శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 25, 2020 , 23:28:02

జిత్తులమారి నక్క

జిత్తులమారి నక్క

పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేది.  ఆ అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉన్నాయి.  ఏ తోటలోనైనా మక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికి ఇచ్చేది. కాకికి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచిచెడులు మరొకరికి చెప్పుకొంటూ స్నేహం సాగించాయి.  ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూసి, ఎలాగైనా దానిని  తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది.  లేడి వద్దకు వెళ్లి ‘నమస్కారం లేడి బావగారూ! నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ  జంతువుల బాధపడలేక ఇటువచ్చాను. వచ్చీ రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకు ఈ చోటు బాగా తెలుసుకదా! ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకొంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం’ అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది.లేడి ఆ నక్క మాటలు నమ్మింది. 

‘ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం’ అని భావించింది. నక్కతో స్నేహం చేయాలని ‘నక్క బావా? నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాం. నీవు కూడా మాతోపాటు ఉందువుగాని మా యింటికి వెళదాం రా!’ అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి, దానికి నక్క విషయమంతా చెప్పింది. కాకి,  జింకతో ‘మిత్రమా! మంచి చెడు ఆలోచించకుండా, కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చేయరాదు. ఇది జిత్తులమారి నక్క. పైగా మాంసాహారి కూడా, దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారితో స్నేహం మంచిది కాదు. వారివారి గుణగణాలు తెలియక ఎవ్వరినిబడితే వారిని దరికి చేరనిస్తే నష్టమే అని చెప్పింది. బాగా ఆలోచించిన లేడి నక్కను తిరిగి వెనక్కి పంపింది.