గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 25, 2020 , 23:37:57

నందిత నినాదం

నందిత నినాదం

రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. దానికి అందరూ కౌంటర్‌ వెయ్యాలనుకుంటారు. లేదా ఏదైనా చెప్పాలని భావిస్తారు. కానీ దాన్ని ఎలా ప్రజెంట్‌ చేయాలో తెలియదు. దాన్నే యోగ నందిత అండ్‌ టీమ్‌ ‘ది తెలుగు పిల్ల’ పేరుతో చేస్తున్నది. 

క్రికెట్‌ గ్రౌండ్‌లో క్రీడాకారులను ఉత్సాహపరుచడానికి.. ప్లకార్డుల మీద వారికొక మెసేజ్‌ని రాసి ఉత్సాహపరుస్తాం.   ఏదైనా నచ్చకపోతే.. మనం మెచ్చకపోతే.. సినిమాల్లో సీన్‌ల ఫొటోలు పెట్టి మీమ్‌లు చేయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌.. ఈ ట్రెండ్‌ని.. ఆ మెసేజ్‌ని ఒక్కటి చేసి చూపిస్తున్నది యోగ నందిత.. వీటిని ఆన్‌లైన్‌లో పెట్టి ఫాలోవర్లను పెంచుకుంటున్నది..  మనం కొత్తగా చేయాలే కానీ.. జనాల నుంచి ఆదరణ ఉంటుందనేది ఆమె విషయంలో నిరూపితమైంది.. ఆ ట్రెండ్‌ సెట్టర్‌ పరిచయమే ఈ కథనం.. 

కరోనా కాలంలో మానవత్వం కరువైంది. కొన్నిచోట్ల మరింత ప్రేమ కురిపించారు. అయితే మొదటిరకం కోసం.. ‘మనుషులను ప్రేమించు డూడ్‌.. 

ముట్టుకోకు అంతే’ అని అనాలనిపించింది కదా!

*  *  *

ఏ పరీక్ష ఫలితాలు వచ్చినా.. ‘నా రిజల్ట్‌ మీకెందుకు అంకుల్‌' అని అనాలిపించిస్తుంటుంది చాలామందికి. 

*  *  *

ప్రేమించిన వాళ్లు దూరంగా ఉన్నప్పుడు ఆ వేదన చెప్పరానిది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ 

‘ప్రియతమా.. నీవచట కుశలమా?’ అంటూ పాడుకుంటారు..

ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక సంఘటనలు ఎదురవుతాయి. అందరూ బయటకు చెప్పలేరు. కొందరు చెప్పుకోవచ్చు. చెప్పలేని భావాలను కూడా భావుకతతో చెప్పడం వల్ల చాలామందికి చేరువవుతుందని నమ్మింది యోగ నందిత. ఆమెతో పాటు టీమ్‌ కలిసి దీనిపై పనిచేస్తున్నది. మీమ్‌లను కొత్త రకంగా చేస్తూ.. సరికొత్తగా సోషల్‌మీడియాని ఊపేస్తున్నది. 

‘తెలుగు పిల్ల’ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియచేస్తున్నది. 

క్రియేటివ్‌గా చేయడం: యోగ నందిత స్వస్థలం కడప. కానీ మూడవ తరగతిలోనే కుటుంబం హైదరాబాద్‌కి చేరుకుంది. చిన్నప్పటి నుంచి చాలా బొద్దుగా, ముద్దుగా ఉండేది. ఆమెది చాలా క్రియేటివ్‌ మైండ్‌. కానీ ఎందుకో ఒక ఆత్మనూన్యత ఆమెను వెంటాడేది. తన లావు తనకి చాలా అడ్డంకిగా అనిపించేది. మానసికంగా కూడా చాలా కుంగిపోయింది. దీంతో అన్నింటి మీదా ఆసక్తి తగ్గిపోయింది. వెనుక బెంచీకి పరిమితం కావాలనే ఆలోచనతోనే బాల్యం గడిచిపోయింది. కాలేజ్‌ లెవల్‌కి వచ్చేసరికి సంవత్సరంలో ప్రశాంతంగా తిన్న రోజులు కూడా తక్కువే. దీనికి ఎక్కడో ఒక అంతిమగీతం పాడాలనుకుంది. తనకు తాను ప్రేరణగా నిలువాలనుకున్నది. అందుకోసం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో జాయినయింది. నిఫ్ట్‌ తన ఆలోచనలకు కొత్త రూపం ఇచ్చింది. అక్కడ తనలో ఉన్న భావనలు కూడా మెల్లమెల్లగా దూరం అవ్వడం ప్రారంభమయ్యాయి. 

ఫ్రెండ్స్‌ ద్వారా: ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది నందిత. ఆ ప్రపంచం తన ఆలోచనలను మార్చేసింది. అదే సమయంలో తన ఫ్రెండ్స్‌ డ్యూడ్‌ విత్‌ సైన్‌ అనే ఒక పేజీని ఫాలో అవుతుండేవాళ్లు. తాను కూడా దానికి ఫాలోవర్‌గా మారింది. యూనిక్‌గా ఉండే ఆ పోస్టులు తనలో కొత్త ఆలోచనను రేకెత్తించాయి. అప్పుడే వెంకట సునీల్‌ కోసూరి అనే ఫ్రెండ్‌ తనతో ఒక ఐడియాను పంచుకున్నాడు. అతడు హస్లిన్‌ మీడియా కో-ఫౌండర్‌. ఆలోచన నచ్చింది.. కంటెంట్‌ రైటర్‌గా పని చేసేందుకు సిద్ధమని కూడా మాటిచ్చింది. అప్పుడే మిగతా టీమ్‌లో వాళ్లు తెలుగు పిల్ల కాన్సెప్ట్‌ గురించి అనుకున్నారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తేవాలంటే తెలుగమ్మాయితో ఈ మీమ్స్‌ చేయాలని భావించారు. దానికి యోగ నందితనే కరెక్ట్‌ అని అందరికీ అనిపించింది. ముందు చేయనని చెప్పింది. కానీ మళ్లీ తానే ఆలోచించి ప్రాజెక్టులోకి అడుగుపెడుతున్నట్లు చెప్పింది. 

సరికొత్తగా: రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. దానికి అందరూ కౌంటర్‌ వెయ్యాలనుకుంటారు. లేదా ఏదైనా చెప్పాలని భావిస్తారు. కానీ దాన్ని ఎలా ప్రజెంట్‌ చేయాలో తెలియదు. దాన్నే యోగ నందిత అండ్‌ టీమ్‌ చేస్తున్నది. వారి ఆలోచనలకు ప్రతిరూపమే ఇన్‌స్టాలో ఉన్న ‘ది తెలుగు పిల్ల’. దీనికి సంబంధించిన కంటెంట్‌ నందితో పాటు.. సునీల్‌, ముజామిల్‌, విద్య ఎక్స్‌ఆర్‌జే గైడ్‌ చేస్తుంటుంది. వీరంతా చాటింగ్‌లో కలుసుకొని రాత్రి ఒక కొటేషన్‌ ఫైనల్‌ అవుతుంది. ఉదయం కల్లా నందిత దాన్ని బోర్డ్‌ మీద రాసి ఫొటో అప్‌లోడ్‌ చేస్తుంటుంది. ఒకవేళ ఆరోజు ప్రత్యేకమైన సంఘటనలు లేకపోతే జనరల్‌ కొటేషన్స్‌, పాట లిరిక్స్‌ పెడుతుంటారు. ఈ నినాదాలు, మీమ్స్‌కి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్‌ అయిపోయారు. పదమూడు వేలకు పైగా ఈ పేజీకి ఫాలోవర్లు ఉన్నారు. 

చిన్నప్పటి నుంచి కొత్తగా చేయాలనుకునేదాన్ని. ఈ ప్రాజెక్ట్‌ అనుకున్నప్పుడు కూడా ఫ్రెండ్స్‌, బంధువులు ఏమంటారో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు వస్తున్న పొగడ్తలు నాలో ఎంతో మార్పును తీసుకొచ్చాయి. నన్ను నేను చూసుకొని బాధపడ్డ దాన్ని.. ఈరోజు చాలా గర్వపడుతున్నా. ఫ్యాషన్‌ ప్రపంచంలో స్టైలిస్ట్‌ కావాలన్నది నా కల. ఇక తెలుగు పిల్ల విషయానికొస్తే.. ఈ కొటేషన్లు కూడా తెలుగులో రాయొచ్చ నిచాలామంది అంటున్నారు. కానీ అందరికీ తెలుగు అర్థం కాదు.. ఎక్కువ మందిని రీచ్‌ అవ్వడానికి తెంగ్లీష్‌.. 

అదేనండీ.. తెలుగు, ఇంగ్లిష్‌ని కలిపి రాస్తున్నాం. కేవలం ఇలా ప్లకార్డ్‌లనే కాకుండా వీడియోలు, క్రియేటివ్‌ కంటెంట్‌తో తెలుగు పిల్లను మరింత మందికి చేరువ చేయాలన్నది మా ఆకాంక్ష. అందుకోసం యూట్యూబ్‌ చానెల్‌ని కూడా మొదలుపెట్టాం. చాలామంది ఈ కార్డ్‌బోర్డ్‌లు ఎక్కడ దొరుకుతాయనే ప్రశ్న వేస్తున్నారు. దానికి సమాధానంగా ఒక వీడియో చేశాం. త్వరలోనే ఆ ప్రశ్నకు అందరికీ సమాధానం దొరుకుతుంది’ అంటున్నది యోగ నందిత. logo