శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 23:15:15

కారు ఇంజిన్‌తో సూపర్‌ బైక్‌

కారు ఇంజిన్‌తో సూపర్‌ బైక్‌

నేటి సమాజంలో బైకులంటే ఇష్టపడని యువత ఉండరంటే అతిశయోక్తి కాదు. అందునా అత్యంవేగంతో జూమ్మని దూసుకుపోయే సూపర్‌ బైకులంటే పడిచచ్చేవారు చాలామందే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సూపర్‌ బైకులు ఉన్నా వాటన్నింటినీ పెద్దపెద్ద కంపెనీలే ఎంతో కష్టపడి తయారుచేస్తూ ఉంటాయి. కానీ ఇద్దరు టీనేజీ కుర్రాళ్లు తయారుచేసిన ఈ సూపర్‌ బైక్‌ను చూసి మహామహా ఇంజినీర్లే నోర్లు వెళ్లబెడుతున్నారు. అవునుమరి.. ఇది అలాంటి ఇలాంటి బైక్‌ కాదు.. రకరకాల కార్లు, బైకుల పరికరాలతో తయారుచేసిన సూపర్‌ బైక్‌.

పంజాబ్‌లోని భోగ్‌పూర్‌ సమీపంలో ఉన్న గెహల్న్‌ గ్రామానికి చెందిన దేవిందర్‌సింగ్‌ (18), హర్‌సిమ్రాన్‌సింగ్‌ (20) వేరువేరు కాలేజీల్లో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. ఇద్దరికీ బైకులంటే చిన్నప్పటినుంచీ ఎనలేని కోరిక ఉండటంతో తామే సొంతంగా బైక్‌ తయారుచేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించటంతో వారికి ఖాళీ సమయం దొరికింది. దాంతో తమ మేధస్సుకు పదునుపెట్టారు. జూలై 1న మొదలుపెట్టి ఆగస్టు 8నాటికి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన బైక్‌ను తయారుచేశారు. 

  • ఈ బైక్‌లో నాలుగు రకాల కార్లు, బైకుల విడిభాగాలు వాడారు.
  • దీని ఇంజిన్‌ మారుతీ 800 కారుది. 
  • రేడియేటర్‌, కూలింగ్‌ ఫ్యాన్‌ టాటా ఏస్‌ది
  • స్టీల్‌ ఫుట్‌రెస్టులు మహీంద్రా బొలేరో కారువి. 
  • ఛాసిస్‌ బజాజ్‌ పల్సర్‌ 220 బైక్‌ది. బ్రేకులు, ముందు సస్పెన్షన్లు, హ్యాండిల్‌కూడా పల్సర్‌కు వాడేవే. 
  • హెడ్‌ల్యాంప్‌, మడ్‌గార్డ్‌లు యమహా ఎఫ్‌జెడ్‌ బైకువి.
  • చైన్‌సెట్‌, రిమ్స్‌, స్పీడోమీటర్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ క్లాసిక్‌ బైకువి.
  • ఇండికేటర్లు, వెనుక మడ్‌గార్డులు కేటీఎం బైకువి. 
  • ఈ బైక్‌ లీటర్‌ పెట్రోల్‌తో 20కిలో మీటర్లు పరుగెడుతుంది. గంటకు గరిష్ఠంగా 200-220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
  • బైక్‌ తయారీకి ఖర్చు రూ.2లక్షలు.