ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Sep 10, 2020 , 00:04:24

గోరుముద్దలో..జంక్‌ఫుడ్‌

గోరుముద్దలో..జంక్‌ఫుడ్‌

పిల్లలు బడికి వెళ్లడం లేదు. పెద్దలు ఇంటి నుంచే ఆఫీస్‌ పని చక్కబెట్టేస్తున్నారు. వేడివేడిగా టిఫిన్లు, కోరిన కొద్దీ వెరైటీలు..  ఆల్‌ హ్యాపీస్‌!! ఇక్కడే ఉందో ముప్పు! గుర్తించకుంటే తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో ఇంటింటా ఆహార వినియోగం భారీగా పెరిగిపోయిందన్న సర్వే సారాంశాలు కలవరపెడుతున్నాయి. అతిగా తినడం వల్ల అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారం దిశగా తల్లులు కృషి చేయాలంటున్నారు.

అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. కానీ, కరోనా కాలంలో ఆ మాటను చాలా కుటుంబాలు పట్టించుకోవడం లేదంటున్నాయి సర్వేలు. నిత్యావసరాల వాడకం పెరగడమే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. పిల్లలకు బడులు లేకపోవడంతో.. బడలిక దూరమైంది. పెద్దలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పుణ్యాన కడుపులో చల్ల కదలకుండా ఉంటున్నారు. అందరూ ఇంట్లో ఉన్న ఆనందంలో తల్లులు రకరకాల వంటకాలు సిద్ధం చేయడం.. ప్రేమగా వడ్డించడంతో.. వస్తు వినియోగం పెరుగుతున్నది. 

రెస్టారెంట్‌ రుచులు ఇంట్లో

వారానికో సినిమా.. అట్నుంచటే డిన్నర్‌, రెండువారాలకో విహారం.. కరోనాకు ముందు స్థితిమంతుల కార్యాచరణ ఇలా ఉండేది. మధ్యతరగతి వారి విషయానికి వస్తే జీతాలు పడ్డ తొలివారం ప్రణాళికలో ఓ సినిమా.. రెస్టారెంట్‌లో విందు ఉండేవి. ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇల్లే పదిలం అనుకుంటున్నారంతా! సినిమాల లోటును ఓటీటీలు, టీవీలు కొంత భర్తీ చేస్తున్నా.. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేకపోతున్నారు చాలామంది. ఫలితంగా బోలెడన్ని వెరైటీలు వంటింట్లో సిద్ధమైపోతున్నాయి. వేళ కాని వేళలోనూ పిల్లలు ఆర్డర్‌ చేయడం.. వారి ఆనందం కోసం అమ్మ ప్రయోగాలు చేయడం.. ఇదీ తంతు. ఫలితంగా నిత్యావసరాల వినియోగం బాగా పెరిగింది. 

పాకయాగంలో ప్రయోగాలు

పిండివంటలు, చిరుతిండ్లు, మసాలా ఆహారం, రకరకాల టిఫిన్లు.. ఇవన్నీ రెగ్యులర్‌ మెనూలో చేరిపోయాయి. రెస్టారెంట్లకు ఎలాగూ వెళ్లడం లేదు కదా అని అక్కడ వండి వడ్డించే రుచులను ఇంట్లో చేసుకుంటున్నారు. కొందరు ఔత్సాహికులు వంటింట్లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఓ సంస్థ 1800 మందిని సర్వే చేయగా.. అందులో 70 శాతం మంది వారానికోసారి విభిన్నమైన వంటకాలు స్వయంగా చేసి రుచి చూస్తున్నామని చెప్పుకొచ్చారట. చెగోడీలు, పకోడీలు, అప్పాలు, సకినాలు ఇలా రకరకాల పిండివంటలు చేస్తున్నారు కొందరు తల్లులు. బర్గర్లు, పిజ్జాలు, కేకులు, పాస్తాలు కూడా ఇంట్లోనే సిద్ధం చేస్తున్నారు. పాకయాగంలో ప్రయోగాలకు యూట్యూబ్‌ సహకారం కూడా తీసుకుంటున్నారు. ఫలితంగా టీ పొడి మొదలుకొని వంట నూనె వరకు ప్రతి వస్తువు వినియోగం పెరిగిపోతున్నది. అంతేకాదు లాక్‌డౌన్‌కు ముందు 40 నుంచి 45 రోజులు వచ్చిన సిలిండర్‌ ఈ మధ్యకాలంలో నెలకు మించి రావడం లేదంటే.. వంటింటి ఘుమఘుమలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.


తస్మాత్‌ జాగ్రత్త

శారీరక శ్రమ ఎక్కువగా లేనప్పుడు వేపుళ్లు, జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేపుళ్లలో పోషకాలు, ప్రొటీన్లు తగ్గిపోవడమే కాక లవణాలు, చక్కెర, కొవ్వు మిగిలిపోతాయి. అవి ఆరోగ్యానికి కీడుచేస్తాయి. తిన్న తిండికి తగిన శ్రమ లేకపోతే.. ఊబకాయం ప్రమాదం ఉంది. రుచి కోసం ఏదో వారానికోసారైతే నచ్చిన పదార్థాలు తింటే ఇబ్బంది లేదు. అదేపనిగా రోజూ తింటే ఇబ్బందులు తప్పవు. నూనెలో వేయించినవి కాకుండా.. ఉడికించిన పదార్థాలు మెనూలో ఉండేలా జాగ్రత్తపడితే మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

మేలు చేసేవి ఇవ్వండి..

చిన్నపిల్లలు కంటికి నచ్చింది తింటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పోరు పడలేక.. వారు అడిగింది చేసివ్వడమో, కొనివ్వడమో చేస్తుంటారు. జంక్‌ఫుడ్‌లో ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం, జీర్ణ సంబంధిత సమస్యలు రావొచ్చు. అందుకే పిల్లలను ఎక్కువగా నూనె, చక్కెర ఉండే పదార్థాలకు దూరంగా ఉంచితే మంచిది. రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలతో రకరకాల స్నాక్స్‌ చేసి పెట్టొచ్చు. డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ బెల్లం, తేనెతో కలిపి ఇవ్వొచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

- దీప అగర్వాల్‌, పోషకాహార నిపుణురాలు

దారి మరిచిన నడక..

కరోనా కారణంగా చాలామంది ఉదయపు నడకకు చాలామంది దూరమయ్యారు.  జీవనశైలి మారడం, శారీరక వ్యాయామం కుంటుబడటంతో చాలామంది బరువు పెరుగుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 40 శాతం మంది బరువు పెరిగారని సర్వేలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా పాత జీవనశైలికి మారడానికి ప్రయత్నించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఆహారం విషయంలో పరిమితులు పాటించడం తప్పనిసరి. 


logo