బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 30, 2020 , 23:32:34

ఆకలి తీర్చడంలోనే అసలైన సంతృప్తి

ఆకలి తీర్చడంలోనే అసలైన సంతృప్తి

ఈ భూమ్మీద గుప్పెడు మెతుకుల కోసం అష్టకష్టాలు పడేవారు అనేకమంది. అందరి ఆకలి తీర్చడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ, తనకున్న స్థాయిలో అనేక మందికి తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నది ఓ వృద్ధురాలు. 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన శారదా చౌరాగడేకు 60 ఏండ్ల వయసు. హోటల్‌ నిర్వహిస్తున్నది. ఏ హోటల్‌ కెళ్లినా టిఫిన్‌ ధర రూ.25 నుంచే మొదలవుతుంది. కానీ, ఈ పెద్దావిడ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా రూ.2కే టిఫిన్‌ అందించడం మొదలుపెట్టింది. కొన్నేండ్ల తర్వాత నిత్యావసరాల ధరలు పెరుగడంతో ఇతర హోటళ్లలో రేట్లు పెంచారు. శారద కూడా ధర పెంచింది. రూ.10కే రెండు రకాల టిఫిన్లు అందివ్వడం ప్రారంభించింది. ఉప్పూ, పప్పూ ధరలు పెరిగినా, సంపాదన తగ్గినా... నాణ్యతలో మాత్రం రాజీ పడదామె. ఆదాయంలో అధిక భాగం ఇంటి కోసం, హోటల్‌ నిర్వహణకే ఖర్చు చేస్తుంటుంది. ఈ రేట్లతో హోటల్‌ నడిపితే లాభాలు ఎలా వస్తాయని అనేకమంది ప్రశ్నించారు. వారందరికీ ఆమె చెప్పే సమాధానం ఒకటే.. ‘ఈ హోటల్‌ వల్ల పది మంది ఆకలి తీరడమే తనకు పెద్ద బహుమతి’ అని. అయితే, ఇలా తక్కువ ధరకే ఆహార పదార్థాలను అందించడం వెనుక చాలా పెద్ద కథే ఉన్నది. ఎప్పుడూ ప్రశాంతంగా, ఎంతో ఆశావాదంతో కనిపించే శారదా గతంలో ఎంతో విషాదం దాగి ఉన్నది. పెళ్లయిన తర్వాత భర్త వేధింపులు భరించలేక ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వచ్చేసిందామె. పండంటి కొడుకు పుట్టాడు. కొన్నాళ్లకు శారద తల్లి మరణించడంతో ఇంటి భారమంతా ఆమెపైనే పడింది. కొడుకు ఆకలి తీర్చలేక ఆ తల్లి తల్లడిల్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎంతో కష్టపడి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని హోటల్‌ను ప్రారంభించింది. ఆకలితో వచ్చేవారిని ఆదరిస్తూ, తక్కువ ధరకే వాళ్లు తృప్తిగా తినేంత ఆహారం అందిస్తున్నది. తమ ఆకలి తీర్చిన ఈ అన్నపూర్ణను అందరూ దోశ అజ్జీ (దోశల అమ్మమ్మ) అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.


logo