మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 23:15:17

రక్తనాళాల్లో ఈదే రోబో

రక్తనాళాల్లో ఈదే రోబో

మీ శరీరంలోని రక్తనాళాల్లో ఓ రోబో చకచకా ఈదుకుంటూ వెళితే.. శరీరంలో ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా రయ్‌మని పరుగెత్తి బయటినుంచి ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేసేస్తే.. ఏంటీ నమ్మటంలేదా? సమీప భవిష్యత్తులో ఇలాంటి రోబోలు మనుషుల శరీరాల్లో తిరుగుతాయని శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్తున్నారు. కంటికి కనిపించని మైక్రోస్కోపిక్‌ రోబోలను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. నాలుగు కాళ్లతో నడిచే ఈ రోబోలు తల వెంట్రుక కంటే సన్నగా కేవలం 0.1 మిల్లీమీటర్‌ మాత్రమే ఉంటుంది. వీటిని ఒక ఇంజెక్షన్‌తో మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టవచ్చు. ఇది సోలార్‌ సెల్స్‌ సాయంతో కదులుతుంది. ఈ సోలార్‌ సెల్స్‌పై లేజర్‌ కిరణాలను ప్రసరింపజేస్తే శక్తి ఉత్పత్తి అయ్యి రోబో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన శాస్త్రవేత్త మార్క్‌ మిస్కిన్‌ చెప్తున్నారు. ఈ రోబో కాళ్లను నానో మీటర్‌ మందం ఉన్న ప్లాటినంతో తయారుచేయటంతో అవసరమైన దిశలో ఇవి వంగుతాయని చెప్పారు. ఈ రోబోలు ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్నాయని వెల్లడించారు. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే వైద్యరంగంలో పెనుమార్పులు వస్తాయని చెప్పారు.logo