శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 03, 2020 , 23:48:47

మాస్కేసినా మసకుండదు!

మాస్కేసినా మసకుండదు!

మాస్కు ధరించిన తర్వాత కండ్లజోడు పెట్టుకున్నా.. కండ్లజోడే ముందు ధరించి.. తర్వాత మాస్కు పెట్టుకున్నా.. అద్దాలపై తేమ చేరకుండా ఉండదు. మన ముక్కు నుంచి వదిలిన గాలి.. కండ్లజోడులోకి జొరబడి.. అద్దాలపై పొగలా పేరుకుపోతుంది.

ఆఫీస్‌కు బయల్దేరాడు వరుణ్‌. పార్కింగ్‌లోకి వచ్చాడు. మాస్కు ధరించాడు. హెల్మెట్‌ పెట్టుకున్నాడు. చలువ కండ్లజోడు ధరించాడు. బైక్‌ స్టార్ట్‌ కాలేదు. నాలుగైదు సార్లు కిక్‌ కొట్టాక స్టార్ట్‌ అవ్వడంతో.. హమ్మయ్య అనుకుంటూ దీర్ఘంగా శ్వాస వదిలాడు. అంతే... వరుణ్‌ చూపు మందగించింది. కొండలను కప్పేసే పొగమంచులా.. మాస్కులో నుంచి వచ్చిన గాలి.. కండ్లజోడులోకి చొచ్చుకొని పోయింది. అద్దాలపై పొగలా పేరుకుపోయింది. బండి మీద ఏమవుతుందిలే అనుకొని.. మాస్కు తీసేశాడు వరుణ్‌. అద్దాలను ఓసారి తుడిచి రిస్కీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక్క వరుణే కాదు.. చాలా మంది కండ్లజోడుపై పొగబారుతున్నదని ప్రయాణ వేళల్లో, ఇతర సమయాల్లో మాస్కు ధరించడంలేదు. కండ్లల్ల్లో దుమ్ముపడితే ఫర్వాలేదు.. కానీ, కరోనా క్రిమి ముక్కులోకి దూరిపోతే.. ప్రాణానికే ప్రమాదం. అందుకే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి. మాస్కు తొలగించకుండా.. కండ్లజోడు మసకబారకుండా.. జాగ్రత్తగా ఉండండి.

కండ్లద్దాలను సబ్బుతో గానీ, లిక్విడ్‌ సోప్‌తో గానీ కడగండి. నీటితో శుభ్రం చేసి ఆరనివ్వండి. సబ్బునీళ్లు కండ్లద్దాలపై ఒత్తిడి తగ్గించి తేమ నిలవకుండా చేస్తుంది. షేవింగ్‌ ఫోమ్‌తో కళ్లజోడును శుభ్రం చేసినా.. కండ్లద్దాలు పొగచూరకుండా ఉంటాయి.


మార్కెట్‌లో డీమిస్టింగ్‌ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కండ్లజోడు ధరించడానికి ముందు ఈ స్ప్రే చేస్తే చాలు.. కాసేపటి వరకు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు.

ముక్కు, చెక్కిళ్ల మధ్య గ్యాప్‌ లేని మాస్కులు ధరిస్తే... శ్వాస వదిలినప్పుడు గాలి పైకి కాకుండా కిందికి వెళ్లిపోతుంది. గ్యాప్‌ ఉంటే.. టిష్యూపేపర్‌ కొద్దిగా తడిపి.. ఖాళీని పూరించండి. శ్వాస వదిలినప్పుడు వచ్చే గాలిని అది పీల్చుకుంటుంది.

  • పై భాగంలోకి  పైప్‌ క్లీనింగ్‌ స్టిక్స్‌ జొప్పించి మాస్కు కుట్టుకుంటే.. గ్యాప్‌ లేకుండా కవర్‌ చేసుకోవచ్చు.
  • ప్రయాణ సమయంలో సర్జికల్‌ టేప్‌తో గ్యాప్‌ని కవర్‌ చేసినా.. మసకబారే సమస్య తప్పించుకోవచ్చు.
  • నైలాన్‌ వస్ర్తాన్ని ఒక పొరగా వాడి మాస్కు కుడితే.. అది గ్యాప్‌ లేకుండా ముక్కును, మూతిని కవర్‌ చేస్తుంది.