బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 15, 2020 , 00:13:23

వదల బొమ్మాళీ.. వదల!

వదల బొమ్మాళీ.. వదల!

పాజిటివ్‌.. అన్న పదం మొదటిసారిగా మనల్ని బాధపెడుతున్నది. కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలియగానే నెగటివ్‌ ఆందోళనలు మొదలవుతాయి. అదృష్టవశాత్తు కోలుకున్నా కొందరిలో ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవడం లేదు. కరోనా తగ్గినప్పటికీ దాని ప్రభావం మాత్రం దీర్ఘకాలం వేధిస్తున్నది. కీలకమైన అవయవాలపై దుష్ప్రభావం అనేక సమస్యల రూపంలో బాధిస్తున్నది. అదే.. పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌. చిన్నారులను కూడా ఇది వదలడం లేదు. అందుకే కరోనా విషయంలో ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌' అనే మంత్రమే శ్రీరామరక్ష. కొవిడ్‌ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలనీ, ఒకవేళ వచ్చినా సరైన జీవనశైలితో దీర్ఘకాలం వేధించే సమస్యల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు వైద్యులు. 

ఆరోజు రాత్రి 12. 25... అప్పుడే పడుకోబోతున్నాను. ఫోన్‌ సైలెంట్‌లో పెట్టానో లేదో అది రింగవుతున్నట్టు కనిపించింది. తెలిసిన వ్యక్తే. అంత రాత్రి ఏం అవసరం వచ్చిందో ఏమోనని వెంటనే ఫోన్‌ ఎత్తాను. పన్నెండేండ్ల మనవడిని పేరున్న ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశామని, పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందంటున్నారని చెప్పాడు. వెంటనే ఆ హాస్పిటల్‌లో నాకు తెలిసిన డాక్టర్‌కి ఫోన్‌ చేసి విషయం తెలుసుకున్న తరువాత నాకు కూడా ఆందోళనగానే అనిపించింది. ఆ పిల్లవాడికి గుండె దెబ్బతిని, వెంటిలేటర్‌ మీద ఉన్నాడు. కరోనా కోసం పీసీఆర్‌ టెస్ట్‌ చేస్తే నెగటివ్‌ వచ్చింది. కానీ యాంటీబాడీ పాజిటివ్‌ ఉంది. మొన్నటి వరకూ ఎటువంటి లక్షణాలూ లేవు. ఇప్పుడు మాత్రం మల్టీ సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఉంది. దానివల్లే గుండె దెబ్బతిన్నదని వైద్యులు చెప్తున్నారు. ఆ బాబుకి ఇదివరకే కరోనా వచ్చి పోయిందా అన్నది సందిగ్ధమే. 

మన పక్క రాష్ర్టానికి చెందిన రాజకీయ నాయకుడు కొవిడ్‌తో చనిపోయారని విన్నాం. నిజానికి అతను కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత చనిపోయాడు. ఇంటికి వెళ్లిన తరువాత థ్రాంబో ఎంబాలిజం సమస్య వల్ల అకస్మాత్తుగా మరణం సంభవించింది. 

నాకు తెలిసిన ఇంకొక రాజకీయ నేతకూ కొవిడ్‌ వచ్చింది. చికిత్స తరువాత కోలుకున్నాడు. గండం గడిచింది అనుకుంటున్న సమయంలో ఇంట్లోనే గుండెపోటుతో చనిపోయాడు. 

ఇదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లను కలవరపెడుతున్న పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌. కరోనా వ్యాధి వచ్చి వెళ్లిపోయిన తరువాత కూడా గట్టిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కొందరిలో ఉండటం లేదు. దానివల్ల దీర్ఘకాలిక సమస్యలూ వస్తున్నాయి. శరీరంలోని ఇతర కీలక అవయవాలపై కరోనా ప్రభావం పడుతున్నది. లక్షణాలు ఉన్నా లేకపోయినా, కొవిడ్‌ వచ్చి వెళ్లిన తరువాత పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ రూపంలో అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. 

ఇవే ఆ సమస్యలు!

  • దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు : కొవిడ్‌ ప్రధానంగా ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుంది. అందుకే కరోనా లక్షణాల్లో దగ్గు, ఆయాసం లాంటివే ముఖ్యంగా కనిపిస్తాయి. సాధారణంగా ఒకసారి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకితే వాటికైన డ్యామేజీ ఎక్కువ కాలం ఉంటుంది. అలాంటిది కరోనా వ్యాధి వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు కోలుకోవడం చాలా కష్టం. అందుకే చికిత్సతో జబ్బు తగ్గినప్పటికీ దానివల్ల కలిగిన డ్యామేజీ మాత్రం దీర్ఘకాలం వేధించే ప్రమాదం ఉంటుంది. అందుకే కరోనా నుంచి బయటపడ్డ వారిలో ఊపిరితిత్తుల్లో శాశ్వత మచ్చలు, ఫైబ్రోసిస్‌ ఏర్పడటం వల్ల దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. 
  • గుండె సమస్యలు : కొవిడ్‌ ప్రభావం చూపే రెండో ముఖ్యమైన అవయవం గుండెనే. కొవిడ్‌ వల్ల గుండెకు రక్షణగా ఉండే ఎస్‌ ఇన్‌హిబిటర్లు దెబ్బతింటాయి. దీనికి ఒత్తిడి తోడైతే గుండె మరింత బలహీనం అవుతుంది. తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో శరీరంలో అడ్రినలిన్‌, ఆంజియోటెన్సిన్‌ అనే హార్మోన్లు విడుదలై అవి గుండె మీద ఒత్తిడి తెచ్చి గుండెపోటు వస్తున్నది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవాళ్లలో ఎక్కువమంది గుండెపోటుతో మరణించిన వాళ్లే కావడం విషాదకరం. 
  • థ్రాంబో ఎంబాలిజం : రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, అది ఊపిరితిత్తులకు పాకడాన్నే థ్రాంబో ఎంబాలిజం అంటారు. కొవిడ్‌ వల్ల కలిగే దుష్ఫలితాల్లో ఇదీ ముఖ్యమైనదే. కొవిడ్‌తో రక్తనాళాలు దెబ్బతింటాయి. దానివల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. గడ్డ కట్టిన రక్తం ఊపిరితిత్తులకు కూడా వెళ్లడం వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. 
  • నరాల బలహీనత : నరాల మీద కూడా ఎస్‌ ఇన్‌హిబిటర్‌ ఉంటుంది. కాబట్టి కొవిడ్‌ ప్రభావం వీటి మీదా ఉంటుంది. అందుకే కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో చాలామందికి వివిధ రకమైన నరాల జబ్బులు నమోదయ్యాయి. ఫుట్‌ డ్రాప్‌, నర్వ్‌ ఇంజురీ, ఇలా అనేక శాశ్వత సమస్యలు రావచ్చు.
  • మల్టీ సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ : శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ ఇన్‌ఫ్లమేషన్‌కు గురవడం వల్ల కలిగే సమస్యే ఇది. మల్టీ సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ వల్ల గుండె లాంటి కీలకమైన అవయవాలు దెబ్బతింటాయి. సాధారణంగా ఇది పిల్లల్లో కనిపిస్తున్నది. ఇది కొవిడ్‌ నుంచి కోలుకున్న చిన్నారుల వివిధ అవయవాలను ఇది దెబ్బతీస్తున్నది.
  • కిడ్నీ సమస్యలు : కిడ్నీ సమస్యలున్నవాళ్లలో కరోనా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటివాళ్లు కోలుకోవడం కూడా కష్టమే అవుతున్నది. అయితే పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ వల్ల అప్పటి వరకు కిడ్నీలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో కూడా కరోనా కొత్తగా కిడ్నీ సమస్యలను తెచ్చిపెడుతున్నది.
  • నీరసం : సాధారణంగా వైరల్‌ జ్వరం అంటేనే విపరీతమైన నీరసం కలిగిస్తుంది. జ్వరం వచ్చి తగ్గిన తరువాత కూడా కొద్ది రోజుల వరకు నీరసంగా ఉంటుంటారు. ఇక కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నది. దీని ప్రభావం కొద్ది రోజులకు మాత్రమే పరిమితమై ఉండటం లేదు. కరోనా నుండి కోలుకున్న తరువాత తీవ్రమైన నీరసం, కండరాల నొప్పులతో చాలామంది దీర్ఘకాలం బాధపడుతున్నారు. కండరాల్లోని కణాలు దెబ్బతినడం వల్ల కండరాల నొప్పులే కాకుండా వాటి ప్రభావం కిడ్నీల పైన కూడా ఉంటున్నది.
  • మధుమేహం : షుగర్‌ ఉంటే కొవిడ్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇలాంటివాళ్లలో కొవిడ్‌ వల్ల ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. అయితే కొవిడ్‌ వచ్చి తగ్గిన వాళ్లు కొత్తగా మధుమేహం బారిన పడేందుకు కూడా ఆస్కారం ఉంది. పాంక్రియాస్‌ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌లో లోపం ఉన్నప్పుడు అది మధుమేహ వ్యాధిగా వ్యక్తమవుతుంది. కరోనా వైరస్‌ ప్రభావం ఈ పాంక్రియాస్‌ మీద పడినప్పుడు దాని పనితీరు దెబ్బతింటుంది. అందుకే పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌లో భాగంగా అప్పటివరకు ఏ అనారోగ్యం లేనివాళ్లలో కూడా మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. 

కోలుకున్నాక సమస్యలు ఎందుకు?

పైన చెప్పిన విధంగా కొందరిలో కొవిడ్‌ నుంచి కోలున్న తరువాత వివిధ రకాల సమస్యలు రావడాన్నే పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ అంటారు. కరోనా నుండి కోలుకున్న వ్యక్తులలో 10 నుంచి 15 శాతం మందిలో ఇలా వివిధ రకాల సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వృద్ధులు, షుగర్‌, బీపీ ఉన్నవాళ్లలో పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. దీనికి కారణం వైరస్‌ పైన ఉండే స్పైక్‌ ప్రొటీన్‌. కరోనా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత దాని స్పైక్‌ ప్రొటీన్‌ వల్లనే వైరస్‌ పెరుగుదల ప్రారంభమవుతుంది. మన శరీరంలోని కణాల మీద ఎస్‌ ఇన్‌హిబిటర్‌ ఉండేచోట ఈ స్పైక్‌ ప్రొటీన్‌ అతుక్కుంటుంది. తద్వారా కణం లోపలికి సులువుగా ప్రవేశించగలుగుతుంది. ఆ తరువాత దాని పెరుగుదల మొదలవుతుంది. అయితే ఎస్‌ ఇన్‌హిబిటర్‌ అనే సైట్‌ మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాల్లోనూ ఉంటుంది. ఊపిరితిత్తులు, నరాలు, గుండె, రక్తనాళాలు, కిడ్నీలు, లివర్‌, మెదడు.. ఇలా కీలకమైన అవయవాలన్నింటిలోనూ ఎస్‌ ఇన్‌హిబిటర్‌ సైట్‌ ఉంటుంది. కాబట్టి కొవిడ్‌ వైరస్‌ ఈ అవయవాల కణాలన్నింటిలోకీ సులువుగా ప్రవేశించి, వాటిని దెబ్బతీయగలుగుతుంది. అందువల్లనే కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత కూడా అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయి. వీటినే పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. 

నివారణే ఉత్తమం

కరోనా వ్యాధి ఇప్పుడు దాదాపుగా మనలో భాగమైపోయింది. మొదట్లో దీని గురించి భయపడినప్పటికీ ఇప్పుడు చాలామంది  పట్టించుకోవడం లేదు. ఎన్నాండ్లని ఇంటి పట్టునే ఉంటామంటూ ఇష్టానుసారంగా బయట తిరిగేస్తున్నారు. మన పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. కాని బయటికి వెళ్లినప్పుడు కూడా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడంలో కూడా జాగ్రత్తలు పాటించనివాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మనం కరోనాను పట్టించుకోకపోయినా సరే.. అది మాత్రం మనల్ని పట్టించుకుంటున్నది. అందుకే అది వచ్చి వెళ్లిపోయినప్పటికీ దాని ఆనవాళ్లను మాత్రం వదులుతున్నది. ఇంతకుముందు అనుకున్నట్టుగా రెండు మూడు వారాలకే పరిమితం కావడం లేదు. దీర్ఘకాలిక సమస్యల రూపంలో వేధిస్తున్నది. అందుకే కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి. ఏమాత్రం అనుమానంగా ఉన్నా స్వీయ నియంత్రణ పాటించాలి. సకాలంలో వైద్య సలహా తీసుకోవాలి. మొదట్లోనే జాగ్రత్తపడితే దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. 

ఏం చేయాలి?

కొవిడ్‌ చికిత్స పూర్తయిపోయి, కోలుకున్న తరువాత కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. విటమిన్లు, మినరల్స్‌ ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. రోజూ ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాలి. అన్నింటికీ మించి ఒత్తిడి ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాలి. జబ్బు తగ్గిపోయింది కదా అని ఎప్పటిలా ఒత్తిడితో కూడిన పనులు చేయవద్దు. శారీరకంగా గానీ, మానసికంగా గానీ అధిక ఒత్తిడి కూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా ప్రాణాయామం, యోగా, ధ్యానం అలవాటు చేసుకుంటే మంచిది. 

డాక్టర్‌ బూర నర్సయ్య

లాపరో-ఎండోస్కోపిక్‌ సర్జన్‌, స్టార్‌ హాస్పిటల్స్‌

హైదరాబాద్‌


logo