మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Sep 05, 2020 , 00:12:39

కాపరి ప్రస్థానం

కాపరి ప్రస్థానం

పూర్వం ఒక రాజ్యంలో మందారవతి అనే పెద్ద అడవి ఉండేది. దానికి రాజు సింహం.  ఆ అడవిలో కళకళలాడే ‘మందారవనం’ అనే కొంత భాగం ఉండేది. దాన్ని  పాలించడానికి తన మిత్రులను ప్రత్యేకంగా నియమించాలనుకుంది సింహం. దీంతో పాత మిత్రుడైన ఒక గొర్లకాపరిని పిలిపించింది. ఆ ఆహ్వానం మేరకు  గొర్లకాపరి వచ్చి సింహంతో.. ‘మీరు  నమ్మి  నాకీ బాధ్యత అప్పగిస్తున్నారు. కానీ ఆ అడవిని ఏలడం నాకు సాధ్యమవుతుందా?’ అని అనుమానం వ్యక్తం చేశాడు. అప్పుడు సింహం ‘భయపడకు.. నీకిచ్చిన ప్రాంతంలో చెరువులు, పచ్చిక బయళ్లు, విశేషమైన జంతుజాలం, అమూల్యమైన వనరులు ఉన్నాయి. చక్కగా పాలించవచ్చు. అవసరమైతే నీకు కావాల్సిన పరివారాన్ని నియమించుకో’ అని వెన్నుతట్టింది. దీంతో గొర్లకాపరి మందారవనానికి అధిపతిగా నియమితుడయ్యాడు. మరుసటి రోజు మిత్రులైన రెండు పావురాలకు, ఒక గొర్రెకు, రెండు పిచ్చుకలకు కబురు పెట్టాడు. తమ మిత్రుడు అధిపతి అయిన సంగతి తెలుసుకున్న ఈ ప్రాణులు హుటాహుటిన గొర్లకాపరి దగ్గరకు వచ్చాయి.  ఆ తర్వాత గొర్లకాపరి నాయకత్వంలో మందారవనంలో పాలన ప్రారంభమైంది.  కొన్ని రోజులు గడిచాయి. అక్కడి వనరులను ఉపయోగించుకోవడంలో కాపరి,  పరివారం విఫలం అయ్యారు. పైగా ఉన్నపళంగా అధికారం రావడంతో కాపరి సోమరిగా తయారయ్యాడు. దీంతో మందారవనంలో పాలన ఆశించినంత మెరుగ్గా కనిపించలేదు. ఈ తీరును సింహం ఓ కంట కనిపెడుతూనే ఉంది. లోపాలను చూపుతూ సరిచేసింది. మరికొన్ని రోజులు గడిచాయి. పరివారం మీద కాపరి  ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలు పెట్టాడు.  దీంతో  అసహనానికి గురైన  పావురాలు గొర్లకాపరినీ, అడవిని విడిచి వెళ్లాయి. రోజులు గడుస్తున్నాయి కానీ అభివృద్ధి కనిపించడం లేదు.  పరిస్థితులు మారాయి. తీవ్రమైన ఎండల కారణంగా మందారవనం అంతా వెలవెలబోయింది.  వెంటనే సింహం స్పందించింది.  గొర్లకాపరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల్లోనే మందారవనంలో పాలన గొర్లకాపరితో సాధ్యం కాదని గుర్తించింది. ఆ పరివారాన్ని, కాపరిని తొలగించింది. ఆ నిర్ణయంతో కాపరి ప్రస్థానం సమూలంగా ముగిసింది.  కొద్ది రోజుల్లో సింహం మరో అధిపతికి మందారవనాన్ని అప్పగించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. 

నీతి: అర్హత లేని వారికి అధికారం అప్పగిస్తే ప్రయోజనం ఉండదు. 


logo