శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 03, 2020 , 22:45:42

గూడెంలో విరిసిన విద్యావనం

గూడెంలో విరిసిన విద్యావనం

భవన నిర్మాణ పనులు చేసుకొని బతికే కూలీల బిడ్డ రాపోలు సావిత్రి. అయిదో తరగతి వరకు చదివింది. ఆర్థిక స్తోమత లేక ఒక లాండ్రిలో పనికి కుదిరింది. తల్లి అనారోగ్యంతో దూరమైంది. చదువు మానేసిన సావిత్రిని ‘నచికేత తపోవన్‌ ’ వారు స్కూల్లో చేర్చుకొని ఖర్చులన్నీ భరించి చదివించారు. అలా ఆమె బీటెక్‌ పూర్తిచేసి, ఇపుడు హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అసోసియేట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరా అయింది. తనలాంటి పేదపిల్లలకు అండగా ఉంటానంటున్నది సావిత్రి.

నిజామాబాద్‌లోని బస్వాపూర్‌కి చెందిన పాపిగారి శివ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చింది. తల్లి ఇండ్లల్లో పనిమనిషిగా చేరింది. శివను చదివించడం ఆ తల్లికి భారంగా మారింది. బడి మానేసిన శివను  ‘నచికేత తపోవన్‌' అక్కున చేర్చుకుంది. ఇంటర్‌లో 96.4 శాతం మార్కులు సాధించాడు. బీటెక్‌ చదివి.. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఉదాహరణలు మాత్రమే! నచికేత తపోవనంలో ఎదిగిన పిల్లలెందరో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఎందరో అభాగ్యుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నది నచికేత తపోవన్‌. ఇంతకీ ఇది ఎక్కడుంది? అక్కడ ఏం జరుగుతున్నది?..

కరువుతో పెద్దలు యుద్ధం చేస్తున్న చోటు అది. పాలమూరు జిల్లా జడ్చర్ల నుంచి పది కిలోమీటర్లు వెళ్తే.. ఇప్ప, టేకు చెట్ల మధ్య పెద్దబావి తండా, కొడగల్‌, కురువపల్లి, గోరిగడ్డ తండా,లక్ష్మీనాయక్‌ తండాలు కనిపిస్తాయి. ఇక్కడి పెద్దలు కాసుల కోసం కూలీకి వెళ్తారు. వారి బిడ్డలు ఏం తోచక తంగేడు పూలు కోసుకుంటూ.. మోదుగ చెట్ల వెంబడి తిరిగేవారు. ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడా పిల్లలంతా పుస్తకాలతో దోస్తీ చేస్తున్నారు. తపోవనం బాటపట్టారు. పదేండ్ల కిందట ఇక్కడి గిరిజన ఆవాసాలకు సమీపంలో నాలుగు కుటీరాలు ఏర్పాటయ్యాయి. వాటి మధ్యలో వెలిసింది చదువులమ్మ. మట్టి గోడల ఆశ్రమంలో గట్టి ఆశయాలున్న తరం తయారవుతున్నది. పిచ్చుకల కిచకిచలు, నెమళ్ల నడకలు.. కనువిందు చేసే పరిసరాలు ‘నచికేత’నాన్ని మనోహరంగా చూపుతాయి. బడికొచ్చే పిల్లలకు బండెడు పుస్తకాల మోత ఉండదు. ఆడుతూ పాడుతూ వస్తుంటారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంటారు. సరళమైన ఆంగ్లంలో అదరగొడుతుంటారు. కంప్యూటర్ల ముందు కూర్చొని ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. పిల్లలకు ఆత్మీయంగా పాఠాలు చెబుతూ కనిపిస్తారు నచికేతానంద స్వామి.

హిమాలయాల నుంచి తండాలకు

పాలమూరు ప్రాంతంలో చిన్నారులకు విద్యావెలుగులు పంచాలనే సత్సంకల్పంతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు సామాజిక వేత్త, నచికేత తపోవన్‌ విద్యా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు వసుంధరదేవి. ఈ విద్యాశ్రమం నిర్వహణ బాధ్యతలు తన భుజానికెత్తుకున్నారు స్వామి నచికేతానంద. మహారాష్ట్రకు చెందిన ఆయన ఆధ్యాత్మిక జీవనంలో మమేకమవుతూ హిమాలయాల్లో కొంతకాలం ధ్యానంలో గడిపారు. ఎవరో ఆజ్ఞాపించినట్టు పదేండ్ల కిందట వెనక్కి వచ్చేశారు. అప్పటి నుంచి కొడగల్‌లోని నచికేత తపోవన్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. ‘సామాజిక విలువలతో కూడిన చదువే సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది. మానవత్వాన్ని పరిమళింపజేస్తుంది. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, విజ్ఞానం వీటినే మూల సూత్రాలుగా ఇక్కడ పిల్లలకు విద్యా బోధన కొనసాగిస్తున్నాం’ అంటారు 

నచికేతానంద.

40 ఎకరాల విస్తీర్ణంలో

2012లో ప్రారంభమైంది తపోవన్‌ . 40 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం 190 మంది చిన్నారులు చదువుతున్నారు. చదువుతో పాటు యోగా నేర్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ఆర్కిటెక్చర్‌లో అనుభవం ఉన్న నచికేతానంద.. తపోవనం నిర్మాణంలో తనదైన శైలిని పాటించారు. ఎర్రమట్టితో కుటీరాలు నిర్మింపజేశారు. వేసవిలో చల్లగా, శీతకాలంలో వెచ్చగా ఉండటం వీటి ప్రత్యేకత. అరుదైన నిర్మాణశైలి కారణంగా విద్యార్థులకు ఏకాగ్రత నిలుస్తుంది అంటారు నచికేతానంద.  ఇక్కడ ఉపాధ్యాయులు చదువుతోపాటు సామాజిక బాధ్యతను రంగరించి బోధిస్తారు. ప్రతి రోజూ కర్మయోగ అని ప్రత్యేకంగా ఓ క్లాస్‌ ఉంటుంది.

తండాల్లో  ఆన్‌లైన్‌ క్లాసులు

తపోవనం తరగతులు సజావుగా సాగడానికి ఎందరో సహకరిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు విద్యను అందించడానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని గుర్తించిన పలు కంపెనీలు ఆర్థికంగా సాయం అందిస్తున్నాయి. ‘అరబిందో ఫార్మా ఫౌండేషన్‌' ఐదు గదుల నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చింది. మరోవైపు కొవిడ్‌ కారణంగా అంతటా ఆన్‌లైన్‌ బోధన కొనసాగుతున్నది. తపోవనంలోనూ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూసుకుంటున్నారు. ‘తండాల్లోని పిల్లలు రోజూ కొన్ని గంటల పాటు, తమ ఇండ్లలో స్మార్ట్‌ ఫోన్లు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. వారి సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. కూలీ పనులు చేసుకొనే తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుకు దూరం కాకూడదని స్మార్ట్‌ఫోన్లు కొనివ్వడం విశేషం. పిల్లల చదువుపై వారు చూపుతున్న శ్రద్ధ మాకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది’ అంటారు తపోవన్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ సంజీవని. నిరుపేద గిరిజన తండాల్లోనే కాదు.. హైదరాబాద్‌ మురికివాడల్లోని పిల్లల చెంతకూ చేరింది తపోవన్‌. అక్కడున్న అల్పాదాయ వర్గాల పిల్లల భవిష్యత్‌ తీర్చిదిద్దడానికి  ఈ విద్యా సంస్థ ఏర్పాటు అయింది. మాదాపూర్‌లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తున్నారు. 

విలువలున్న తరాన్ని నిర్మిస్తున్నాం..

నిరుపేద విద్యార్థుల్లో నైపుణ్యానికి పదునుపెడితే.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరు. ఈ ఉద్దేశంతోనే ‘నచికేత తపోవన్‌' ఏర్పాటైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే తరాన్ని సిద్ధం చేయడానికి కృషి చేస్తున్నాం. పాఠశాల స్థాయి విద్య అయిపోగానే మా బాధ్యత తీరిందని భావించకుండా.. వారి పైచదువులకు సాయం అందిస్తున్నాం. తండాలు, మురికివాడల్లో నుంచి మా దగ్గర చదివిన చిన్నారులు ఇప్పుడు ఇన్ఫోసిస్‌, ఏడీపీ వంటి సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. వారు సాధించే విజయాలే మాకు ప్రోత్సాహకాలు. - వసుంధర, విద్యాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు

తాజావార్తలు