లఅర్జున్‌ లాంటి అతికొద్ది మంది మాత్రమే నేరుగా విచ్చేశారు. మరి మిగతావారి సంగతి! అందుకే రానా, తన పెండ్లి ఆహ్వానపత్రికతో పాటు అందరికీ వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) పరికరాలు కూడా అందించాడు. పెండ్లి సమయానికి లాగిన్‌ అయినవాళ్లకి... తన వివాహం ప్రత్యక్షమైంది. నాని, అనిల్‌ రావిపూడి, మంచు లక్ష్మి లాంటి వాళ్లంతా వీఆర్‌తో పెండ్లిని చూడటమే కాకుండా, ఆ సాంకేతికతను తెగ మెచ్చేసుకున్నారు. ‘వీఆర్‌తో అక్కడే ఉండి వివాహాన్ని చూసిన అనుభూతి కలిగింది’ అని అనిల్‌ రావిపూడి మెచ్చుకున్నాడు. అభిమానుల కోసం మధ్యలో కాసేపు... పెండ్లిని వీక్షించే లింక్‌ని పబ్లిక్‌కి అందుబాటులో ఉంచారు రానా. ‘వీఆర్‌ ద్వారా వివాహం చేసుకోవడం ఓ సరికొత్త ట్రెండ్‌. దీంతో అతిథులకు శ్రమ తప్పడమే కాకుండా, వధూవరులకు కూడా వినూత్నరీతిలో పెండ్లి చేసుకుంటున్నామనే తృప్తి ఉంటుంది. అందుకని రాబోయేరోజుల్లో, ఈ సాంకేతికత మరింత ఊపందుకుంటుంది’ అంటున్నారు ఫొటోగ్రాఫర్‌ కిషోర్‌ కృష్ణమూర్తి.

ఏమంత తేలిక కాదు!

రానాకు మొదటి నుంచీ ఈ తరహా సాంకేతికత మీద పట్టు ఉంది కాబట్టి, వీఆర్‌ను ఉపయోగించుకున్నాడు. తను నటుడు కాకముందే గ్రాఫిక్స్‌కి సంబంధించిన వ్యాపారంలో ఉన్నాడు మరి. మిగతావాళ్ల సంగతి ఏమిటి? వీఆర్‌లో 360 డిగ్రీల కోణంలో చిత్రీకరణ ఉండి, మనం నేరుగా కళ్యాణమండపంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి అటు చిత్రీకరణకు, ఇటు వీఆర్‌ హెడ్‌సెట్‌కు కూడా చాలా ఖర్చవుతుంది. అందుకే ఏఆర్‌ (ఆగుమెంటెడ్‌ రియాలిటీ) ను ఆశ్రయిస్తున్నారు మరికొందరు. ఈ సాంకేతికత ద్వారా నేరుగా ఫోన్‌ ద్వారానే కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. కళ్ల ముందే జరుగుతున్నట్టు ఉన్నా, మనం ఉన్న ప్రదేశం మాత్రం మాయమైపోదు. ఏఆర్‌, వీఆర్‌ సాంకేతికతల ద్వారా కేవలం వివాహాలే కాదు... షాపింగ్‌, రియల్‌ఎస్టేట్‌ లాంటి లావాదేవీలు కూడా సాధ్యం కానున్నాయి. అందుకే ‘ముందుముందు కాన్ఫరెన్సుల దగ్గర నుంచీ కిరాణా కొట్ల వరకూ వర్చువల్‌ రియాలిటీదే రాజ్యం కానుంది’ అని ధీమాగా చెబుతున్నారు ‘వర్చువల్‌ రాస్తా’ అధినేత ప్రేమ్‌కుమార్‌. టెలిమెడిసిన్‌, గేమింగ్‌ రంగాలలోనూ వీఆర్‌తో అనూహ్యమైన మార్పులు రానున్నాయి.