శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Sep 08, 2020 , 00:09:30

బాతిక్‌మెరుపులు

బాతిక్‌మెరుపులు

మూలాలు మన దగ్గర లేకపోయినా.. మన మగువల మనసులకు మాత్రం దగ్గరయిపోయింది. చీరలు, డ్రెస్‌లు, నైటీలు.. ఇలా అన్నిటి మీదకి బాతిక్‌ ప్రింట్‌ వచ్చి చేరిపోయింది.. అందుకే అతివలు వీటి పై మనసు పారేసుకున్నారు.. కాటన్‌ మీద కళగా మెరిసిపోయే ఈ ప్రింట్‌.. ఇప్పుడు ఇతర ఫ్యాబ్రిక్‌ల పైకీ వచ్చేసింది.. నేనున్నానంటూ అన్నిచోట్ల విస్తరించిపోయింది.. పదికాలాల పాటు చెరిగిపోని ఈ బాతిక్‌ ప్రింట్‌ని.. ఆడవాళ్లు తమ వార్డ్‌రోబ్‌లో చేర్చేస్తున్నారు.

బాతిక్‌ అనే పదం ఇండోనేషియా మూలాల నుంచి వచ్చింది. ‘అంబా’, ‘తితిక్‌' అనే రెండు జావా పదాల నుంచి ఈ పేరు వచ్చింది. ‘dotted piece of cloth’ అని దీని అర్థం. బాతిక్‌ ప్రింట్‌ మైనపు అద్దకం టెక్నిక్‌తో తయారు చేసే ఇండోనేషియ పద్ధతి. ప్రముఖంగా ఇండోనేషియాలోని జావా ప్రాంతంలో ఈ ప్రింట్‌ పుట్టింది. Tjanting అని పిలిచే సాధనంతో చుక్కలు, గీతలు గీసే ప్రక్రియనే బాటిక్‌ ప్రింట్‌గా పిలుస్తున్నారు. అంతేకాదు.. ఒక రాగి స్టాంపులాంటి పరికరంతో కూడా ఈ ముద్రణ చేస్తుంటారు. అక్టోబరు 2009లో యునెస్కో, ఇండోనేషియన్‌ బాటిక్‌ను... ఆ దేశ వారసత్వ కళాఖండంగా ప్రకటించింది. యునెస్కో గుర్తింపు తరువాత అక్టోబర్‌ రెండును ఇండోనేషియన్‌ ప్రభుత్వం, జాతీయ బాతిక్‌ రోజుగా ప్రకటించింది. 

బాతిక్‌ చరిత్ర..

మైనపు రంగు ఫ్యాబ్రిక్‌ అద్దకం ఒక పురాతన కళ. ఇది నాలుగవ శతాబ్దంలో ఈజిప్టు కాలంలో ఉనికిలో ఉంది. ఇది మమ్మీలను మూసివేయడానికి ఉపయోగించేవాళ్లు. ఆసియాలో.. టాంగ్‌ రాజవంశం(618-907) సమయంలో చైనాలో ఈ పద్ధతిని ఆచరించారట. అలాగే జపాన్‌లో నారా కాలంలో (645-794) ఆచరించినట్లు ఆధారాలున్నాయి. ఆఫ్రికాలో మొదట నైజీరియా, సోనిన్కే, సెనెగల్‌లోని వోలోఫ్‌ అనే తెగలలో ఈ బాతిక్‌ బట్టలను ఉపయోగించేవాళ్లు. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో బాటిక్‌ కళ బాగా అభివృద్ధి చెందింది. జావాలో ఈ ప్రక్రియ కోసం.. పత్తి, మైనం, వివిధ కూరగాయలతో రంగులు తయారు చేసేవారు. డచ్‌ పురాతత్వవేత్త జిలా బ్రాండెస్‌, ఇండోనేషియా పురావస్తు శాస్త్రవేత్త ఎఫ్‌.ఎ.సుజిప్టో ఇండోనేషియాలోని బాతిక్‌ అనే ఒక స్థానిక సంప్రదాయం ఉందని ప్రపంచానికి తెలియచేశారు. 

ఇండియాలో బాతిక్‌:

ఈ బాతిక్‌ పద్ధతి భారతదేశములో 2000 సంవత్సరాలకు పూర్వము నుంచే వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాటన్‌ వస్ర్తాల మీద ఈ ప్రింట్‌ని ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. మనదగ్గర ఎక్కువగా.. గోడకు తగిలించే చిత్రాలుగా ఈ బాతిక్‌ ప్రింట్‌ని వేసేవాళ్లు. గృహోపరణాల మీద వేసే వస్ర్తాలుగా ఈ బాతిక్‌ ప్రింట్‌ బట్టలను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా బాతిక్‌ ప్రింట్‌ చేస్తున్నారు. బాతిక్‌ బట్టలలో రంగు చాలా సంవత్సరాలుగా మారదు. అయితే బాతిక్‌ చాలా సమయం తీసుకునే కళ. దాదాపు సంవత్సరకాలం పడుతుంది. కాటన్‌ మీద ఎక్కువ కాలం ఈ ప్రింట్‌ నిలబడుతుంది. మిగతా వాటి మీద మాత్రం కొంత వరకు బట్ట కూడా పాడైపోతుంది. బాతిక్‌ ప్రింట్‌లో కూడా రకాలున్నాయి. ఇవి భారతదేశంలో కూడా లభిస్తున్నాయి. ఇన్లాండ, కోస్టల్‌, సుండనీస్‌, సుమత్రన్‌, బాలినీస్‌.. బాతిక్‌ అంటూ చాలా రకాల ప్రింట్‌లు మనకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

డిజైనర్‌ వేర్‌గా.. 

21 వ శతాబ్దంలో ఈ బాతిక్‌ ప్రింట్‌ మరింత సొబగులద్దుకున్నది. కుర్తాలు, దుపట్టాలు, స్కార్ఫ్‌లుగా కూడా రూపాంతరం చెందింది. మరింత కొత్తదనం కోసం డిజైనర్లు వీటిని లాంగ్‌, షార్ట్‌ స్కర్ట్‌లు కూడా కుట్టేస్తున్నారు. లాంగ్‌ గౌన్లు ఇక సరేసరి. జీన్స్‌ మీదకి వేసుకునే క్రాప్‌ టాప్‌లకు కూడా ఈ బాతిక్‌ ప్రింట్‌ బాగుంటుంది. డ్రెస్‌ మెటీరియల్స్‌ కూడా టాప్‌, బాటమ్‌, దుపట్టాతో సహా బాతిక్‌ ప్రింట్‌తో వచ్చినవి కాలేజీ అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొత్తం బాతిక్‌ అవసరం లేదనుకుంటే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌లా కూడా డిజైన్‌ చేసుకోవచ్చు. ధోతీ స్టయిల్‌తో ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకొని బాతికి ప్రింట్‌ టాప్‌, ఇదే ప్యాటర్న్‌ రివర్స్‌ చేసి కూడా ట్రై చేయొచ్చు. కేవలం సింపుల్‌ ప్లెయిన్‌ టాప్‌, బాటమ్‌.. తీసుకొని దుపట్టా బాతిక్‌ ప్రింట్‌ది వాడినా బాగుంటుంది. ఇక చీరల విషయానికొస్తే బ్లౌజ్‌ని గ్రాండ్‌గా డిజైన్‌ చేసుకుంటే లుక్‌ అదిరిపోతుంది. రఫెల్‌ హ్యాండ్స్‌ బ్లౌజ్‌, బాతిక్‌ ప్రింట్‌ చీర కాంబినేషన్‌ వెస్ట్రన్‌ లుక్‌ తీసుకొస్తుంది.హైనెక్‌, ఫుల్‌ స్లీవ్స్‌ అయితే సంప్రదాయంగా మెరిసిపోతారు. 

తయారీ ఎలా?  

ఒక  కాటన్‌ వస్ర్తాన్ని తీసుకొని దానిని నీటిలో చాలాసేపు నానబెట్టిన తరువాత గట్టిగా పిండి అరబెడుతారు. దీనివలన దానికి ఉన్న స్టార్చ్‌ పోతుంది. దీనిని మేలట్‌ అనే పరికరానికి చుట్టి తిప్పుతారు. అప్పుడు మనకి కావాల్సినట్టుగా వస్త్రం తయారవుతుంది. ఇప్పుడు పెన్సిల్‌తో కావాల్సిన నమూనాలు గీస్తారు. దీని మీద వేడి మైనం పోసి పెన్సిల్‌తోనే గీస్తారు. కొన్నిసార్లు మైనం కాకుండా బియ్యంపిండితో గంజిలాంటి మిశ్రమాన్ని కూడా ఉపయోగిస్తారు. కావాల్సిన డిజైన్‌ వేసిన తర్వాత దానిని ఆరబెడతారు. అది ఆరిన తరువాత వస్ర్తాన్ని రంగులో ఉడికిస్తారు. ఇలా మనకి ఎన్ని రంగులలో కావాల్సి ఉంటే అన్ని సార్లు ఇదే పద్ధతిని పాటిస్తారు. ఈ విధంగా కావలసిన రంగులలో చేసిన తరువాత మళ్ళీ వేడినీటిలో ఉంచుతారు. దానివల్ల డిజైన్‌ కోసం ఉపయోగించిన మైనాన్ని విడదీయడానికి ఉపయోగపడుతుంది.