ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 23:34:23

ప్రచారంలో నాయికల జోరు!

ప్రచారంలో నాయికల జోరు!

పవన్‌కల్యాణ్‌-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ చిత్రంలో చాన్స్‌ కొట్టేసిన పూజాహెగ్డే.. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌'లో సీత పాత్రలో కీర్తిసురేష్‌.. బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్‌లో నటించనున్న సమంత.. తమిళ హీరో విజయ్‌సేతుపతికి జోడీగా అనుష్క.. గత ఆరు నెలలుగా షూటింగ్‌లు లేవు. థియేటర్లు లేవు.. ఇక అగ్ర చిత్రాల ప్రకటనలు లేవు.  అయినా కొందరు కథానాయికలు మాత్రం రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సందడంతా వీరిదే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో డిమాండ్‌ ఉన్న నాయికలుగా..  సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌గా పాపులరైన వీరి చుట్టే సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సినిమా కబుర్లు, ప్రేమాయణాలు, పెండ్లి వార్తలు, వ్యక్తిగత ముచ్చట్లతో అందాల నాయికలు అనునిత్యం అభిమానుల్ని కనువిందు చేశారు.. సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నారు. 

పూజకు వేళాయెరా!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నది పూజాహెగ్డే. వరుస పరాజయాలతో ఐరెన్‌లెగ్‌గా ముద్రపడిన ఈ మంగళూరు సొగసరి ఈ చిత్ర విజయంతో దక్షిణాదిన లక్కీస్టార్‌గా మారిపోయింది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత అగ్ర హీరోల చిత్రాల్లో కథానాయికగా ప్రముఖంగా పూజాహెగ్డే పేరు వినిపిస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌'లో నటిస్తున్నది పూజాహెగ్డే. ఈ సినిమాతో పాటు అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' కోసం జోడీకట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమాల షూటింగ్‌ త్వరలో పునఃప్రారంభంకానున్నాయి. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ సినిమాను అంగీకరించింది పూజాహెగ్డే. వీటితో పాటు పవన్‌కల్యాణ్‌, హరీష్‌శంకర్‌ కలయికలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నంది. అల్లు అర్జున్‌-కొరటాల శివ సినిమాలో కథానాయికగా ఈ సుందరి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.  తమిళంలో హీరో సూర్య నటించనున్న ‘అరువా’లో కథానాయికగా పూజాహెగ్డే నటించనున్నట్లు ప్రచారం జరిగినా ఈ వార్తలను ఆమె ఖండించింది. ఇలా లాక్‌డౌన్‌ విరామంలో తరచుగా కొత్త సినిమాలతో వార్తల్లో నిలిచింది పూజాహెగ్డే. కరోనా కారణంగా లభించిన ఈ గ్యాప్‌లో తల్లిదండ్రులతో సరదాగా సమయాన్ని ఆస్వాదించింది. పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ వంటల తాలూకు ముచ్చట్లను నిత్యం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అలరించింది. యోగా, వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోల్ని పోస్ట్‌ చేస్తూ సందడి చేసింది.

ఉగ్రవాది పాత్రలో సమంత 


లాక్‌డౌన్‌ విరామంలో అర్బన్‌ వ్యవసాయం చేస్తున్నది సమంత. తన ఇంటి టెర్రస్‌పై కూరగాయల్ని పండిస్తున్నది. దానికి సంబంధించిన విశేషాల్ని, ఫొటోల్ని ప్రతిరోజూ సామాజిక మాధ్యమాల ద్వారా  అభిమానులతో పంచుకుంటున్నది. కష్టమే అయినా ఇష్టంగా చేస్తూ పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న ఆమె మరోవైపు కొత్త కథలపై దృష్టిసారిస్తున్నది. జాను తర్వాత అధికారికంగా సమంత ఏ సినిమాపై సంతకం చేయకపోయినా ఆమె సినిమాలకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ‘ఫ్యామిలీమ్యాన్‌-2’ సిరీస్‌తో త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై అరంగేట్రం చేయబోతున్నది. ఈ సిరీస్‌లో ఉగ్రవాదిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నది. ఈ సిరీస్‌తో పాటు తమిళంలో ‘కాథు వకుల రెండు కాదల్‌'తో పాటు అశ్విన్‌ శరవణన్‌తో మరో హారర్‌ సినిమా చేయబోతున్నది. అలాగే తెలుగులో భర్త నాగచైతన్యతో జంటగా విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వంలో సమంత ఓ సినిమా చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. బెంగళూరు నాగరత్నమ్మ జీవితంలో కథలో కథానాయికగా సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కన్నడ చిత్రం దియా రీమేక్‌లోనూ ఆమె కథానాయికగా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 

  విజయ్‌సేతుపతికి జోడీగా అనుష్క..


గత కొన్నేండ్లుగా సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది అగ్రకథానాయిక అనుష్క. ఏడాదికి ఒక సినిమా చేస్తుందామె. ఆమె అంగీకరించే సినిమాలు తక్కువే అయినా ప్రచారంలో మాత్రం చాలా సినిమాలుంటున్నాయి. అనుష్క కథానాయికగా నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సినిమాలో మూగ చిత్రకారిణిగా ప్రయోగాత్మక పాత్రలో అనుష్క కనిపించనుంది. హేమంత్‌ మధుకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అనుష్క నటించనున్న చిత్రాలంటూ  కొత్త సినిమాల వార్తలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. గౌతమ్‌మీనన్‌తో ఆమె ద్విభాషా సినిమా చేయనున్నట్లు తెలిసింది. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా నిర్మించే చిత్రంలో అనుష్క నటించనున్నట్లు సమాచారం. అనుష్క పెండ్లి వార్తలు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. పెండ్లికి ఇంకా సమయం ఉందంటూ సమాధానం దాటవేస్తూ వస్తున్నదామె

నవతరంపై నయన్‌ గురి


విఘ్నేష్‌శివన్‌తో ప్రేమాయణం, కొత్త సినిమా వార్తలతో  నయనతార ప్రచారంలో నిలిచింది. ఆమె చిత్రసీమలోకి ప్రవేశించి 17 ఏండ్లయినా నవతరం తారలకు గట్టిపోటీనిస్తున్నది. కమర్షియల్‌ సినిమాలతో మరోవైపు ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తూ మంచి విజయాల్ని అందుకుంటున్నది. లాక్‌డౌన్‌ కారణంగా దొరికిన ఏకాంత సమయాన్ని ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌తో ఆస్వాదిస్తున్నది నయన్‌. త్వరలోనే వీరిద్దరు పెండ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తమిళంలో రజనీకాంత్‌ ‘అన్నాత్తే’తో పాటు మరో మూడు సినిమాల్లో నటిస్తున్నది. నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న అంధాధూన్‌ రీమేక్‌లో ఆమె కీలకభూమిక పోషించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సీతగా కీర్తి సురేష్‌ 


‘మహానటి’ సక్సెస్‌ తర్వాత ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్‌గా మారింది కీర్తి సురేష్‌. ఆమెను దృష్టిలో పెట్టుకొని పలువురు దర్శక, రచయితలు సరికొత్త కథల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో కీర్తి సురేష్‌ నటిస్తున్న పలు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. తెలుగులో నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుడ్‌లక్‌ సఖీ’ చిత్రంలో షూటింగ్‌ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్న గిరిజన యువతిగా నటిస్తున్నది. ఈ సినిమాతో పాటు ‘మిస్‌ ఇండియా’ సినిమా చేస్తున్నది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ‘సర్కారువారి పాట’ సినిమా కోసం తొలిసారి మహేష్‌బాబు సరసన నటించనున్నది. అలాగే తమిళంలో  రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తే’లో కీలక భూమిక పోషిస్తున్నది కీర్తి. అంతేకాదు ‘సాని కాయిధమ్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని అంగీకరించింది. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న ‘మరక్కార్‌'లో కథానాయికగా కనిపించబోతున్నది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్‌ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న త్రీడీ మూవీ ‘ఆదిపురుష్‌'లో సీత పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రకాష్‌కోవెలమూడి దర్శకత్వంలో ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌'లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా కీర్తి సురేష్‌కు సంబంధించి రోజుకో సినిమా వార్త వినిపిస్తూనే ఉంది. వీటితోపాటు ఆమె ఓ వ్యాపారవేత్తను పెండ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలను ఖండించిన ఆమె మరో నాలుగైదేండ్ల వరకు పెండ్లి మాట ఎత్తొద్దంటూ బదులిచ్చింది. 


logo