బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 27, 2020 , 23:07:58

కంచిపట్టు.. అదిరేట్టు!

కంచిపట్టు.. అదిరేట్టు!

కథలన్నీ కంచికి చేరుకుంటాయి.ఈ కథావస్తువు మాత్రం కంచి నుంచే మొదలైంది. నిన్న మొన్న మొదలైంది కాదు. నాలుగు శతాబ్దాల కిందట పుట్టిన కథ.. రంగు రంగుల కథ.. బంగారంతో నేసిన కథ.. రకరకాల అల్లికలతో కూడిన కథ.. కంచి ఖ్యాతిని ఖండాంతరాలూ చుట్టేసిన కథ.. అదే కంచిపట్టు కథ.

సప్త చిరంజీవి నగరాల్లో కంచి ఒకటి. కామాక్షమ్మ కొలువుదీరిన అందమైన నగరమది. సుందరమైన ఆలయాలకు నిలయం. దక్షిణభారత సంస్కృతికి పట్టుగొమ్మలా కనిపిస్తుందీ కాంచీపురం. అక్కడితో ముగిస్తే కంచి కథకు అర్థం ఏముంటుంది. ఇంతకు మించిన అద్భుతం ఒకటి కంచిలో పురుడుపోసుకుంది. అదే కాంచీపురం పట్టు. సిల్క్‌ సిటీగా పేరొందిన కంచిలో.. పుట్టిన పట్టు చీరకున్న దర్పమే వేరు. 400 ఏండ్లుగా ఫ్యాషన్‌ రంగంలో కంచిపట్టు  తన పట్టు నిలుపుకొంటున్నది. ఈ ఘనత వెనుక వందలాది చేనేత కార్మికుల శ్రమ ఉంది.  చీర పోగుపోగులో వారు చూపే సృజనాత్మకత దాగి ఉంది.

అంచనాలకు అందని అంచు

కాంచీపురం పట్టుచీరల్లో ప్రతిదీ ప్రత్యేకమే. వేవేల వర్ణాల్లో మెరిసిపోతుంటాయా చీరలు. ఈ తరం ఫ్యాషన్‌ డిజైనర్ల అంచనాలకు అందని అంచును సింగారించుకొని ఎప్పటికప్పుడు కొత్తగా ముస్తాబై మార్కెట్‌లోకి వస్తుంటాయి. చీర ఎంత బరువో.. కట్టుకున్న వారికి పరువు కూడా అంతే పెరుగుతుంది మరి. ఈ పట్టుచీరలను తయారు చేయడానికి కంచి నేతన్నలు రెండు రకాల వేపు (మగ్గాల్లో పడుగుపై నేసే దారం) వాడుతారు. ఒకటి  జరీ వేప్‌. రెండోది జోద్‌ పూరి వేప్‌. జరీ దారంలో రంగుల పట్టుదారం కలిసి ఉంటుంది. దారాలే కాదు.. మగ్గాలూ రెండు రకాలవి వాడుతారు.  ఒకటి ఫ్రేమ్‌ లూమ్‌, రెండోది పిట్‌ లూమ్‌. నేసే విధానం గురించి ఇంకా చెప్పుకోవాలి.. చీర నేసే ప్రక్రియ  మూడు అంచెలుగా కొనసాగుతుంది. షెడ్డింగ్‌, పికింగ్‌, బీటప్‌ ఈ మూడు పనులూ కలగలిపితే అందమైన చీర పుడుతుంది. కాంచీపురం పట్టుచీరల ఉత్పత్తి కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన స్థానిక ముడి పట్టును వాడతారు. జరీ దారాలను భారీగా వినియోగిస్తారు. పట్టు చీరల మీద క్లిష్టమైన డిజైన్లను తీసుకురావడానికిగాను ఈ జరీని అదనపు వేప్‌గా గానీ, వెప్ట్‌గా గానీ వాడుతారు. పట్టుతోపాటు వెండి, బంగారు కలగలిసిన జరీని వినియోగిస్తుంటారు.

సిసలైన పట్టు

కంచిపట్టు ఇంతలా ప్రజాదరణ పొందడానికి కారణం వాటికున్న సాంకేతికతే అంటారు. కొత్తదనం, కొట్టొచ్చే దర్పం.. కంచిపట్టుకు గొప్పదనాన్ని కలిగించాయంటారు. నేతగాళ్లు సంప్రదాయ పద్ధతుల్లోనే పని చేస్తున్నా.. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్లు సృష్టిస్తుండటంతో కంచి పట్టుకు డిమాండ్‌ తగ్గలేదు. అన్ని వయస్సుల వినియోగదారులు, అన్ని వర్గాల ప్రజల అభిరుచులను పరిగణలోకి తీసుకొని నేతన్నలు కష్టపడుతుంటారు. ధనిక, మధ్యతరగతి వినియోగదారుల స్థాయిలను బట్టి చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకుంటూనే.. డిజైన్లలో ఈ కాలానికి తగ్గ మార్పులు చేస్తున్నారు. బ్రిక్‌, పక్షులు, ఆకులు, మామిడి, నయాపైసా, సావరిన్‌ తదితర ఆదరణ పొందిన డిజైన్లను పొందికగా నేసి.. అందరి మనసులనూ కొల్లగొడుతున్నారు. నీలం, నలుపు, ఆకుపచ్చ, గాఢ పసుపు వర్ణాల్లో ఎక్కువగా ఉంటాయీ చీరలు. కాలానుగుణంగా లేత రంగుల్లోనూ తళుకులీనుతుంటాయి.

చేయి తిరిగిన కళాకారులు

కంచి చీరలో మరో ప్రత్యేకం కొర్వాయి, పెట్ని విధానాలు. కొర్వాయి పని విధానంలో చీర అంచును ప్రధాన చీరకు జత చేస్తారు. ఈ పనిని చక్కబెట్టేందుకు చేయి తిరిగిన చేనేత కళాకారులు ఉంటారు.  పెట్ని విధానంలో.. పల్లు భాగాన్ని చీరలోని ప్రధాన భాగంతో కలుపుతారు. టై-డై విధానాన్నీ అనుసరిస్తున్నారు. కొర్వాయి, పెట్ని విధానం కంచి ప్రత్యేకతగా చెబుతారు. మగ్గాల మార్పులోనూ, చీరలను ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలోనూ నేతన్నల గొప్పదనం అణువణువునా తొంగిచూస్తుంది. వెరసి కంచిలో మొదలైన పట్టుచీర కథ... ఫ్యాషన్‌ రంగం ఎన్ని కొత్త పుంతలు తొక్కినా కంచికి చేరదు. తరాలు ఎన్ని మారినా ఆ చీరలు మన ఇంటికే చేరుతాయి.

పేరును బట్టి డిజైన్లు

చీరల డిజైన్లకు పేర్లూ ఉన్నాయి. తాండవాలం చీరలు చూపించండి అనగానే... దుకాణం యజమానికి అర్థమైతే.. వెంటనే సమాంతర గీతల డిజైన్‌ ఉన్న కంచి పట్టు చీరలు మన ముందు పరుస్తాడు. ఇందులో స్ట్రిప్స్‌ చీర పొడుగునా ఉంటాయి. ఇదే కాదు కొట్టడి అంటే చెక్‌ ప్యాటర్న్‌ డిజైన్‌. ఇందులో చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలతో వివిధ కొలతల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. పుట్టాస్‌ రకంలో..  బొమ్మలు, పువ్వులు వేటికవే ఉంటాయి.  ఇక టిష్యూ చీరల్లో.. మొత్తం వెప్ట్‌ బంగారు లేసుతోనే నేస్తుంటారు. ఇలా రకరకాల డిజైన్లు... కంచి పట్టును గొప్పగా నిలబెడుతున్నాయి.


logo