బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Aug 23, 2020 , 23:24:44

మంచి పని

మంచి పని

రామచంద్రపురం అనే ఊరిలో ఓ ధనవంతుడు ఉండేవాడు.  అతను ఓ గుడిని కట్టించాడు.  ఓ పూజారిని నియమించాలి అనుకున్నాడు. దేవాలయం ఖర్చుల కోసం పొలం,  తోటలు మాన్యంగా ఇచ్చాడు. పేదా, సాదా, బీద,  సాధువులు,  సన్యాసులు కష్టపడి  గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆ ధనవంతుడు దేవాలయ ఆస్తి పాస్తుల్ని భద్రంగా కాపాడుతూ, గుడి వ్యవహారాలను చక్కదిద్దుకునే ఓ మంచి మనిషి కోసం  ఎదురు చూడసాగాడు. చాలామంది ఆ ధనికున్ని    పిచ్చివాడిగా చూశారు.  కానీ, ఆ ధనవంతుడు ఎవరి మాటలనూ లెక్క చేసేవాడు కాదు.  గుడి తలుపులు తెరవగానే, ప్రజలు దేవున్ని  దర్శించుకునేందుకు వచ్చేవారు.  గుడికి వచ్చి పోయేవారిని ఆ ధనవంతుడు  జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు.  ఒక రోజు ఓ మనిషి గుడికి వచ్చాడు.  మాసిన, చినిగిన బట్టల్లో  వున్నాడతను. అతను భగవంతున్ని దర్శించి, వెళ్లిపోయేటప్పుడు, ఆ ధనికుడు  అతన్ని పిలిచాడు.  ‘మీరు ఈ దేవాలయం వ్యవహారాలను నిర్వహించే పని చేపడతారా?’ అని అడిగాడు. ఆ వ్యక్తి నివ్వెరపోయాడు. ‘నేను ఎక్కువగా చదువుకోలేదు. ఇంత పెద్ద దేవాలయం పనులు ఎలా నిర్వహించగలను?’ అని బదులిచ్చాడు.  ‘నాకు పెద్ద పండితులతో పనిలేదు.  మంచిమనిషి చేతికి ఈ గుడిపనులు చేసే భాద్యతలను అప్పగించాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.  అప్పుడా మనిషి ‘ఇంతమందిలో మీరు నన్నే మంచిమనిషిగా ఎలా భావించారు?’ అని అడిగాడు.  ‘గుడికి వచ్చే దారిలో ఓ ఇటుక బెడ్డ పాతుకు పోయింది. దాని మొన బయటకి కనపడుతున్నది. అది భక్తుల కాలికి తగులుతూ ఉంది. కానీ దాన్ని ఎవరూ తీయడం లేదు.  నేను చాలా రోజులనుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఇటుక బెడ్డ  మీ కాలికి తగులలేదు. అయినా మీరు దాన్ని గమనించి, తొలగించారు.’ అని ధనవంతుడు జవాబిచ్చాడు.  దానికి ఆ వ్యక్తి తలూపాడు. ధనవంతుడు మళ్లీ..  ‘దారికి అడ్డమయ్యే రాళ్ళురప్పలు, ఇటుకలు,  తొలగించడం ప్రతిమనిషి కర్తవ్యం తన కర్తవ్యాన్ని తెలుసుకుని, నడుచుకొనే మనుషులే మంచివాళ్ళు’  అన్నాడు. ఆ వ్యక్తికి దేవాలయ వ్యవహారాలు నిర్వహించే ఉద్యోగం దొరికింది. అతను గుడి పనులు చక్కగా చూసుకోసాగడు.

నీతి: మంచివాడికి మంచే జరుగుతుంది.logo