గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Sep 18, 2020 , 03:27:34

గ్రీన్‌టైమ్‌తో అడ్డుకోండి!

గ్రీన్‌టైమ్‌తో అడ్డుకోండి!

అసలే ఈమధ్యకాలంలో పిల్లలు మొబైల్‌కి అంటుకుపోతున్నారనీ, టీవీని వదలడం లేదనీ పెద్దవాళ్లంతా కంగారుపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొవిడ్‌ వచ్చేసింది. ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో... పిల్లల్ని ఏ శక్తీ కూడా టీవీ నుంచి విడదీయలేకపోతున్నది. ఇక మొబైల్‌ సంగతి సరేసరి! ఆన్‌లైన్‌ క్లాసులూ, అసైన్‌మెంట్లు అంటూ ఏదో ఒక సాకుతో పిల్లలు మొబైల్‌తోనే గడిపేస్తున్నారు. ఇలా వాళ్లలో స్క్రీన్‌ టైమ్‌ పెరిగిపోతున్నది. స్క్రీన్‌ టైమ్‌ ఎంతగా పెరిగితే బంధాలు అంతలా పలుచబడిపోతాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మరి దీనికి విరుగుడు ఏమిటన్న సవాలుకు ఇప్పుడు ‘గ్రీన్‌టైమ్‌' జవాబుగా వినిపిస్తున్నది. మనం ప్రకృతితో ఎంతసేపు గడుపుతామో అదే గ్రీన్‌ టైమ్‌. వాకింగ్‌ చేస్తూనో, పచ్చని చెట్ల మధ్య కూర్చునో, సూర్యోదయపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూనో... గడిపే సమయమే గ్రీన్‌టైమ్‌. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందనీ, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల్లో ఉండే ఎడిహెచ్‌డి లాంటి సమస్యలు తగ్గుతాయని ఇప్పటికే చెబుతూ వచ్చారు. స్క్రీన్‌టైమ్‌వల్ల ఏర్పడే సమస్యలని కూడా ఇది అడ్డుకుంటుందని అడిలైడ్‌ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నిరూపించారు. కాకపోతే కొవిడ్‌ సమయం కాబట్టి... కాస్త జాగ్రత్తగా ఉంటూనే గ్రీన్‌టైమ్‌ను ఆస్వాదించాల్సి ఉంటుంది.