శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Sep 18, 2020 , 03:28:15

మురికివాడలో సృజనో భవంతు

మురికివాడలో సృజనో భవంతు

సమాజం నుంచి  ఏదైనా తీసుకోవటంలో ఆనందం ఉండొచ్చు. కానీ ఇవ్వడంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందని భావించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలోపర్ల్‌ గంటా ఒకరు. అనాథలను చేరదీసి సృజనాత్మకతను వరంగా ప్రసాదిస్తున్నది. వారిలోని నైపుణ్యాలకు పదునుపెట్టి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నది. ఫిల్మ్‌ మేకింగ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నది. ముత్యాల నగరం హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఈ ఆణిముత్యం.. మురికివాడల్లో ముత్యాలను వెలికితీస్తున్నది.

భాగ్యనగరిలో పుట్టి పెరిగిన పర్ల్‌ గంటాకు ఆకాశహర్మ్యాల్లో కనిపించని కోణమేదో మురికివాడల్లో తారసపడింది. అనాథాశ్రమాల్లో తనకు కావాల్సిందేదో దొరికింది. ఆమె ఎంచుకున్న రంగం అలాంటిది మరి! చిత్ర నిర్మాతగా అభిరుచికి తగ్గవాటినే నిర్మిస్తుంది. రచయితగా తన మనసును తొలిచిన భావాలకు అక్షర రూపమిస్తుంది. దర్శకురాలిగా వాటిని తెరకెక్కిస్తుంది. స్వయంకృషితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తనలోని సృజనాత్మకతతో విభిన్న కథనాలను ఆవిష్కరించిన పర్ల్‌ మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలని సంకల్పించుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మురికివాడలు, అనాథాశ్రమాల్లోని పిల్లలకు చిత్ర నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నది.

అంచెలంచెలుగా..

చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడతానన్నప్పుడే పర్ల్‌ తండ్రి ‘ఈ రంగం ఎందుకమ్మా? సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువ’ అని కూతురు దృష్టిని మార్చబోయాడు. పైగా ఆడపిల్లవు అని అందోళన వ్యక్తం చేశాడు. ‘నాకు సినిమాలంటే ఇష్టం నాన్నా! ఎప్పటికైనా సొంత ప్రొడక్షన్‌ ప్రారంభిస్తా’ అని తేల్చి చెప్పేసిందామె. అలా ఈ రంగంలోకి వచ్చింది. అనుకున్నట్టుగానే అంచెలంచెలుగా ఎదిగింది. 2002లో డిడి మెట్రోలో ‘కిడ్స్‌ జిందాబాద్‌' కార్యక్రమం నిర్మించింది. మరికొన్ని ఐకానిక్‌ ప్రాజెక్టుల్లో పనిచేసింది. 2003లో ‘యువర్‌ విజన్‌ కమ్యూనికేషన్‌' పేరుతో అల్వాల్‌లో సొంత ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించింది. అప్పటి నుంచి అనాథలు, బాలికల చుట్టూ అల్లుకున్న సమస్యలను, సామాజిక కోణాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నది. 60కి పైగా ఫిక్షన్‌ స్టోరీలు రాసి పిల్లలకు కానుకగా అందించింది.‘అయామ్‌ చైల్డ్‌ టూ’, ‘బ్రోకెన్‌ బట్‌ నాట్‌ లాస్‌', ‘సేఫ్టీ ఈజ్‌ మై రైట్‌'  వంటి లఘు చిత్రాలను నిర్మించింది.

ప్రతిభకు పదును

ఈ రంగంలో కుదురుకున్న తర్వాత తన లక్ష్యం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది పర్ల్‌. మురికివాడలు, అనాథాశ్రమాల్లోని పిల్లలను ఎంపిక చేసి వారి సృజనాత్మకతకు దిశానిర్దేశం చేస్తున్నది. స్క్రిప్ట్‌ రైటింగ్‌, దర్శకత్వం మీద శిక్షణ ఇస్తున్నది. పర్ల్‌ శిష్యుల్లో  వివిధ రాష్ర్టాలకు చెందిన నిరుపేదలూ ఉన్నారు. ఏ దేశానికి వెళ్లినా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటుందామె. ట్యోగో, ఉగాండా, కెన్యా, బ్రెజిల్‌, అమెరికా తదితర 43 దేశాలు పర్యటించి అక్కడున్న పేదల జీవిత చిత్రాలను ఆవిష్కరించింది. ఆయా దేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి చిత్ర నిర్మాణ పాఠాలు బోధించింది. తన ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో వర్క్‌షాప్‌లు నిర్వహించి వందలాది మంది నిరుపేద యువతీ యువకులకు చిత్ర నిర్మాణంలో శిక్షణ ఇప్పించింది. ‘ప్రతిభ ఉన్నవాళ్లకు ఈ రంగంలో అవకాశాలకు కొదువ లేదు. అంతకుమించి చిత్ర బృందం ద్వారా ఆ అనాథలకు ఓ కుటుంబం దొరుకుతుంది’ అంటుంది పర్ల్‌ గంటా. కొవిడ్‌ నేపథ్యంలో వర్క్‌షాప్‌లకు విరామం ఇచ్చిన ఆమె.. ఆన్‌లైన్‌ చాట్‌ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో సైబర్‌ సెక్యూరిటీ, పిల్లలపై లైంగిక వేధింపులు తదితర అంశాలపై కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

“నా ప్రయాణంలో మా ఆయన సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. దేశదేశానికీ ఆహార వ్యవహారాల్లో తేడాలు ఉండొచ్చు. సంస్కృతులు విభిన్నంగా ఉండొచ్చు. కానీ, నైపుణ్యాలు, వాటి అవసరాలు మాత్రం ఎక్కడైనా ఒక్కటే. సృజనాత్మకత, ప్రతిభ ఉన్నవాళ్లను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.”- పర్ల్‌ గంటాlogo