ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 30, 2020 , 22:59:43

నిజం

నిజం

 గిరిపురం జమిందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, ‘అయ్యా నా పేరు విశ్వనాథం. నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే, మీ పేరు చెప్పుకొని బతుకుతాను’ అన్నాడు. జమిందారు, ‘మా దివాణంలో రామచంద్రం, జోగినాథం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటినుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల రోజుల పాటు  పాటు వాళ్ళిద్దరి దగ్గరా పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే, అప్పుడు చూద్దాం’ అన్నాడు. తెలివితేటలూ, మాటకారితనమూ కలిగిన విశ్వనాథం ప్రవర్తన, ఆ పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. వీళ్లిద్దరరికీ చెరో ఆడ పిల్ల ఉంది.  విశ్వనాథాన్ని మంచి చేసుకుని,  అతనికిచ్చి పెండ్లి   చేద్దామన్న ఆలోచన వచ్చింది వాళ్లకు. జోగినాథం వీలుదొరికినపుడల్లా విశ్వనాథంతో.. ‘నువ్వా రామచంద్రాన్ని నమ్మకు. అతడికి జమిందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటుంది’ అనేవాడు. 

ఇక రామచంద్రం విశ్వనాథంతో..‘జోగినాథం చీటికీ మాటికీ ఇంట్లో  వారికి ఏదో రోగం వచ్చిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చి, జమిందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు. అలాంటి వాడితో జతకట్టావనుకో, నీకూ చెడ్డ పేరు రావడం ఖాయం!’ అంటూ పదే పదే చెబుతూండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు వినీవినీ విసిగిపోయిన విశ్వనాథం, వాళ్ళ మాటల్లో వున్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతూన్న మాటలు చెప్పాడు. అంతా విన్న కరణం, ‘ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్ళే!  ఇదంతా, నాకూ, గ్రామ పెద్దలకూ తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేక పోతున్నాం’ అన్నాడు.  

విశ్వనాథం, జమిందారును ఏకాంతంలో కలుసుకున్నాడు. ఇరవై రోజులుగా రామచంద్రం, జోగినాథాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్లా గ్రామ కరణం, పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించాడు. ‘తమరు అనుమతిస్తే, వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజ స్వరూపమేమిటో, విన్నవించుకోగలరు’ అన్నాడు.  విశ్వనాథం మాటలకు జమిందారు ఒక్క క్షణం మాటరానట్టు ఉండిపోయి, ‘కరణం, ఊరి పెద్దలూ వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయతీని నేనెరుగుదును అన్నాడు. కొన్ని రోజుల్లోనే వారిద్దరి నిజస్వరూపం బయట పడింది. ఆ రోజు నుంచి  విశ్వనాథాన్ని రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరికీ పై అధికారిగా జమిందారు నియమించాడు. 


logo