సోమవారం 26 అక్టోబర్ 2020
Zindagi - Sep 05, 2020 , 00:18:19

బెత్తం పట్టి.. కరోనా కట్టడి చేసి

బెత్తం పట్టి.. కరోనా కట్టడి చేసి

ఆమె ఆలోచన కేరళకు శ్రీరామ రక్ష అయింది.ఆమె ముందుచూపు కొవిడ్‌ వ్యాప్తిని తగ్గించగలిగింది. ఆవిడే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి  శైలజ. ఇంకా చెప్పాలంటే టీచర్‌ శైలజ. కొవిడ్‌ నేపథ్యంలో ఆమె పేరు తరచూ వార్తల్లో నిలిచింది. తాజాగా మరోసారి అరుదైనఘనత వహించారామె. కొవిడ్‌-19 యుగానికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆలోచనాపరుల్లో మొదటి స్థానంలో నిలిచారు ఈ పంతులమ్మ.

నైరుతి రుతుపవనాలు తొలిగా తాకినట్టు.. మనదేశంలో కరోనా మహమ్మారి కేరళలోనే వెలుగు చూసింది. విషయం తెలియడంతోనే ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఆలస్యం చేయలేదు. టెస్ట్‌, ట్రేస్‌, ఐసోలేట్‌ విధానాన్ని పక్కాగా అమలు చేశారు. ఇప్పుడు కేరళలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నా, మరణాలు తక్కువగా ఉన్నాయన్నా.. ఆ ఘనత ఆమెకే చెందుతుంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలూ అంగీకరించాయి. బీబీసీ, ది గార్డియన్‌, ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలు ప్రశంసించాయి. యూకేకు చెందిన ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ కొవిడ్‌-19 యుగానికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆలోచనాపరులు ఎవరని నిర్వహించిన పోల్‌లో 20వేల ఓట్లతో శైలజ అగ్రస్థానంలో నిలిచారు.

ఆమె తర్వాతే జెసిండా 

కేరళలోని కన్నూరు జిల్లా కూతుపరంబాలో జన్మించారు శైలజ. విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. తర్వాత జీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరారు. కన్నూరులోని శివపురం హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా దాదాపు ఇరవై ఏండ్లు పనిచేశారు. ఆదర్శ ఉపాధ్యాయురాలిగా అందరి మన్ననలూ అందుకున్నారు. ఉద్యోగానికి స్వస్తి పలికి సీపీఐ(ఎం) తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  పదవిలోకి వచ్చింది మొదలు ఎన్నో సవాళ్లు ఆమెను పలకరించాయి. వరదలు ముంచెత్తడం, నిఫా వైరస్‌ చెలరేగడం అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ అనుభవం కొవిడ్‌ కట్టడిలో ఎంతగానో ఉపయోగపడిందని చెబుతారు శైలజ. ఒక ఉపాధ్యాయురాలిగా పిల్లల విషయంలో కఠినంగా ఉండటం అలవాటున్న శైలజ.. కొవిడ్‌ నియంత్రణలో అంతే నిక్కచ్చిగా వ్యవహరించారు. ఫలితంగానే తమ రాష్ట్రం భారీ ఉపద్రవం నుంచి బయటపడిందని మలయాళీలు విశ్వసిస్తున్నారు. ఆమెను కరోనా వైరస్‌ స్లేయర్‌గా పిలుచుకుంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థ కూడా శైలజ పనితీరును మెచ్చుకోవడమే కాక.. కొవిడ్‌ నియంత్రణలో ఆమె భాగస్వామ్యాన్ని కోరడం విశేషం. తాజాగా ‘సరైన స్థలంలో, సరైన మహిళ’ అని పేర్కొంటూ ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌లో ప్రచురించింది. ఇలా కరోనా కట్టడిలో మెరుగైన సేవలందించిన జాబితాలో మొదటిస్థానాన్ని సాధించారు శైలజ. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా రెండో స్థానంలో నిలిచారు.


logo