శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 03, 2020 , 23:49:03

దీపాల పోటీ

దీపాల పోటీ

ఒక రాజ్యం. దానికో రాజు ఉండేవాడు. అన్ని రాజ్యాల్లోకెల్లా తన రాజ్యం గొప్పదిగా ఉండాలని రాజు భావింవాడు.  ఒక ఏడాది దీపావళి పండుగ రాబోతున్నది. వెంటనే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్నా తన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని అనుకున్నాడు. వెంటనే మంత్రితో చర్చించి ఒక పోటీ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడు. ఆయన కూడా అభ్యంతరం చెప్పలేదు.  రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టిన వారికి రాజు స్వయంగా బహుమానం ఇస్తాడని రాజ్యమంతా దండోరా వేయించాడు.  ప్రజలంతా పోటీలో పాల్గొన్నారు. ఒకరినిమించి మరొకరు ఇంటిని దీపాలతో అందంగా అలంకరించారు. రాజు ఎవరి ఇంటి ముందైనా ఆగి బహుమతి ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. సాయంత్రం కాగానే రాజు తన పరిచారకులతో రాజ్య పర్యటనకు  బయలుదేరాడు. ఎన్నో అద్భుతమైన ఇండ్లను చూశాడు, చాలా సంతోషించాడు. 

 ఊరి చివరకు వచ్చేసరికి ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజు  దూరం నుంచే ఆ ఇంటిని చూసి ‘ఆ ఇంట్లో ఎవరుంటారు? ఎందుకు వాళ్ళు దీపాలతో ఇల్లు అలంకరించుకోలేదు?’ అంటూ భటులను పంపాడు. విషయం ఏంటో తెలుసుకోవడానికి ఆ ఇంటికి రాజు కూడా బయలుదేరాడు. ఇంటి దగ్గరకు వెళ్ళి చూస్తే  బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రోడ్డు మీద ఒక గొయ్యి కనిపించింది అందరికీ. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని మాటిమాటికి ఆ దీపం ఆరిపోకుండా చూస్తూ అందులో నూనె పోస్తున్నది.  అది చూసి రాజు ‘అవ్వా! నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపాలు ఎందుకు పెట్టలేదు?’అని అడిగాడు. ‘నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టేంత డబ్బు మాత్రమే ఉంటుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే అందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా ఇక్కడ   పెడతాను’ అని చెప్పింది. జవాబు విన్న రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఊళ్ళో అందరూ వారి ఇండ్లని దీపాలతో అలంకరించుకుంటే, అవ్వ మాత్రం బాటసారులకు దారి చూపించడం కోసం దీపం పెట్టిందని అనుకున్నాడు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆమెకు అందజేశాడు. మరునాడే రాజు ఆ రహదారిలో ఉన్న గోతిని కూడా మరమ్మత్తు చేయించేశాడు. 


logo