సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Sep 01, 2020 , 23:22:51

బుట్టబొమ్మా.. అదిరేనమ్మా!

బుట్టబొమ్మా.. అదిరేనమ్మా!

‘ఫ్యాన్‌ రెక్కల కన్నా వేగంగా ఎలా తిరిగింది? తారాజువ్వ కన్నా మిన్నగా ఎలా ఎగిరింది? ఎన్ని హొయలు పోయిందో.. స్ప్రింగ్‌ మింగేసిందో ఏమో..?’ ఇంతకీ ఎవరామె?‘ఆమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌' షోలో సోనాలీ డ్యాన్స్‌ చూసిన వారికి కలిగిన అనుమానాలివి. చూసినంత సమయం కళ్లను నమ్మలేదు. చూశాక నోటికి తాళం వేసి కరతాళాలు వినిపించారంతా! ఈ బుబొమ్మ ఎవరు.. ఎక్కడ పుట్టింది.. అనే అంతటా సెర్చింగులు. 

పశ్చిమబెంగాల్‌లో బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్న చిన్న పల్లె నుంచి వచ్చింది సోనాలీ మజుందార్‌. ఇంతకన్నా పెద్ద చిరునామా పేదరికం. వాళ్ల నాన్న రోజుకు వంద సంపాదిస్తే గొప్ప. కానీ, సోనాలీకి డ్యాన్స్‌ అంటే ప్రాణం. సినిమా పాటలు చూస్తూ నృత్యాన్ని ఔపోసన పట్టింది. తన ప్రతిభతో 15 ఏండ్ల వయసులో అమెరికా వెళ్లింది. ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌'షోలో అదరగొడుతున్నది. ఇటీవల జరిగిన క్వార్టర్స్‌ పోరులో సుమంత్‌ అనే సహచర డ్యాన్సర్‌తో కలిసి సాల్సా నృత్యంతో దుమ్ము దులిపేసింది. ‘తత్తడ్‌ తత్తడ్‌..’ అనే బాలీవుడ్‌ పాటకు ఆహూతులంతా బిత్తరపోయేలా స్టెప్స్‌ వేసింది. గాల్లోకి ఎగిరింది.. నేలపై గింగిరాలు తిరిగింది.. మేనును విల్లులా వంచి కండ్లు తిప్పుకోకుండా చేసింది. క్వార్టర్స్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో జడ్జిలను కట్టిపడేసిన మజుందార్‌.. సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఆ చిన్నది చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నది. 2012లో ఏడేండ్లున్నప్పుడు ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌లోనూ మెరిసిన సోనాలి.. ఇప్పుడు మరో అద్భుతాన్ని అందుకునే ప్రయత్నంలో ఉంది.logo