శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 09, 2020 , 00:31:03

ఆకలితో ఖోఖో

ఆకలితో ఖోఖో

ఈ ఏడాది అర్జున అవార్డులను ప్రకటించగానే... ఓ పేరు అందరినీ ఆకర్షించింది. 22 ఏళ్ల తర్వాత ఖోఖో తరఫున అవార్డును సాధించి ఆటకే వన్నె తెచ్చింది. తనే ‘సారిక కాలె’. ఎవరీ సారిక అని ఆరా తీసిన వారికి, 

ఆశ్చర్యపోయే నేపథ్యం పలకరించింది.

మహారాష్ట్రలోని ఒస్మానాబాద్‌ జిల్లాలో రుయ్‌భర్‌ అనే చిన్న ఊరు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే ప్రాంతం. ఆడపిల్లలు చదువుకోవడమే ఎక్కువ అని తృప్తిపడిపోయే జనం. అలాంటి ఊళ్లో పుట్టింది సారిక. పదిమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం ఆమెది. బాధ్యత లేని తండ్రి ఉద్యోగం చేయకపోగా, తాగుడుకు అలవాటు పడిపోయాడు. ఏళ్ల తరబడి ఒంటిపూట భోజనంతోనే సరిపెట్టుకునేదా కుటుంబం. అలాంటి సమయంలో ఖోఖో ఆమె జీవితంలోకి ప్రవేశించింది. 

తెలుగువాళ్లకి కబడ్డీ ఎలాగో మరాఠీలకు ఖోఖో అలా! 2003లో చంద్రజిత్‌ అనే రాష్ట్ర ఖోఖో కోచ్‌, రాష్ట్రం అంతా తిరుగుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ఖోఖో పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాడు. అలా సారిక స్కూల్లో ప్రవేశించిన చంద్రజిత్‌, ఆటలోకి అడుగుపెట్టమంటూ ఆమెని ప్రోత్సహించాడు.

ఆట మొదలైంది

ఎవరో చెప్పారు కదా అని సరదాగా ఆటలోకి దిగిన సారికకి, అదే ప్రాణమైంది. తన కష్టాల నుంచి, చిరాకుల నుంచి తప్పించుకునేందుకు ఆట ఓ ధ్యాసగా మారింది. సెలవులు వచ్చినా, అనారోగ్యం పలకరించినా... ఒక్క రోజు కూడా ఆటని వదిలేది కాదు. ఆట జోలికి పోవద్దంటూ ఓసారి తండ్రి మందలించాడని, ఇంట్లో ఓ యుద్ధమే చేసింది. సారికకి తల్లి, అమ్మమ్మ అండగా నిలబడటంతో... బరి నుంచి వెనక్కి తగ్గలేదు. స్కూల్‌, జిల్లా, రాష్ట్రం అంటూ ఒకో మెట్టు ఎక్కుతూ దేశం తరఫున ఆడే స్థాయికి చేరుకుంది. 2016లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో, జాతీయ జట్టుకు నాయకత్వం వహించడమే కాకుండా... బంగారు పతకం అందించింది. మరుసటి ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన పోటీల్లో ‘బెస్ట్‌ ప్లేయర్‌' అవార్డును దక్కించుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్‌ ఆఫీసరుగా పనిచేస్తోంది.

‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానివల్ల నాకే కాదు, ఆటకి కూడా గుర్తింపు వస్తుంది కదా! ఈ ఆటలోకి ప్రవేశించాలనుకునే ఆడపిల్లలకి కూడా ఓ ప్రోత్సాహంగా ఉంటుంది. అంతకంటే ఏం కావాలి’ అంటారు సారిక. ఆట చిన్నదే కదా అని తను ఆగిపోతే, కష్టాలు ఎక్కువవుతున్నాయి కదా అని వెనుతిరిగితే... సారిక ఈ స్థాయికి చేరుకునేదే కాదు.


logo