ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 31, 2020 , 23:28:55

బంగారు హంగు పైథానీ కొంగు

బంగారు హంగు పైథానీ కొంగు

గోదారి గలగలలకు దీటుగా అక్కడ మగ్గం ఆటల జోరు వినిపిస్తుంది.ఆ నదీమతల్లి ఒంపుసొంపులన్నీ ఒలకబోసి నేసినట్టు ఉంటుందీ చీర.అదే పైఠాణపురం.. అక్కడ పుట్టిందే పైథాన్‌ పట్టు.కొంగులో మెరుపు.. అంచులోనూ మై‘మెరుపు’.. చీరంతా బంగారం పూత పూసినట్టుగా దర్శనమిస్తుంది.నాట్యాలాడే నెమళ్లు.. అచ్చికలాడే చిలుకలు.. వచ్చి పైథానీ చీరను పట్టుకుని వేళ్లాడుతాయి. అంచునో, కొంగునో డిజైన్లుగా మారి మురిసిపోతాయి. కాటన్‌, ముస్లిన్‌తో మొదలైన పైథానీ చీరల ప్రస్థానం.. పట్టును పట్టుకోవడంతో కొత్త సొబగులు అద్దుకుంది. మరి ఆ చీరల సోయగాల గురించి తెలుసుకోండి..

మహారాష్ట్ర గోదావరి తీరంలో ఉన్న పైఠాణ్‌లో పుట్టింది పైథానీ పట్టు. అయితే నాసిక్‌ సమీపంలోని యేవ్‌లా పట్టణంలో పైథానీ పట్టు చీరలు ఎక్కువగా తయారవుతున్నాయి. తళతళలాడే మెరుపు ఈ చీరల సొంతం. చీర చీకిపోయినా.. పైథానీ మెరుపు తగ్గదని చెబుతుంటారు. ఈ చీరల్లో రకరకాలు ఉంటాయి. చీరంతా చుక్కలు వచ్చి, అంచు మెరిసిపోతుంటుంది. కొన్ని చీరల పల్లూ మొత్తం పైథానీ డిజైన్‌తో తీర్చిదిద్దుతారు. మరికొన్ని బార్డర్‌, పల్లు రెండూ పైథానీ డిజైన్‌తో తళుకులీనుతుంటాయి. ఈ చీరలు ఎక్కువగా రెండు రంగుల మిశ్రమంగా రూపొందిస్తారు. అడ్డం, నిలువు ప్రత్యేకంగా ఉండటం కోసం ఇలా వాడుతుంటారు. దీన్ని కెలెడోస్కోప్‌ విధానం అంటారు. ఈ పద్ధతి ద్వారానే చీరలను నేస్తారు.

మూడు రకాలుగా

ఒకప్పుడు ఒకే రంగుతో కాటన్‌, ముస్లిన్‌ని వినియోగించి నేసేవాళ్లు. 19వ శతాబ్దం నుంచి పట్టుతో నేయడం మొదలైంది. దీనికోసం చైనా నుంచి పట్టు దిగుమతి చేసుకునేవారు. ఈ చీరల్లో మూడు రకాల పట్టు దారాలను ఉపయోగిస్తారు. చర్ఖానీ ద్వారా ఈ పట్టుదారాలను వడికి.. చీర నేయడం ఒక పద్ధతి. సిడ్లీ గటా అనే ఒక సిల్క్‌ దారాన్ని ఉపయోగించి నేయడం మరో పద్ధతి. ఇక చైనా సిల్క్‌ కూడా ఉపయోగించేవారు. ముడిపట్టును కాస్టిక్‌ సోడాతో శుభ్రపరిచి, అవసరమైన రంగులు అద్దుతారు. దారాలను వేరు చేసి మగ్గంపై చీర రూపు తీసుకొస్తారు. ఇందులో వాడే జరీని సూరత్‌ నుంచి తెప్పిస్తారు. 

చీర నేయడం 

తారలన్నీ పరుచుకున్నట్టుండే పైథానీ చీరను నేయడానికి చాలా కష్టపడతారు నేతన్నలు. ముడిదారాన్ని వేడి నీటిలోముంచి, ఖార్‌ (ఉప్పు)లో సుమారు 15 నిమిషాలు నానబెట్టి బాగా తిప్పుతారు. తర్వాత పట్టునంతా ఒక కడ్డీకి చుట్టి మలినాలు తొలగిస్తారు. ఇలా రెండు నుంచి మూడుసార్లు చేసి తర్వాత చల్లని నీటిలోనూ ముంచి మలినాలు తొలగిస్తారు. తర్వాత రెండు మూడు అంచెల్లో రంగులు అద్దుతారు. ఇది పూర్తయిన తర్వాత  పట్టు దారాలను అసారీపై చుడతారు. ఇది చాలా సమయం తీసుకుంటుంది. అసారి నుంచి పట్టుదారాలను కాందిపైకి బదిలీ చేస్తారు. వీటిని మగ్గంపై ఏర్పాటు చేస్తారు. పట్టుదారాలను మగ్గంపై పద్ధతిగా పేర్చడానికే ఒకరోజంతా పడుతుంది. తర్వాత చీర నేయడం ప్రారంభం అవుతుంది. రెండు రకాల మోషన్స్‌లో చీరను నేస్తారు. ఇక వార్ఫ్‌ సామాన్యంగా పెగ్‌ లేదా డ్రమ్స్‌ మగ్గంలో నేస్తారు. బార్డర్‌, చీర మొత్తం కోసం వేర్వేరు, మూడు షటిల్‌ నేతతో చేస్తారు. అందువలన బాడీ, అంచు విడివిడిగా అల్లినట్లు కనిపిస్తుంది. కొన్ని సార్లు పల్లూ ప్రత్యేకంగా నేస్తారు.

పీష్వాల కాలంలో 

అజంతా గుహలకు సమీపంలో ఈ చేనేత కార్యక్షేత్రం ఉంది. అందుకే పైథానీ డిజైన్లలో బౌద్ధ చిత్రాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. బుద్ధుడి రూపంతో పాటు పక్షులు, నెమళ్లు, తీగలు, పూలు.. ఇలా రకారకాల డిజైన్లు మనకు దర్శనమిస్తాయి. ఇవికాకుండా పండ్లు, జామెట్రికల్‌ డిజైన్స్‌తో ఉన్నవి అవుట్‌ లైన్‌గా ఇస్తారు. పైథానీ చీరల్లో మోర్బంగాడి, కడియాల్‌ బార్డర్‌ చీర, షిరోడాక్‌ అనే చీరలు దొరుకుతాయి. ప్రత్యేకంగా డిజైన్లను బట్టి ఈ చీరలకు ఆ పేరు వచ్చింది.  బార్డర్‌ ఇంటర్లాక్డ్‌ వెఫ్ట్‌ టెక్నిక్‌తో నేస్తారు. ఇందులోనూ  నరాలి, పంఖీ అని రెండు రకాల డిజైన్లున్నాయి.

ఇలా చేయొచ్చు

పైథానీ చీరలు బంగారు వర్ణంలో ఆకర్షణీయంగా కనపడుతాయి. శుభకార్యాలు, పెండ్లిండ్లలో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుందీ చీర. దీనికి మంచి మగ్గం వర్క్‌ బ్లౌజెస్‌ డిజైన్‌ చేస్తే అందం రెట్టింపు అవుతుంది. అలాగే వీటిని లెహంగాస్‌ లాగా కూడా డిజైన్‌ చేసుకోవచ్చు. దీనికి పట్టు ఓణీ లేదా కట్‌ వర్క్‌ మగ్గం దుపట్టా బాగుంటుంది, అలాగే లాంగ్‌ గౌన్లు కూడా బాగుంటాయి. అంతేకాకుండా మనకి పైథానీ బార్డర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని వేరే ఫ్యాబ్రిక్‌కి ఆ బార్డర్స్‌ని జత చేయొచ్చు. చీర కానీ లెహంగా, లాంగ్‌ గౌన్లు ఇలా మనకు నచ్చినట్లు డిజైన్‌ చేసుకోవచ్చు. అలాగే పైథానీ దుపట్టా కూడా దొరుకుతుంది. వాటిని ప్లెన్త్‌ లెహంగా పైన లేదంటే.. లాంగ్‌ గౌన్ల పైన బాగుంటాయి. అలాగే పైథానీ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజెస్‌ చేసుకొని ప్లెన్త్‌ లెహంగాకి కింద బార్డర్‌ పైథానీ వేస్తే చాలా బాగుంటుంది.

డిజైన్‌ను బట్టి .. చీర తయారీకి 18 నుంచి 24 నెలల మధ్య సమయం పడుతుంది. పీష్వాల కాలంలో బార్డర్‌, పల్లూ  స్వచ్ఛమైన బంగారంతో, రాగితో తయారు చేయించుకునేవారట. వెండి జరీతో ఇప్పటికీ చీరలు 

నేస్తున్నారు.

రితీషా సతీష్‌రెడ్డి 

ఈశా డిజైనర్‌ హౌస్‌

ఫోన్‌: 7013639335, 8500028855, 

facebook.com/eshadesignerworks


logo