శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Sep 15, 2020 , 00:10:29

తెలిమంచు మేలి ముసుగు ఆర్గంజా

తెలిమంచు మేలి ముసుగు ఆర్గంజా

ఫ్యాషన్‌ రంగంలో తరాల అంతరాలు చెరిపేస్తూ కొత్త కొత్త ట్రెండ్స్‌ ఎన్నో పుట్టుకొస్తుంటాయి. కానీ, పాత తరం ఫ్యాషన్లకు కొత్త హంగులు అద్ది డిజైనర్లు సరికొత్తగా మగువల మనసులు దోచేస్తున్నారు. ఆ కోవకే చెందుతుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్‌. సెలెబ్రిటీలను సైతం కట్టిపడేసే ఆర్గంజా ఇప్పుడు ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. బాలీవుడ్‌ భామలు, టాలీవుడ్‌ తారలు ఈవెంట్లలో ఆర్గంజాలో అదిరిపోయే లుక్‌ ఇస్తున్నారు. చీరల్లో తళుకులీనుతూ, లెహంగాల్లో హంగామా చేస్తూ.. ఆర్గంజా రేంజ్‌ను పెంచేశారు. మరి ఆ ఫ్యాబ్రిక్‌పై ప్రత్యేక కథనం చదివేయండి మరి..

ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ను తేలికగా ఉండే సిల్క్‌ నుంచి తయారుచేస్తారు. సింథటిక్‌ ఫైబర్స్‌, పాలిస్టర్‌, నైలాన్‌ నుంచి దీనిని ఉత్పత్తి చేయొచ్చు. సింథటిక్‌ పోగులతో అల్లిక చాలా సున్నితం కావడంతో నిర్వహణ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే! లేదంటే చిరిగిపోవడానికి ఆస్కారముంది. ఆర్గంజాను వార్ఫ్‌, వెఫ్ట్‌ నమూనాలో నేస్తారు. ఫ్యాబ్రిక్‌ అంతా సూక్ష్మ రంధ్రాలుంటాయి. త్రెడ్‌ మధ్యలో ఖాళీలు ఉంటాయన్నమాట. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నాణ్యత గలిగిన వస్త్రంగా పరిగణిస్తారు. ఒకప్పుడు ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ను వివాహ గౌన్లు, సంప్రదాయ దుస్తుల తయారీలో వినియోగించేవారు. ఇప్పుడు దీనితో రకరకాల దుస్తులను తీర్చిదిద్దుతున్నారు.

సంప్రదాయ వస్త్రానికే డిమాండ్‌

చాలా పట్టు వస్ర్తాల మాదిరిగా సిల్క్‌ ఆర్గంజా చైనాలో ఆవిర్భవించింది. చైనా నుంచి భారత్‌ సహా వివిధ దేశాలకు ఇది ఎగుమతవుతున్నది. చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో యాంగ్జీ నదీ తీరం ఆర్గంజా నేత మిల్లులకు పేరుగాంచింది. మన దేశానికి వస్తే బెంగళూరు ప్రాంతంలో స్టిఫ్ఫర్‌ రకం ఆర్గంజా ఉత్పత్తి అవుతున్నది. ఫ్రాన్స్‌, ఇటలీ దేశాల్లో నాణ్యమైన ఆర్గంజా తయారవుతున్నది. ఈ ఫ్యాబ్రిక్‌ను తయారు చేసే ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. యంత్రాలతో తయారైన ఫ్యాబ్రిక్‌ కన్నా.. సంప్రదాయ పద్ధతులతో నేసే వస్ర్తామే అధిక మన్నిక కలిగి ఉంటుందని నమ్ముతారు. దానికి తగ్గట్టే హ్యాండ్లూమ్‌ ఆర్గంజాకే  ఎక్కువ ఆదరణ ఉంటున్నది.

పోగులను మెలితిప్పి

ఆర్గంజా తెలిమంచు పొరలా పలుచగా ఉంటుంది. ఒకవైపు నుంచి చూస్తే మరోవైపు కనిపించేలా పారదర్శకంగా ఉంటుంది. ఈ వస్త్రం తయారీలో పట్టు కానీ సింథటిక్‌ కానీ ఉపయోగిస్తారు. సింథటిక్‌ వాడాల్సి వస్తే.. రెండు సింథటిక్‌ ఫైబర్‌ పోగులని వ్యతిరేక దిశలో మెలి తిప్పుతారు. వీటిని నేసే ముందు తక్కువ గాఢత కలిగిన ప్రత్యేకమైన యాసిడ్‌లో కొద్దిసేపు నానబెడతారు. దీనివల్ల ఫ్యాబ్రిక్‌కి దృఢత్వం వస్తుందట. ఇందులోని ఫైబర్లు విడివిడిగా ఉంటే ఫ్యాబ్రిక్‌ చిరిగిపోయేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాడాలి. అదే పట్టు పోగులతో నేస్తే ఈ పద్ధతి పాటించాల్సిన పనిలేదు.

రకరకాల రంగుల్లో..

ఈ ఫ్యాబ్రిక్‌లో చాలా రకాలున్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది క్రిస్టల్‌ ఆర్గంజా గురించి. ఇది మెత్తగా, తేలికగా ఉంటుంది. దీనిని పెళ్లి గౌన్లు, అలంకరణ వస్తువుల కోసం ఉపయోగిస్తారు. పాలిస్టర్‌ నుంచి వచ్చే ఆర్గంజాని మిర్రర్‌ ఆర్గంజా అంటారు. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. శాటిన్‌ ఆర్గంజా మెరుపులు చిందిస్తే.. క్రష్డ్‌ రకం ముడతలతో మనసును దోచేస్తుంటుంది. వేర్వేరు రంగుల పట్టుదారాలను వార్ఫ్‌, వెఫ్ట్‌లుగా ఉపయోగిస్తే దానిని షాట్‌ ఆర్గంజాగా పిలుస్తారు. విభిన్నమైన రంగులు కలబోసుకొని చిత్రంగా కనిపిస్తుందిది. ఇందులో ఎంబ్రాయిడరీతో వచ్చే ఫ్యాబ్రిక్స్‌ కూడా ఉన్నాయి. రైనేస్టోన్స్‌, సీక్వెన్స్‌, క్రిస్టల్స్‌ ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. హ్యాండ్‌ ప్రింట్‌, డిజిటల్‌ ప్రింట్‌తో తయారయ్యే ఫ్లోరల్‌ ఆర్గంజాకి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

అదిరేటి లుక్కు..

ఆర్గంజా చీరలు లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారాయి. శాటిన్‌, సిల్క్‌ని కింద లేయర్‌లుగా వాడితే ఆర్గంజా మరింత ఎలివేట్‌ అవుతుంది. కాబట్టి వీటిని డ్రెస్‌లుగా కుట్టాలంటే మాత్రం మల్టీ లేయర్స్‌గా డిజైన్‌ చేయాలి. ఆర్గంజాతో లెహంగాలు, లాంగ్‌ గౌన్లు, వెస్టర్న్‌వేర్‌ దుస్తులు బాగుంటాయి. దుపట్టాలుగా వాడుకోవచ్చు. హ్యాండ్‌ పెయింట్‌ వేసిన డ్రెస్‌లు లాంగ్‌గౌన్లకి బాగుంటాయి. చీరలకు రఫెల్‌ హ్యాండ్స్‌ కానీ, లేయర్స్‌గా కానీ కుట్టించుకోవచ్చు. ఆర్గంజా మెటీరియల్‌తో పఫ్‌ హ్యాండ్స్‌ కుట్టిస్తే అదిరిపోతుంది. మగ్గం వర్క్‌తో చేసిన బ్లేజర్‌ కూడా డిఫరెంట్‌ లుక్‌తో కనువిందు చేస్తుంది. వివాహ గౌన్లకు ఎక్కువగా ఈ మెటీరియల్‌నే ఉపయోగిస్తారు. ఇందులోనూ ప్లెయిన్‌ మీద వర్క్‌ వచ్చిన ఫ్యాబ్రిక్‌ అయితే బాగుంటుంది. కేవలం డ్రెస్‌ డిజైన్‌లోనే కాకుండా కర్టెన్లు, టేబుల్‌ రన్నర్స్‌గానూ ఈ ఫ్యాబ్రిక్‌ను వాడుతారు.