శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Sep 10, 2020 , 00:04:24

నాన్న ఆస్తిలో వాటా వస్తుందా?

నాన్న ఆస్తిలో వాటా వస్తుందా?

ఇటీవలే నా భర్త చనిపోయారు. ఆయనది ప్రైవేటు ఉద్యోగం. అందువల్ల ఎటువంటి బెనిఫిట్లు రాలేదు. నాకు ఉద్యోగం ఏమీ లేదు. ఇంటర్‌ వరకే చదువుకున్నాను. ఇన్ని రోజులు మా నాన్న ఆస్తి గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ ఆస్తిలో వాటా వస్తే మాకు కొంత ఊరట కలుగుతుంది. ‘ఎప్పుడో పెండ్లి చేసుకుని వెళ్లిపోయావు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు. ఆస్తిలో నీకు వాటా ఉండద’ని మా ఇద్దరు అన్నయ్యలు చెబుతున్నారు. నాన్న చనిపోయి చాలాకాలం అయింది. ఇప్పుడు నాకు ఆయన ఆస్తిలో వాటా వస్తుందా? రాదా?

- సునీత, జనగామ

మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కూతురు ఎప్పటికీ కూతురేనని, తండ్రి ఆస్తిలో వాటా పొందేందుకు హక్కుదారేనని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి రావడానికి పూర్వమే తండ్రి మరణించినప్పటికీ, ఆ తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు కుమార్తెకు ఉంటుందని, సమష్టి కుటుంబంలో ఆమె భాగస్తురాలేనని స్పష్టం చేసింది. ప్రకాశ్‌ వర్సెస్‌ పూల్‌వతి కేసులో సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ చట్టం అమల్లోకి రాకముందు కుమార్తెలకు హక్కులుండేవి కావు. అదేవిధంగా దానమ్మ వర్సెస్‌ అమర్‌ కేసులో సుప్రీంకోర్టులోని వేరొక ధర్మాసనం 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు తండ్రి మరణించినప్పటికీ ఆయన ఆస్తిలో కుమార్తెకు హక్కు ఉంటుంది. ఈ రెండు తీర్పులు విభిన్నంగా ఉండటంతో దీనిపై వివరణ కోరారు. దీంతో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ వివరణతో మహిళలకు కుటుంబంలో సమాన గౌరవం, హోదా, హక్కులు లభిస్తున్నాయి.

2005 సంవత్సరంలో సెప్టెంబరు 9 నుంచి హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి వచ్చింది. తమ తండ్రి ఆస్తిలో తమ అన్నదమ్ములతో సమాన వాటా కోరే అక్కచెల్లెళ్ల వ్యాజ్యాలను పరిష్కరించేందుకు ఈ తేదీనే కొలమానంగా న్యాయస్థానాలు పరిగణిస్తున్నాయి. అయితే ‘ఈ చట్టంలోని సెక్షన్‌ 6 ద్వారా కుమార్తెలకు కల్పించిన సమానత్వ హక్కును పోగొట్టరాదు’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. కాబట్టి ఈ తీర్పు ఆధారంగా మీకు తప్పనిసరిగా మీ నాన్నగారి ఆస్తిలో వాటా వస్తుంది.

ఎం. అనురాగసుధ

సీనియర్‌ న్యాయవాది