గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:15:44

బొట్టు బొట్టులో.. పసిడి పంటలు

బొట్టు బొట్టులో.. పసిడి పంటలు

నీటి బొట్టుకు దారి చూపి పుడమి ఒడిలోకి చేరిస్తే! మొక్క మక్కువతో ఎదుగుతుంది. నేల పొరల్లో వేరు బలంగా నాటుకుంటుంది. నీటి వినియోగం భారీగా తగ్గి జలవనరులు సద్వినియోగం అవుతాయి. బిందు సేద్యంతో ఊహించని దిగుబడి సాధ్యమని నిరూపిస్తున్నారు తెలంగాణ మహిళా రైతులు. సూక్ష్మ సాగు పద్ధతులను అనుసరించి దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడుతు న్నారు.

నీటి సౌలత్‌ తక్కువుందని పొలాన్ని పడావు పెట్టాల్సిన పనిలేదు. ‘సూక్ష్మ’బుద్ధితో ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. నీళ్ల గలగలల చప్పుడు లేకుండానే.. నేలంతా ఈనిందా అన్నట్టుగా పొలమంతా పచ్చని తివాచీ పరిచారు. నీటిని పొదుపుగా వాడుతూనే పొందికగా సాగు చేసి భళా అనిపించుకుంటున్నారు.

బంజరులో బంగారు పంట

నల్గొండకు సమీపంలో ఉన్న కొంత ఆస్తిని అమ్ముకొని అదే జిల్లాలోని మారుమూల కంపాలపల్లిలో తక్కువ ధరకు రెండెకరాల బంజరు భూమి కొనుగోలు చేసింది వంగాల సుజాత. బోరు వేస్తే నీళ్లు కొద్దిగానే పడ్డాయి. దానిని నమ్ముకుంటే పొలం పారడం అనుమానమే! బాగా ఆలోచించింది. వ్యవసాయ అధికారులను కలిసింది. వారు చూపిన పరిష్కారమే చుక్కల సేద్యం. సబ్సిడీపై డ్రిప్‌ పైపులు మంజూరు చేశారు అధికారులు. సాగుకు సిద్ధపడింది సుజాత. తక్కువ నీటితోనే రెండెకరాలు సాగులోకి తెచ్చింది. బొట్టుబొట్టుగా వచ్చినా.. నీరు నేరుగా వేరును చేరడంతో మొక్కలు ఏపుగా ఎదిగాయి. దిగుబడి అద్భుతంగా వచ్చింది. వర్షాకాలంలో కాదు యాసంగిలోనూ మొత్తం పొలంలో కూరగాయలు పండిస్తున్నది సుజాత. కాకర, సొరకాయ, వంకాయ, ఆకుకూరలు పండిస్తూ భార్యభర్తలిద్దరూ ఆనందాల్ని పంచుకుంటున్నారిప్పుడు.

“ఈ బంజరులో సాగు ఎట్లా అనుకున్నం. డ్రిప్‌ ఇరిగేషన్‌ వల్ల నీరు ఆదా అయింది. పంటలు బాగా పండుతున్నాయి. వారానికోసారి వ్యాపారులు మా పొలం దగ్గరికే వచ్చి కూరగాయల కొనుగోలు చేస్తరు. వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసుకొని అదే పొలంలో చిన్న ఇల్లు కట్టుకుని హాయిగా జీవిస్తున్నాం. అన్ని పంటల మీద ఏడాదికి రెండున్నర లక్షల ఆదాయం వస్తున్నది..” అని సంతోషంగా చెప్పి ఎరువుల కోసం ఊరి వైపు కదిలింది సుజాత.

అప్పులు తీరినయ్‌..


బోరున్నా.. నీరు సరిగ్గా రాక చాలా ఏండ్లు తిప్పలు పడింది మేఘావత్‌ బుజ్జి. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి సమీపంలో రావూర్‌ తండాలో రెండెకరాలు ఉందామెకు. బోరు ఎంత సేపు నడిచినా.. పొలం అంతా తడిచేది కాదు. కండ్ల ముందే పొలం ఎండిపోతుంటే గుండె బరువెక్కేది. డ్రిప్‌ పద్ధతి సాగు మొదలయ్యాక సమస్యలన్నీ తీరిపోయాయి. పొలమంతా పచ్చగా మారింది. నీటి వినియోగంతో పాటు ఎరువుల వాడకమూ తగ్గిందంటుంది బుజ్జి. “కొత్తిమిర, పుచ్చ పంట వేశాం. కాయలు కూడా పెద్దగా వస్తున్నయి. ఒకప్పుడు ఆదాయం సరిపోక కూలీకి పోయే దానిని. ఇప్పుడు మా పొలానికే కూలీలు వస్తున్నరు. అప్పులన్నీ తీర్చేసి హాయిగా బతుకుతున్నం” అని చెప్పుకొచ్చింది బుజ్జి.

నలుగురికి ఉపాధి కల్పిస్తూ..

నాగర్‌కర్నూల్‌ జిల్లా నెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పమలలో నెల్లెళ్లు మణెమ్మకు పదెకరాల మామిడి తోట ఉంది . అయినా ఏం లాభం? ఎన్నడూ కంటి నిండా నిద్రపోయింది లేదు. సరైన నీటి వసతి లేక కండ్ల ముందే రాలిపోతున్న మామిడి పూతను చూసి దుఃఖం పొంగుకొచ్చేది. పూతను కాపాడుకోవాలని వేలకు వేలు ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించేది. అయినా ఫలితం లేకపోయేది. “చివరికి రైతుల సలహాతో, జిల్లా ఉద్యానశాఖ సాయంతో డ్రిప్‌ పైపులు వేసుకున్నాం. ఇప్పుడు అన్ని చెట్లకు నీరు అందుతున్నది. కాయల దిగుబడి పెరిగి ఆదాయం కూడా బాగుంది. ఒక ఎకరంలో సపోట మొక్కలు కూడా పెంచుతున్నాం. మరో నలుగురుకి ఉపాధి కల్పిస్తున్నాం..” అని చెప్పింది మణెమ్మ. గతంలో వేసవి వస్తే చాలు బోరు ఎండిపోయేది. ఇప్పుడు బిందుసేద్యంతో నీటితో పాటు విద్యుత్తునూ అదా చేస్తున్నది.

ఇలా సూక్ష్మ సేద్యాన్ని నమ్ముకొని బాగుపడుతున్న రైతులు ఎందరో ఉన్నారు. బొట్టు బొట్టునూ ఒడిసిపట్టి.. మట్టిలో పసిడి పండిస్తున్నారు. ఎత్తుపల్లాల భూమికి కాలువల ద్వారా నీటిని పారించలేక నానాపాట్లు పడే రైతులు ఇప్పుడు.. బిందు సేద్యంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒక్క స్విచ్చు నొక్కితే చాలు.. కాగల కార్యం అంతా నెరవేరుతోంది. ఎరువులు సైతం నీటితో కరిగి చుక్క చుక్కగా మొక్క మొక్కకూ అందుతున్నాయి. దిగుబడిలోనూ ఊహించనంత వ్యత్యాసం వస్తున్నదని ఆనందంతో చెబుతున్నారు రైతులు. కలుపు సమస్య కూడా చాలా వరకు సమసిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు బిందు సేద్యానికి మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాచినపేట రైతు బానోతు చిన్నా.

సూక్ష్మసేద్యం అంటే?

నీటిని పొదుపుచేసే డ్రిప్‌ పద్ధతి.. జల వనరులు తక్కువగా ఉన్న పొలాలకు సంజీవని. తెలంగాణ ప్రభుత్వం.. సూక్ష్మ సేద్య రాయితీలను ప్రోత్సహిస్తున్నది.  ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటున్న రైతన్నలు బిందు, తుంపర పరికరాల ద్వారా మంచి దిగుబడి సాధిస్తున్నారు. అర్హత కలిగిన రైతుల జాబితాను  గ్రామ సభలో ఆమోదించాక, సూక్ష్మసేద్య పరికరాలు అమర్చే ప్రాథమిక తనిఖీ నుంచి తుది పైకం చెల్లించే వరకు మొత్తం ప్రక్రియ 120 రోజులలో పూర్తి అవుతుంది.  రైతుకు రెండు ఇంచులు నీరు పోయగల బోరు బావి ఉండాలి. కరెంట్‌ లేదా ఆయిల్‌ ఇంజన్‌ తప్పనిసరి. బిందు, తుంపర సేద్య పరికరాలను రైతులు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. 

లాభాలు బోలెడు

డ్రిప్‌ సేద్యంతో సాగులో  50-60 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. సమయానుకూలంగా నీరు, ఎరువులు సరఫరా చేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయి. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తుపల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనదీ సేద్యం. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్క వేర్లకు దగ్గరగా అందించడం వల్ల ఎరువుల వాడకమూ తగ్గుతున్నది. విద్యుత్తు వినియోగం కూడా 35 నుంచి 40 శాతం ఆదా అవుతున్నది.