సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Aug 20, 2020 , 22:29:10

మొక్కవోని గణ దీక్ష

మొక్కవోని గణ దీక్ష

ఒకే ఒక్క విత్తనానికి ఈ సృష్టిని మళ్లీ ఆరంభించగల సత్తా ఉంది. మనిషిలో ఆత్మ ఉందో లేదో కానీ, ఈ సృష్టికి ఆత్మ మాత్రం విత్తనంలోనే ఉంది. అందుకే ప్రకృతి విత్తనాలను వెదజల్లేందుకు రకరకాల ఉపాయాలను కనిపెట్టింది. గాలిలో తేలుతూ వెళ్లే జిల్లేడు విత్తనాల దగ్గర నుంచీ, పక్షుల విసర్జితాల నుంచి మొలిచే రావి చెట్ల వరకు... రకరకాలుగా వృక్షజాతికి సాయం చేస్తోంది. మరి వాటి మీద ఆధారపడుతున్న మనిషి తనవంతు సాయం చేయాలి కదా! అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’అంటూ తనకి తాను గుర్తుచేసుకుంటూ మొక్కలను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనూ పర్యావరణ హితంగా ఉండే పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నాడు.  అలాంటి కొన్ని విశేషాలు...

దైవం వృక్ష రూపేణ 


ప్రకృతి ఆరాధనే ఉద్దేశంగా జరగాల్సిన ఈ ఉత్సవాల కోసం క్వింటాళ్ల కొద్దీ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ని ఉపయోగించడం బాధాకరం. అందుకే మట్టి వినాయకులు విశిష్టతను చాటేందుకు కొన్నేళ్ల నుంచి ‘విత్తన వినాయకుల’ను రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని తొట్టిలోనే ఉంచి నిమజ్జనం చేస్తే, మట్టి కరిగి లోపల ఉంచిన విత్తనం మొలకెత్తుతుంది. భగవంతునికీ, భక్తునికీ మధ్య అనుబంధంగా ఓ కొత్త చిగురు పలకరిస్తుంది. ఓ చిన్న ప్రయోగంగా మొదలైన ‘సీడ్‌ గణేష’ ఇప్పుడో పర్యావరణ ఉద్యమం స్థాయికి చేరుకుంది. ఒక్క హైదరాబాద్‌లోనే పదుల కొద్దీ కంపెనీలు వీటిని సరఫరా చేస్తున్నాయి.

దేశమంటే మట్టే కాదు


రిపబ్లిక్‌ డే, స్వాతంత్ర దినోత్సవం... లాంటి సందర్భాల్లో దేశమంతా మూడు రంగుల్లో మెరిసిపోతుంది. కానీ ఆ మర్నాడు, త్రివర్ణ పతాకాలని ఎడాపెడా పారేస్తుంటారు. వాటిలో విత్తనాలు ఉంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ సీడ్‌ ఫ్లాగ్స్‌కి మార్గం చూపింది. బెంగళూరుకు చెందిన ‘సీడ్‌ పేపర్‌ ఇండియా’ వీటిని తయారుచేస్తోంది. ఈ కాగితం లోపల ఉండే తులసి, పొద్దుతిరుగుడు, టేకు, మందార, టమాట లాంటి విత్తనాలు.. నేలలోకి చేరినప్పుడు మొలకెత్తుతాయి. ఈ కాగితాలకి రంగులు వేసేందుకు కూడా పసుపు, పాలకూర లాంటి సహజమైన రంగులనే వాడుతున్నారు.

నారతోనే నీరుపోసి


నర్సరీలకి వెళ్లి ఎంతో ముచ్చటపడి, నచ్చిన మొక్కను తెచ్చుకుంటాం. కానీ వాటి కింద ఉండే ప్లాస్టిక్‌ సంచిని ఏం చేయాలి. నేలలో చివికిపోతుందిలే అని మొక్కతో పాటే వదిలేస్తాం. మొక్క బతికేది దశాబ్దాలే.. కానీ ప్లాస్టిక్‌ వేల ఏళ్ల చిరాయువు కదా! దీనికి ఓ ఉపాయాన్ని కనుక్కోవాలనుకున్నారు సి. మీనాక్షి అనే కలెక్టరమ్మ (కేరళ). ప్రభుత్వం తరఫున పంచే లక్షలాది మొక్కల కోసం.. కొబ్బరి పీచుతో చేసిన కుండీలను ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు ఇలా 50 లక్షల మొక్కలను పంచిపెట్టారు. కొబ్బరిపీచు తడిని పీల్చుకుంటుంది, మొక్కని పట్టి ఉంచుతుంది. నేలలో పాతిపెట్టగానే వేళ్లకి దారినిస్తుంది. అంతకంటే ఏం కావాలి. 

పాతిపెడితే పలకరిస్తాయి


కాఫీ, టీలు తాగినంత తేలికగా వాటి కప్పులను విసిరిపారేస్తాం. ఏదో ఇప్పుడు కాస్త అవగాహన వస్తోంది కాబట్టి, పేపర్‌ కప్పుల వైపు మొగ్గుచూపుతున్నాం. కానీ అక్కడితో ఆగిపోతే ఎలా అనుకుంటున్నాయి కొన్ని సంస్థలు. వాటిలో గింజలను దాస్తున్నాయి. ఈ కప్పులను నేలలో పాతిపెడితే, కాగితం చివికిపోయి... మొక్కలు పలకరిస్తాయి. మన దేశంలో తక్కువ కానీ విదేశాల్లో ఇలా లక్షలాది మొక్కలను నాటుతున్నారు. కాఫీ తాగాక కప్పును పారేయకుండా... ఓ చిన్న గుంత తీసి అందులో పెట్టమని కస్టమర్లని ప్రోత్సహిస్తున్నారు.

తలరాతలు మార్చే పెన్ను


పెన్నులో ఇంకు అయిపోగానే.. పదే పదే దాన్ని నింపుకొనే కాలం కాదిది. డిస్పోజబుల్‌ యుగం మనది. చాలామంది కాస్త ఖరీదైన పెన్నులను కూడా రీఫిల్‌ అయిపోగానే పారేస్తుంటారు. అది ఈ నేల మీద ఎంతెత్తున పేరుకుని పోయి ఉంటాయో. ఇందుకు విరుగుడే పేపర్‌ పెన్‌. ఈమధ్య కాలంలో చాలా కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ, కేరళకు చెందిన లక్ష్మీ మీనన్‌ రెండేళ్ల క్రితమే ఇలాంటి పెన్నులతో వార్తల్లోకి ఎక్కారు. ఇందులో ఒక్క రీఫిల్‌ మాత్రమే ప్లాస్టిక్‌. చుట్టూ ఉన్న భాగమంతా రీసైకిల్డ్‌ కాగితమే. ఈ పెన్ను రాయడం పూర్తవగానే దాన్ని కాస్త ఏటవాలుగా తొట్టిలో ఉంచి నీళ్లు పోస్తుంటే చాలు, అందులో ఉన్న విత్తనం మొలకెత్తుతుంది.

అడవి కోసం


సీడ్‌ బాల్స్‌ గురించి కొత్తగా వింటున్నాం కానీ, వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు నైలు పరివాహక ప్రాంతంలో దీన్ని ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. దాన్ని మళ్లీ జపాన్‌ పర్యావరణవేత్త ఫుకువోకా ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనికోసం మనకు అందుబాటలో ఉండే నిమ్మ, ఆవాలు, మామాడి టెంక లాంటి విత్తనాలను కడిగి నీడపట్టున ఆరపెట్టాలి. వాటిని ఎర్రమట్టి, ఆవుపేడ, కంపోస్ట్‌ లాంటి పదార్థాలతో ఉండలుగా చుట్టాలి. ఖాళీగా ఉన్న నేల మీద గుంటల్లో నిలబెట్టాలి. వర్షాకాలంలో కనక ఇలా చేస్తే... మన కళ్ల ముందే ఓ చెట్టు ఊపిరిపోసుకోవడాన్ని గమనించవచ్చు. ప్రపంచంలో కొన్ని లక్షల ఎకరాల భూములని ఈ పద్ధతిలోనే, అటవీ ప్రాంతంగా మార్చేస్తున్నారు. ఈ పద్ధతిని సీడ్‌ బాంబింగ్‌ అని కూడా పిలుస్తారు.


logo