మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Sep 03, 2020 , 22:33:22

ఆత్మైస్థెర్యమే ఆమె నేస్తం

ఆత్మైస్థెర్యమే ఆమె నేస్తం

ముంబైకి చెందిన స్మితా జగాడే.. 2010లో కారు డ్రైవింగ్‌ నేర్చుకుంది. డ్రైవింగ్‌ టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. నలుగురికీ కారు నడపడం నేర్పుతూ.. జీవితాన్ని నెట్టుకొచ్చింది. కరోనా కల్లోలంతో ఉన్న ఉద్యోగం పోయింది. మూడు నెలలు ఇంటికే పరిమితమైంది. దాచుకున్న కొద్ది డబ్బూ అయిపోయింది. భర్త లేకపోవడంతో కుటుంబ బాధ్యతంతా తనదే! ఇలా ఇంట్లో కూర్చుని బాధపడితే లాభం లేదనుకుంది స్మిత. కూతురు చదువు కొనసాగాలంటే తను ఏదో ఒకటి చేయాలనుకుంది. డ్రైవింగ్‌ నేర్పిన కారునే రోడ్డెక్కించింది. ట్యాక్సీగా మార్చేసింది. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూనే.. అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ట్యాక్సీ నడపడం మొదలుపెట్టింది. ‘ఈ సమయంలో రిస్క్‌ అవసరమా! పైగా రాత్రుళ్లు నడుపుతున్నావ్‌ పిచ్చెక్కిందా..! అయినా ఆడదానివి నువ్వు ట్యాక్సీ నడపడం ఏంటి?’ ఇలా ఇరుగుపొరుగు రకరకాల మాటలన్నారు. పట్టించుకోలేదు స్మిత. స్టీరింగ్‌ విడిచిపెట్టలేదు. ట్యాక్సీ మొదలుపెట్టిన రోజునే రూ.1,500 కళ్ల జూసింది. జనాలు బయట అంతగా తిరగని రోజుల్లోనే అంత మొత్తం సంపాదించానని గర్వంగా చెబుతుంది స్మిత. నెల తిరిగే సరికి రూ.25వేలు సంపాదించానని చెబుతున్నది. త్వరలోనే ఇంకో కారు కొని.. ఓ మహిళా డ్రైవర్‌ను ఏర్పాటు చేస్తానంటున్నదామె. ట్యాక్సీడ్రైవర్‌ అనుభవాలు ఎలా ఉన్నాయని ఆమెను అడిగితే.. ‘మీరు డ్రైవింగ్‌ను ఎప్పటికీ వదిలిపెట్టకండి.. మీ ట్యాక్సీలో ఎక్కే మహిళలు నిశ్చింతగా ఉంటారు. మీ స్ఫూర్తితో మరింత మంది మహిళలు ఈ రంగంలోకి వస్తారు’ అని ఓ ప్రయాణికుడు తనతో అన్న మాటలను చెప్పుకొచ్చింది స్మిత.logo