గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 06, 2020 , 00:17:52

స్వదేశీ శునకాలు

స్వదేశీ శునకాలు

మన్‌ కీ బాత్‌ ప్రసంగంలో మోదీ చెప్పిన శునకాల జాతులు 

1. ముధోల్‌ హౌండ్‌  

2. హిమాచల్‌ హౌండ్‌ 

3. కన్నీ, చిప్పారి 

4. రాజపాలాయం 

5. కొంబయ్‌.

స్వదేశీ ఉద్యమంలో శునకాలు కూడా భాగమయ్యాయి. దేశీయ శునకాలనే పెంచుకోవాలని ఇటీవల మన్‌కీ బాత్‌ ప్రసంగంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ జాతులను సాధ్యమైనంత దూరం పెట్టాలన్నారు. ఏ జాతి కుక్కలను పెంచుకోవాలన్న దానిపై ఆయన కొన్ని జాతుల పేర్లను కూడా సూచించారు. 

ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో దేశీయ శునకాల సేవల గురించి మాట్లాడారు. సైన్యంలో అవి పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంలోనైతే ముధోల్‌ హౌండ్‌ కుక్కలను చూసైనా కాంగ్రెస్‌  నేతలు దేశభక్తి అంటే నేర్చుకోవాలని విమర్శించారు. ఆయన చెప్పిన ముధోల్‌ హౌండ్‌ కుక్కలకు చాలా చరిత్ర ఉన్నది. ఛత్రపతి శివాజీ కూడా ఈ కుక్కలను తన సైన్యంలో ఉంచి శిక్షణ ఇచ్చారు. 

ముధోల్‌ హౌండ్‌

ముధోల్‌ కుక్కలను ముధోల్‌ హౌండ్‌, కారవాన్‌ హౌండ్‌ అని కూడా అంటారు. ఉత్తర కర్ణాటకలోని భాగల్‌కోట్‌ జిల్లాలో గతంలో ఉన్న ముధోల్‌ సామ్రాజ్యం నుంచి  ఈ కుక్కలకు ఆ పేరు వచ్చింది. చాలా సన్నగా ఉండే ఈ కుక్కలు భారత సైన్యంలో సేవలందిస్తున్న భారతదేశానికి చెందిన మొట్టమొదటి జాతిగా నిలిచాయి. వేటాడ్డంలో, కాపలా కాయడంలో పేరుపొందిన ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవు. నిశితంగా చూడటం, వాసన పసిగట్టడంలో ఇవి చాలా ప్రత్యేకమైనవని చెప్తారు. ఈ ప్రత్యేకతల వల్లే 2016 ఫిబ్రవరిలో ఈ జాతికి చెందిన కొన్ని కుక్క పిల్లలను మీరట్‌లో ఉన్న ఇండియన్‌ ఆర్మీ రిమవుంట్‌ అండ్‌ వెటర్నరీ కేర్‌కు(ఆర్వీసీ) తీసుకువచ్చారు. భారతదేశానికి చెందిన ఈ జాతి కుక్కలను ట్రైనింగ్‌కోసం ఆర్వీసీకి తీసు కురావడం ఇదే మొదటిసారి. 

కొంబయ్‌


కొంబయ్‌ కూడా తమిళనాడుకు చెందిన జాతి. ఈ కుక్కలు చాలా తెలివైనవి. వేట కోసం ఎక్కువగా పెంచుకుంటారు. వీటి జాతి క్రమంగా అంతరించి పోతున్నది. ఇప్పుడు ఎక్కువగా ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో సీఆర్పీఎఫ్‌ కొంబయ్‌ కుక్కలను రిక్రూట్‌ చేసుకుని శిక్షణ ఇస్తున్నది. 

కన్నీ


కన్నీ అంటే తమిళంలో స్వచ్ఛమైనది అని అర్థం. ఈ కుక్కలు విశ్వాసానికి మారుపేరు. ఎలుగుబంట్లు, కృష్ణజింకల వేటలో వీటికి నైపుణ్యం ఎక్కువ. 1972 నుంచి అటవీ జంతువుల సంరక్షణ చట్టం రావడంతో వీటిని ఇండ్ల దగ్గర కాపలా కోసం ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా కొంత దూరం పరుగెత్తగలవు. వేట సమయంలో సొంతంగా ఆలోచించగలగడం వీటి ప్రత్యేకత. అందుకే శిక్షణ సమయంలో ఇవి దేన్నైనా చాలా వేగంగా నేర్చుకుంటాయి. మిగతా కుక్కలతో పోల్చితే కన్నీ జాతి కుక్కలకు శిక్షణ ఇవ్వడం చాలా సులభం. 

రాజపాలాయం


రాజపాలాయం కుక్కలు తమిళనాడుకే ప్రత్యేకమైన జాతి. విరుధునగర్‌ జిల్లాలోని రాజపాలాయం పేరు మీదుగా వీటికి ఆ పేరు వచ్చింది. రాజపాలాయం కుక్కలు చాలా అరుదైనవి. వీటి దవడలు కత్తెరలా ఉంటాయి. పూర్వం యుద్ధాల్లో ఈ కుక్కలను ఎక్కువగా ఉపయోగించేవారు. బ్రిటిష్‌ కాలంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీతో పాలీఘర్లు 1799-1805 మధ్యకాలంలో జరిపిన యుద్ధంలో ఈ జాతి కుక్కలు కూడా పాల్గొన్నాయి. 


logo