సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Sep 05, 2020 , 00:18:14

అమ్మానాన్నా నా బెస్ట్‌ టీచర్లు

అమ్మానాన్నా  నా బెస్ట్‌ టీచర్లు

‘పిల్లి కండ్లున్న వాళ్లను నమ్మకూడదు..’ ఇలాంటి మాటలు ఎన్నో విన్నాడు.. ఆ చూపుల్లో పలికే హావభావాలకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.. మొదటి నుంచి కోపిష్టి అయిన ఆ అబ్బాయి.. ఒక్కసారిగా నెమ్మదస్తుడయ్యాడు..చిన్నప్పుడు తన టీచర్‌ పెండ్లి చేసుకొని వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చిన అతడే.. ఇప్పుడు నవరసాలు పలికిస్తూ.. బుల్లితెరపై తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు. జీ తెలుగులో వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళులో ‘టైలర్‌..’ అంటూ పలికే ఆ హీరోనే.. ఈ వారం మన చిన్నతెర అతిథిగా విచ్చేశాడు.. అతడే ఆకర్ష్‌ భైరమూడి..

కర్ణాటకలోని సకిలేశ్‌పుర్‌లో పుట్టాను. అక్కడ మాకొక కాఫీ ఎస్టేట్‌ ఉంది. నేను, మా అన్నయ్య ఇద్దరం. చిన్నప్పుడే ఊటీలోని బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు. అలా ఎల్‌కేజీ నుంచే హాస్టల్‌ అలవాటైంది. అక్కడ ఐదో తరగతి వరకు చదివాను. ఇంట్లో అమ్మానాన్న అటాచ్‌మెంట్‌ తక్కువ అవ్వడంతో బాగా ఏడ్చేవాడిని. అల్లరి చేసేవాడిని. అమ్మానాన్నలేమో మేం బాగా చదవాలని ఊటీలో చేర్పించారు. మాకేమో అర్థం కాకపోయేది. పైగా మాకు సమ్మర్‌ హాలీడేస్‌ జూన్‌, జూలైలో ఉండేవి. అప్పటికి మా ఊళ్లో నా ఫ్రెండ్స్‌, కజిన్స్‌ అంతా స్కూళ్లకు వెళ్లేవారు. అలా అందరినీ చాలా మిస్సయేవాడిని. ఐదో తరగతి తర్వాత మైసూర్‌లో జాయిన్‌ చేశారు. పదో తరగతి వరకు అక్కడే చదివాను. 

ఎవరు ఏమనుకున్నామా అమ్మానాన్నా నా మొదటి గురువులు. ఎందుకంటే వాళ్లు లేకపోతే నేను, నా కెరీర్‌ ఇలా ఉండకపోయేది. అలా చూస్తే వాళ్లు నా బెస్ట్‌ టీచర్లే. క్లాసులో కూర్చోబెట్టి చెప్పలేదు.. కానీ ఇంట్లో ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ‘నువ్వు అద్భుతాలు చేయకున్నా పర్వాలేదు.. కానీ చెడ్డ పేరు తేవొద్దు’ అనేవారు.

చిన్నప్పటి నుంచి గేమ్స్‌ బాగా ఆడేవాడిని. అథ్లెటిక్స్‌లో స్టేట్‌లెవల్‌ వరకు రిప్రజెంట్‌ చేశాను. పదో తరగతి మంచి మార్కులతో పాసయ్యాను. ఇంటర్‌ కోసం మంగళూరు అన్నారు. ఆ తర్వాత డిగ్రీ బీకామ్‌ చేస్తానని చెప్పా. దానికోసం బెంగళూరు వచ్చాను. కుదురుగా ఒక చోట ఉండేవాడిని కాదు. దీంతో ఫ్రెండ్స్‌ సర్కిల్‌ చాలా తక్కువ. పైగా నేను చాలా కోపిష్టి. ఎవ్వరితో సరిగా మాట్లాడేవాడిని కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం ఉండకపోయేది. మొహం మీదే వారి గురించి చెప్పేవాడిని. చాలామందిని అలా బాధపెట్టాను. డిగ్రీ రెండో సంవత్సరం వచ్చేవరకు ఇలాగే ఉన్నాను. తర్వాత ఒక గది అద్దెకు తీసుకొని ఫ్రెండ్స్‌తో ఉండడం ప్రారంభించా. అప్పుడు నాలో మార్పు మొదలైంది. సడెన్‌గా నెమ్మదస్తుడిగా మారిపోయా. అప్పుడు నాకు జీవితం అర్థమైంది. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకున్నా. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నావి పిల్లి కండ్లు. చాలామంది పిల్లి కండ్లు ఉన్నవాళ్లను నమ్మకూడదంటూ నన్ను వెక్కిరించేవాళ్లు. కొందరేమో భయంగా ఉన్నాయని, మరికొందరేమో బాగున్నాయని కితాబిచ్చేవాళ్లు.  

అవమానాలతో

మా కజిన్‌ వాళ్ల ఫ్రెండ్‌ ఒకరోజు నాకు ఫోన్‌ చేసింది. ‘సీరియల్‌లో హీరో కోసం వెతుకుతున్నారు. నువ్వు అయితే బాగుంటావేమోన’ని అనిపించిందని అన్నది. తను జోక్‌ చేస్తుందనుకున్నా. నా వరకు నేను ఎంబీఏ చేసి, ఏదో ఒక ఉద్యోగం చేస్తే సరిపోతుందని అనుకుంటున్న సమయంలో ఈ కాల్‌ వచ్చింది. ఎందుకు ఇదంతా అని కూడా అనిపించింది. తను చెప్పిందని ఆడిషన్‌ కోసం వెళ్లా. ఎనిమిది రోజుల పాటు జరిగింది ఆ ఆడిషన్‌. అప్పటికే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సీరియల్‌లో హీరో రీప్లేస్‌మెంట్‌గా నన్ను తీసుకోవాలనుకున్నారని ఆ తర్వాత తెలిసింది. అప్పటి వరకు నాకు యాక్టింగ్‌ ఏంటో తెలియదు. అంతేకాదు.. నేను సీరియల్‌, టీవీ చూసే రకాన్ని కూడా కాదు. ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడు సినిమాలు చూసేవాడినంతే. మూడు నెలల పాటు ఆ సీరియల్‌లో నటించా. కానీ పాత హీరో ఇంపాక్ట్‌ చాలా ఉంది. దాంతో నన్ను జనాలు యాక్సెప్ట్‌ చేయలేదు. దాంతో ప్రేక్షకుల నుంచి నాకు తిట్లు మొదలయ్యాయి. ‘పంపించేయండి’ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెట్టేవాళ్లు.. నాకెందుకో ఇండస్ట్రీ సరిపడదని వచ్చేశా.  

 తెలుగు ఆఫర్‌..

ఇండస్ట్రీ కంటే.. చదువు మీద శ్రద్ధ పెట్టాలని బెంగళూరులో ఎంబీఏలో జాయినయ్యా. అప్పడే అన్నపూర్ణ స్టూడియో నుంచి కాల్‌ వచ్చింది. ‘నాకు యాక్టింగ్‌ రాదు. నాకు తెలుగు కూడా రాద’ని ఫోన్‌ పెట్టేశా. తర్వాత గూగుల్‌లో సెర్చ్‌ చేశా. నాగార్జున గారి బ్యానర్‌ అని అర్థమైంది. అయ్యో ఇంత మంచి చాన్స్‌ మిస్‌ చేసుకోవద్దని భావించా. సరేనని మళ్లీ నేనే ఫోన్‌ చేసి వస్తున్నాని చెప్పాను. అయితే తెలుగులో ఒక వీడియో చేసి పంపమని చెప్పారు. ఏదో ఒక పేజీ డైలాగ్‌ చెప్పారు. వాళ్లు చెబుతుంటే దాన్ని ఇంగ్లిష్‌లో రాసుకొని వీడియో తీసి పంపించా. ఓకే చెప్పి హైదరాబాద్‌కి రమ్మన్నారు. వచ్చాక తెలిసింది నా వీడియో చూసి చాలా నవ్వుకున్నారని. ఎలాగైతేనేం.. జీ తెలుగులో ‘పున్నాగ’ సీరియల్‌తో తెలుగులో నా అరంగేట్రం అయింది. ముందు తెలుగు అర్థంకాక ఇబ్బంది పడ్డాను. కానీ మూడు నెలల్లో తెలుగును, తెలుగువారి అభిమానాన్ని సంపాదించాను. 

నా కెరీర్‌ ఇక్కడే.. 

ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నానో అక్కడే మళ్లీ నిరూపించుకోవాలనుకున్నా. పున్నాగ అయిపోతుండగా కన్నడ సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. ఆ డైరెక్టర్‌కి నాకు పడలేదు. నాలుగు నెలల్లోనే ఆ సీరియల్‌ నుంచి బయటకు వచ్చేశా. అది చేస్తుండగా తెలుగు నుంచి చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. వెంటనే హైదరాబాద్‌కు వచ్చేశా. అలా జీ తెలుగులో ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు’లో ఆఫర్‌ వచ్చింది. ఇది నాకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్‌. ఆ క్యారెక్టర్‌కు మంచి పేరొచ్చింది. నేను ఏది ప్లాన్‌ చేయను. లైఫ్‌ ఎలా వెళితే అలా వెళ్లిపోతాను. వచ్చిన రోల్‌నే డ్రీమ్‌ రోల్‌గా భావించి చేస్తా. ఇక నాకు సినిమా ఆఫర్లు వచ్చినా చేయను. నేను సీరియల్స్‌లోనే చేయాలని అనుకుంటున్నా.  

డిజిటల్‌ లవ్‌.. 

నాకు ఐశ్వర్య పరిచయం అయింది ఇన్‌స్టాలో. ఒకరోజు ఇన్‌స్టాలో ఏదో చూస్తుంటే తన వీడియో కనిపించింది. నాకు చాలా నచ్చింది. అదే విషయం తనకు మెసేజ్‌ పెట్టాను. ఎప్పటికో ‘థ్యాంక్యూ’ అంటూ నాకు సమాధానం వచ్చింది. ఆ తర్వాత చాటింగ్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాం. దాదాపు ఆరేడు నెలలు స్నేహితులుగా ఉన్నాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. తను నాకు లైఫ్‌ పార్టనర్‌గా అయితే బాగుండనిపించింది. అది తనకు చెప్పా. ఒప్పుకొన్నది. ఇంట్లో కూడా చెప్పాం. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకొన్నారు. కాకపోతే మా అన్నయ్య పెళ్లి కాలేదు. తన పెళ్లి అయ్యాక మా పెళ్లి గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు ఈ లవ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తాం.  

రమ్యా మేడమ్‌ ఓ జ్ఞాపకం

మాకు ఇంగ్లిష్‌ చెప్పిన రమ్యా మేడమ్‌ అంటే చాలా ఇష్టం. నాకు ఇంగ్లిష్‌ మీద మంచి పట్టు రావడానికి ఆవిడే కారణం. తనకు నేను ఫేవరెట్‌ స్టూడెంట్‌ని. నేను ఏదైనా తప్పు చేసినా నన్ను ఏమీ అనేది కాదు. మిగతా వాళ్లతో పోలిస్తే ఆ మేడమ్‌తో దెబ్బలు తక్కువ పడేవి. ‘సగం నాలెడ్జ్‌తో ఎప్పుడూ మాట్లాడుకూడదు. దాని గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి’ అని చెప్పేది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తను ఇంగ్లిష్‌ చెప్పింది. అయితే మేం టెన్త్‌లో ఉన్నప్పుడు.. మేడం పెండ్లి కుదిరింది. పెండ్లయ్యాక తను స్కూల్‌ విడిచి వెళ్తుందని తెలిసి చాలా ఏడ్చేశా. ‘మాకు పాఠాలు ఎవరు చెబుతారు’ అని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు ఆ సంఘటన గుర్తుచేసుకుంటే నవ్వు వస్తుంది.

 logo