మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:11:19

జ్ఞాన రత్నాకరం

జ్ఞాన రత్నాకరం

పీవీ నరసింహారావు వివిధ వేదికలపై ఎన్నో అద్భుతమైన ప్రసంగాలను చేశారు. తన ఉపన్యాసాల ద్వారా భారతజాతికి నిర్దేశం చేశారు. వాటిని అనువాదం చేసి తెలుగువారికి అందుబాటులో తీసుకువచ్చేందుకు విశేష కృషి చేస్తున్నది కరీంనగర్‌ లోని పీవీ సాహిత్య పీఠం. శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్రాంత బ్యాంకు అధికారి, పీఠం అధ్యక్షుడు కల్వకోట వేంకట సంతోష్‌బాబుతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

పీవీతో మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది?

పీవీ నరసింహారావుతో మాది దగ్గరి బంధుత్వం. పీవీ సోదరుడు మాధవరావు కుమార్తె సుభాషిణినే నేను వివాహామాడింది. నా పెళ్లి చూపులు, వివాహ తంతు అంతా పీవీ చేతుల మీదుగానే సాగాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ పీవీని కలిసేవారిని. ప్రత్యేకంగా మా బ్యాంకు ఉద్యోగులకు ఎల్టీసీ ప్రకారం ప్రతితతతనాలుగేళ్లకు పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశముండేది. అలా ప్రతి సారి మా కుటుంబంతో సహాతో ఢిల్లీ వెళ్లేవారిని, వారింట్లోనే ఉండేవాళ్లం. అలా వారితో సాన్నిహిత్యం మరికొంచెం ఎక్కువగా ఉండేది. 

పీవీ సాహిత్యపీఠాన్ని నెలకొల్పడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశమేమిటీ?

పీవీ నరసింహారావు ప్రభావం నా మీద ఎంతో ఉంది. రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాలకు ఆయన చేసిన సేవలు అపారమైనవి. అయినా ఆయన సేవలు మరుగున పడటం నన్ను ఎంతగానో కలిచివేసేది. ఏదయినా చేయాలనే తపన ఉండేది. బ్యాంకు ఉద్యోగిగా చాలా బిజీగా, ఒత్తిడిగా ఉండేవాడిని. సాహిత్యభిలాష ఉన్నా ఆ తీరక ఉండేది కాదు. ఇక రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశమూ లేదు. 2013లో ఉద్యోగ విరమణ పొందాక నాకు వెసులుబాటు కలిగింది. అదీగాక ఏ వ్యాపకమూ లేకుండా ఉండడమంటే రోగాలను కొనితెచ్చుకోవడమే. రాజకీయ మేధావి, వ్యక్తిత్వంలోనూ మహోన్నతులైన పీవీ గురించి రేపటి తరానికి తెలియజేయాలని సంకల్పించాను. అందుకోసం అప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న నేను కరీంనగర్‌కు మకాం మార్చుకున్న. పీవీ అభిమానులు, మరికొంత మంది సాహితీవేత్తలతో కలిసి పీవీ సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేశా. దీనిద్వారా ఇప్పుడు స్వామి కార్యం. స్వకార్యం నెరవేరుతున్నది. 

పీవీ శతజయంతి ఉత్సవాలపై పీఠం కార్యాచరణ ప్రణాళికలేమిటీ?


పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను కరీంనగర్‌ వేదికగా ఘనంగా నిర్వహించాలని రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించుకున్నాం. కరోనా వల్ల కార్యక్రమాల నిర్వహణకు అవాంతరం ఏర్పడటం విచారకరంగా తోచినా, తెలంగాణ ప్రభుత్వం, స్వయానా సీఎం కేసీఆరే పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని సంకల్పించడం ఎంతో సంతోషాన్నిస్తుంది. అందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక పీఠం ద్వారా కవితల పోటీని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాం. రచయితల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. 200లకు పైగా కవితలు వచ్చాయి. అందులో పీవీపై సుమారు 20 వరకు చందోబద్ధమైన పద్యాలు కూడా ఉన్నాయంటే వారిపై అభిమానుల ఉత్సాహం అర్థమవతున్నది. కరోనా పరిస్థితి సద్దుమణిగితే పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నాం.logo