శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 31, 2020 , 23:28:57

ఖో అంటే.. వేంపేట అంటే.. కొమురయ్య!

ఖో అంటే.. వేంపేట అంటే.. కొమురయ్య!

చాకచక్యంగా పరుగెత్తాలి. చడీచప్పుడు లేకుండా ప్రత్యర్థులను చుట్టు‘ముట్టే’యాలి.అదును చూసుకొని మెరుపు వేగంతో వేటాడే చిరుతలా.. సాటి ఆటగాడు తట్టగానే తటాలున ముందుకు దూకాలి. మెదడుతో ఆడాలి. కలిసికట్టుగా ఆడాలి. అప్పుడే ఖోఖో ఆట రంజుగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని జట్టుగా రాణిస్తున్నారు వేంపేట క్రీడాకారులు. తమ ప్రతిభతో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి జట్టుల్లో చోటు దక్కించుకొని ఖోఖో అంటే వేంపేట అనేలా చేస్తున్నారు. జాతీయస్థాయిలో ఈ క్రీడాకారుల కీర్తిపతాక ఎగరడానికి కారణం పీఈటీ కొమురయ్య. 

పద్నాలుగు యేండ్ల కిందటి ముచ్చట. అప్పటి కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) మెట్‌పల్లి మండల కేంద్రానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేంపేట. అక్కడున్న జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పీఈటీగా కొమురయ్య వచ్చారు. ఆయనొచ్చేదాకా.. అక్కడి విద్యార్థులకు ఆటలంటే కాలక్షేపం మాత్రమే! కొమురయ్య రాళ్లల్లో రతనాలను వెలికితీశారు. ఆటల్లో ఆణిముత్యాలను తీర్చిదిద్దారు.

రోజుకు 8 గంటల శిక్షణ

పిల్లలకు ఆటలపై ఉన్న ఆసక్తి, పట్టుదలను గమనించిన కొమురయ్య.. వారికి సరైన దిశానిర్దేశం చేయాలనుకున్నారు. ఖోఖో ఆటను నేర్పించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఉద్యోగంలో చేరిన ఏడాదికే మెట్‌పల్లి నుంచి కుటుంబంతో సహా వేంపేటకు వచ్చేశారు. పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు, వారికి సరైన శిక్షణ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అంటారు కొమురయ్య. ఉదయం, సాయంత్రం కసరత్తు చేయించేవారు. రోజూ 8 గంటలు శిక్షణ కొనసాగేది. శారీరకంగా దృఢంగా ఉండేలా వ్యాయామం చేయించేవారు. ఆటలో పాఠాలన్నీ చెబుతూ.. వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దారు.


జాతీయస్థాయిలో కీర్తిపతాక

కొమురయ్య దగ్గర రాటుదేలిన విద్యార్థులు ఆటలో చెలరేగిపోయేవారు. మండల స్థాయిలో మురిపించారు. జిల్లా స్థాయిలో బంగారు పతకాలు గెలిచారు. రాష్ట్రస్థాయిలో నిలిచారు. జాతీయ స్థాయిలోనూ పలువురు క్రీడాకారులు అవకాశాలు అందిపుచ్చుకొని తమ ఊరి పేరు మార్మోగిపోయేలా చేస్తున్నారు.  వేంపేటపై గెలవడం అంటే మామూలు మాట కాదని ప్రత్యర్థి జట్లు భావించేవి. అండర్‌ 14, అండర్‌ 17, అండర్‌ 19, సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ ఏ స్థాయిలో అయినా వేంపేట క్రీడాకారులదే హవా! తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టంటే.. అందులో మూడింట రెండు వంతులు వేంపేట క్రీడాకారులే ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. భారత ఖోఖో జట్టులో తెలంగాణ నుంచి ఒకే ఒక్క ఆటగాడుంటే.. అదికూడా ఆ గ్రామానికి చెందిన యువకుడే కావడం విశేషం. అంతేకాదు పలువురు బాలికలు ఖోఖోలో తాము చూపిన ప్రావీణ్యం ఆధారంగా (స్పోర్ట్స్‌ కోటా) ఉన్నత విద్యావకాశాలు పొందారు. ఓ క్రీడాకారుడు రైల్వేలో ఉద్యోగం సాధించాడు. జాతీయస్థాయిలో అరడజను మంది అబ్బాయిలు సత్తా చాటుతున్నారు. సుమారు 12 మంది బాలికలు నేషనల్స్‌కు ఆడి వేంపేట వైచిత్రిని చాటి చెబుతున్నారు. ఏటికేడు కొత్త కొత్త ఆటగాళ్లు సరికొత్త ఉత్సాహంతో విజయాలు సాధించి కొమురయ్యకు గురుదక్షిణ సమర్పించుకుంటున్నారు.

మరింత మందిని తయారుచేస్తా!

పీఈటీగా దాదాపు 14 ఏండ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పటి వరకు ఎవరూ ఆటలపై దృష్టి పెట్టినట్టుగా కనపడలేదు. కానీ శిక్షణ ఇస్తే మెరికల్లా అవుతారని గ్రహించి..  వేంపేటకే నా కుటుంబాన్ని తీసుకొచ్చాను. అమ్మాయిలు, అబ్బాయిలకు సమానంగా శిక్షణ ఇస్తూ వస్తున్నాను. చాలా మంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఇక రాష్ట్ర జట్టులో మా ఊరి ప్లేయర్లే ఎక్కువ మంది ఉంటారు. జాతీయ జట్టుల్లోనూ తెలంగాణ వారున్నారంటే వాళ్లు మా పిల్లలే అయి ఉంటారు.  మరిన్ని వసతులు కల్పిస్తే.. మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతాను. 

-కొమురయ్య, పీఈటీ, జడ్పీహెచ్‌ఎస్‌, వేంపేట