శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Aug 26, 2020 , 23:12:27

అబార్షన్‌ హక్కు ఉండాలా?

అబార్షన్‌ హక్కు ఉండాలా?

ఓ కొత్త జీవి ఈ ప్రపంచంలోకి రావాలి అంటే, అందుకు అనువైన పరిస్థితులు ఉండాలి. తల్లి లేక బిడ్డ భద్రతకు ప్రమాదం అనుకున్నప్పుడు అబార్షన్‌ వైపు మొగ్గు చూపడం సహజమే. కానీ ఈ విషయంలో వేర్వేరు దేశాలలో చట్టాలు విభిన్నంగా ఉంటున్నాయి. కొన్ని దేశాలు ఎప్పుడైనా గర్భస్రావానికి అనుమతిస్తుంటే మరికొన్ని మాత్రం తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్నా సరే అబార్షన్‌కు ససేమిరా అంటున్నాయి. ఇంతకీ అబార్షన్‌ హక్కుల విషయమై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంది Ipsos అనే సంస్థ. ఇందుకోసం 25 దేశాలలో దాదాపు 18 వేల మంది ప్రజల అభిప్రాయాలని సేకరించింది. వాటి ఆధారంగా రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు ఇవి

  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఏడుగురు (63%) అబార్షన్‌ చట్టబద్ధం కావాలని కోరుకుంటున్నారు. ఓ నాలుగో వంతు (24%) ఇందుకు వ్యతిరేకంగా ఉంటే, మిగిలిన 13% మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నామని చెప్పారు.
  • మన దేశం నుంచి ఈ సర్వేలో పాల్గొన్న 500 మందిలో 63 శాతం అబార్షన్‌ హక్కు వైపు మొగ్గు చూపారు. వారిలో మూడో వంతు మంది, మహిళలకు ఎప్పుడైనా అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉండాలని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం (28%), అత్యాచారం లాంటి అరుదైన సందర్భాలలోనే ఎప్పుడైనా అబార్షన్‌ చేయించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు.
  • నిజానికి మన దేశంలో అబార్షన్‌ చట్టబద్ధమే. ఇందుకోసం ‘మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ’ అనే చట్టం అందుబాటులో ఉంది. తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదల, ఆర్థిక పరిస్థితులు లాంటి అంశాల నేపథ్యంలో అబార్షన్‌ చేయించుకోవచ్చు. కానీ ఆ నిర్ణయాన్ని గర్భం దాల్చిన 20 వారాలలోపే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువును 24 వారాలకు పెంచుతూ రూపొందించిన బిల్లు ఇంకా రాజ్యసభ ఆమోదం పొందలేదు.
  • స్వీడన్‌, బెల్జియం, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ లాంటి పురోగామి దేశాలలో 80 శాతానికి పైగా ప్రజలు అబార్షన్‌ హక్కు వైపు మొగ్గు చూపడం ఆశ్చర్యకరం. సంప్రదాయాలను కఠినంగా ఆచరించే మలేషియాలో నాలుగో వంతు మాత్రమే అబార్షన్‌కు అనుకూలంగా ఓటు వేశారు.
  • అబార్షన్‌ను చట్టబద్ధం చేయడం సంగతి అలా ఉంచితే, ఆ క్రమంలో ఉన్న సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లింగ వివక్ష ఎక్కువగా ఉన్న మన దేశంలో, అబార్షన్లను అందుకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం లేకపోలేదు. అలాగని మరీ కఠినంగా ఉంటే అది అసురక్షిత పద్ధతిలో గర్భస్రావాలకు దారితీయవచ్చు. ఇప్పటికే మన దేశంలోని గర్భిణులలో ఎనిమిది శాతం మరణాలకు కారణం అసురక్షిత గర్భస్రావమే! కాబట్టి, ప్రభుత్వమే దీని మీద ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.