మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 24, 2020 , 22:46:46

ఆ పాత ఘుమఘుమలు... తాజాగా!

ఆ పాత ఘుమఘుమలు... తాజాగా!

‘మా అమ్మ పోపు పెడితే.. వీధి వీధంతా గుప్పుమనేది’.. ఇది ఒకప్పటి మాట! ‘రెండంటే రెండు లవంగాలు వేస్తే.. సాంబారు ఘాటుకు జలుబు తోక ముడిచేది’.. ఇదీ అప్పటి మాటే!!ఇప్పుడు పోపులో ఇంగువా దట్టించినా.. సాంబారులో దాల్చినచెక్క గుప్పించినా... వంటింటి ఘుమఘుమలు పక్కింటి వరకు కాదు కదా... ముందు గదికి కూడా చేరడం లేదు. ఈ లోపాన్నే.. తన వ్యాపార సూత్రంగా ఎంచుకుందామె! ఇప్పుడామె తయారుచేసిన సేంద్రియ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు.. ఖండంతరాలు దాటి ఘాటెక్కిస్తున్నాయ్‌. 


బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల స్నేహ సిరివార భోజన ప్రియురాలు.అయితే, చిన్నప్పుడు అమ్మమ్మ వండితే ఉన్న రుచి.. ఇప్పుడు తను ఎంత శ్రద్ధగా చేసినా రావడం లేదు. వంటల పుస్తకాలు ముందేసుకొని.. కొలతలు తీసుకొని దినుసులు వేసినా.. సాంబారు కుదరడం లేదు. రకరకాల మసాలా పొడులు వాడినా.. మునుపటి రుచి నాలుకకు తాకలేదు. బాగా ఆలోచిస్తే.. వండటంలో తేడా లేకున్నా... వంటకు ఉపయోగించే మసాలాల్లో లోపం ఉందనిపించింది. ఇక లాభం లేదనుకుంది.. తానే మసాలా పొడులు ఎందుకు తయారు చేయకూడదని భావించింది.

కొలువు వదులుకొని..

కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చదివిన స్నేహ..  ఓ కార్పొరేట్‌ కంపెనీలో ప్రోగ్రామర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టింది. కానీ, ఆ కొలువు తనకు అంతగా నప్పదనుకుంది. ఇంతలో తన ఆలోచనలన్నీ మసాలాలు, సాంబార్లు, సుగంధ ద్రవ్యాల చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. అలా 2013లో ‘సాంబార్‌ స్టోరీస్‌' అనే సంస్థను ప్రారంభించింది. సేంద్రియ, ప్రకృతిసాగు ద్వారా పండించిన సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు సేకరించి తన అభిరుచికి తగ్గట్టుగా పొడులు తయారు చేయడం మొదలుపెట్టింది. పాత తరం పెద్దవారిని కలిసి.. ఏ వంటలో ఎలాంటి మసాలా వేయాలి, వాటిని ఎలా తయారు చేయాలి, ఏఏ దినుసులు ఏ మోతాదులో ఉపయోగించాలి తదితర విషయాలన్నీ సేకరించి.. తన ఉత్పత్తులను తీసుకొచ్చింది. వీటి విక్రయానికి ఆన్‌లైన్‌ను అడ్డాగా ఎంచుకుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కాఫీ గింజలతో కాఫీ పొడిని తయారు చేసి దాన్నీ అందుబాటులో ఉంచింది.

దేశదేశాలకు ఎగుమతి

ఒంటరిగా మొదలుపెట్టిన ఆమె.. ఇప్పుడు పలువురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. దేశదేశాలకూ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఒక్కసారి ఈ మసాలాలు వాడిన వారంతా.. ఆ రుచికి ఫిదా అయిపోతున్నారు. 


logo