గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 05, 2020 , 00:18:24

వర్చువల్‌ విక్టరీ!

వర్చువల్‌ విక్టరీ!

విశ్వవిద్యాలయంలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్థీ ముందుగానే ఊహించుకునే రోజు ఒకటి ఉంటుంది. అందమైన గౌన్‌ ధరించి.. నెత్తిన క్రౌన్‌ పెట్టుకొని.. సగర్వంగా పట్టా పుచ్చుకునే సందర్భాన్ని ముందుగానే ఊహించేస్తుంటారు. స్నేహితుల కేరింతల నడుమ, కన్నవారి ఆనందభాష్పాల మధ్య చేతుల్లోకి తీసుకున్న పట్టాను పైకెత్తి చూపించే సన్నివేశాన్ని ఈస్ట్‌మన్‌ కలర్‌లో దర్శించేస్తారు. కానీ, కరోనా కారణంగా.. ఈ ముచ్చట ముచ్చటగానే మిగిలిపోయింది. కానీ, ఐఐటీ బాంబే విద్యార్థులు మాత్రం కాన్వకేషన్‌ కార్యక్రమానికి అందరూ క్యాంపస్‌కు చేరుకున్నారు. స్నేహితులతో సరదాగా గడిపారు. పట్టాతోపాటు పతకాలూ అందుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉండగా ఇదేమిటీ చోద్యం అనుకొని వారిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఏ విద్యార్థీ కళాశాలకు రాలేదు, ఎక్కడా గుమిగూడలేదు.. అయినా వర్చువల్‌ రియాలిటీ సాంకేతిక సాయంతో అంగరంగ వైభవంగా కాన్వకేషన్‌ వేడుక నిర్వహించారు. ఎక్కడి విద్యార్థులు అక్కడ ఉంటూనే.. క్యాంపస్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉన్నట్టు భ్రమింపజేశారు. ఎవరి పట్టా వారే వీసీ చేతుల మీదుగా స్వయంగా అందుకున్న అనుభూతికి లోనయ్యారు. ఈ ముచ్చట గురించి తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ ‘సంప్రదాయం, సాంకేతికత అందంగా సంగమించాయి’ అంటూ ట్విటర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాన్వకేషన్‌ సంబురం పూర్తయిన తర్వాత విద్యార్థులందరూ యూనివర్సిటీ అంతా కలయతిరిగేశారట. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటూనే.. తమ హాస్టల్‌ గదిని చూసొచ్చారట, క్యాంటిన్‌లో కబుర్లు చెప్పుకొన్న టేబుల్‌ను పలకరించారట, తమ జ్ఞాపకాలు దాచుకున్న ప్రతి ప్రదేశాన్నీ తరచి తరచి చూసొచ్చారట. భలేగా ఉంది కదూ ఈ ముచ్చట! 


logo