ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 19, 2020 , 23:01:44

మొక్కై మొలిచే.. గణపతికి దండం

మొక్కై మొలిచే.. గణపతికి దండం

పోయినేడాది వరకు వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయంటే చాలు.. ఎటు చూసినా వినాయక మండపాలే. వీధులన్నీ ఎక్కడికక్కడ బ్లాక్‌ అయిపోయేవి. గణేశుని ప్రార్థనల మాట దేవుడెరుగు.. సినిమా పాటల హోరు కూడా ఉండేది. ఇప్పుడు కొవిడ్‌ వల్ల పరిస్థితులన్నీ మారిపోయాయి.ఆ ధ్వని కాలుష్యం లేదు. అన్నింటికీ మించి ప్రకృతికి దగ్గరగా నడిచే మార్గాలు ఏర్పడ్డాయి. ఒకవైపు హరిత హారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మరోవైపు ప్రకృతి స్వరూపమైన భగవంతుని ఆరాధన.. వెరసి పండుగ, ప్రకృతి కలిసిపోతున్న మహత్తర సందర్భమిది. రాష్ట్ర ప్రభుత్వం మట్టి వినాయకులనే పూజించాలని ఎప్పటి నుంచో చెబుతున్నది. ఇప్పుడు అదే మట్టి గణపతి.. ఆకుపచ్చని తెలంగాణ వైపు నడిపించేలా ప్రోత్సహిస్తున్నది. విత్తన గణపతి రూపంలో వినాయకుడిని పూజించాలని పిలుపునిస్తున్నది. 

జీవుడు.. దేవుడు... ప్రకృతి... అవినాభావ సంబంధం కలిగివుంటాయి. సర్వాంతర్యామి అయిన భగవంతుడు అన్నింటిలోనూ, అంతటా వ్యాపించి ఉంటాడు. జీవుడిలో సూక్ష్మ దశలో కనబడకుండా ఉంటే, కనిపించే ప్రకృతిలో స్థూల దశలో ఉంటాడు. అందుకే ప్రకృతిని ప్రేమిస్తే భగవంతుణ్ణి ప్రేమించినట్టే. ప్రకృతిని కాపాడుకుంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్టే. అందుకేనేమో.. మన పండుగలన్నీ ప్రకృతితో అనుసంధానించి ఉంటాయి. దైవపూజ.. ప్రకృతి ఆరాధన కలిసిపోయి ఉంటాయి. వినాయక చవితి కూడా అంతే. వినాయక వ్రతంలో పలు రకాల పత్రాలు, పువ్వులు, ఆకులు, కాయలు.. ఇలా ఎన్నో ఆయనకు సమర్పిస్తాం. గణనాథుని పూజే ప్రకృతి ఆరాధనగా వ్యక్తమవుతుంది. కానీ, ఆధునికత వైపు పయనిస్తున్న కొద్దీ మనం ప్రకృతికి దూరంగా వెళ్తున్నాం. ప్రకృతి ఆరాధనకు బదులుగా ప్రకృతిని నాశనం చేసే వైపు పరిగెడుతున్నాం. ఇప్పుడు మళ్లీ వెనక్కి నడవాల్సిన పరిస్థితి మనకు ప్రకృతే కల్పిస్తున్నది. కొవిడ్‌ 19 మహమ్మారి రూపంలో మనల్ని హెచ్చరిస్తున్నది. అందుకే ఈ సారి వినాయక చవితికి పర్యావరణహిత గణేశ విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. 

రంగురంగుల వినాయక విగ్రహాలు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారైన గణేశులు మొన్నటి వరకూ మనల్ని ఆకర్షించాయి. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు వాటిలోని రసాయనాలు జలచరాలకు ప్రాణాపాయం కలిగిస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు ఎంత చెప్పినా మొన్నటి వరకూ  పట్టించుకోలేదు. కొందరు మాత్రం చైతన్యం పొంది మట్టి వినాయకులను పూజించడానికి పూనుకున్నారు. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవాలన్న చైతన్యం కలుగుతున్నది. అందుకే ఈసారి మట్టి వినాయకులను పూజించాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కృత్రిమ రంగులు, రసాయనాలు లేకుండా... ఒకవైపు పర్యావరణ హితం కలిగిస్తూనే మరోవైపు ప్రకృతి పరిరక్షణ కలిగించే వినాయకుల కోసం ఇప్పుడు మరో అడుగు పడింది. పూజలందుకున్న వినాయకుడు నిమజ్జనం చెందిన తరువాత మొక్కై మన ముంగిట్లో వెలిసే కార్యక్రమం ఊపందుకుంది. అదే విత్తన గణపతి. గత మూడేండ్లుగా ప్రచారంలో ఉన్న విత్తన గణపతికి ఇప్పుడు మరింత ప్రాచుర్యం దక్కింది. 

విత్తన గణపతి అంటే:

మట్టి గణపతే కాదు.. చాక్లెట్‌ గణపతి, తమలపాకుల గణపతి, చిరుధాన్యాల గణపతి, వివిధ రకాల ఆకులతో తయారుచేసిన గణపతి.. ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని విగ్రహాలివి. ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్న విత్తన గణపతి ప్రకృతికి మరింత మేలు చేసేది. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఆరోగ్యంగా తయారుచేసే విగ్రహాలివి. వినాయక చవితి వ్రతం ఆచరించిన భక్తులను అనుగ్రహించే గణపతి.. విత్తన వినాయక రూపంలో పూజలందుకుంటే మనకు మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించే ప్రకృతిమాతగా నిలుస్తాడు. మట్టి విగ్రహ రూపంలో పూజలందుకుని, ఆ తరువాత పర్యావరణాన్ని కాపాడే చెట్టుగా, మనకు ఆరోగ్యాన్నందించే కూరగాయల మొక్కలుగా.. వివిధ రకాలుగా మన ముంగిట వెలుస్తాడు. బంక మట్టితో తయారుచేసిన మట్టి వినాయకుడి విగ్రహంలో విత్తనాన్ని ఉంచుతారు. పూజలు అయిపోయిన తరువాత తొట్టిలో ఈ వినాయకుడ్ని నిమజ్జనం చేస్తే దానిలో ఉండే విత్తనం మొలకెత్తి మొక్కై, చట్టై మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. 

ఏ విత్తనాలు?:

విత్తన గణపతిని హైదరాబాద్‌లో దాదాపు 20కి పైగా సంస్థలు తయారుచేస్తున్నాయి. ఇందుకోసం వివిధ రకాల విత్తనాలను వాడుతున్నారు. ఎక్కువమంది కూరగాయల విత్తనాలను గణపతితో పాటు ఇస్తున్నారు. ఈ  గణపతి నిమజ్జనం తరువాత మనకు సేంద్రియ పద్ధతిలో కూరగాయల రూపంలో పోషకాహారాన్ని అందిస్తాడు. వేపలాంటి ఔషధ మొక్కల విత్తనాలతో కూడిన గణపతిని ఇంటి వాకిట్లో నిమజ్జనం చేసినా, ఏ ఖాళీ ప్రదేశంలో నిమజ్జనం చేసినా ఆరోగ్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. 

తులసి విత్తనం వాడవచ్చా? :

వేప లాగానే తులసి మొక్క కూడా ఔషధాల గని. తులసి ఆకులను జలుబు, దగ్గు లాంటి చాలా రకాల సమస్యలకు వాడుతారు. అందుకే విత్తన గణపతి కోసం తులసి విత్తనాలను కూడా కొందరు ఇస్తున్నారు. కానీ, తులసి విత్తనాలను గణపతి విగ్రహంలో పెట్టకూడదంటారు. మన పురాణాల ప్రకారం వినాయకుని పూజలో తులసి దళాలను, హారాన్ని వాడకూడదు. తన పూజలో వినియోగించకూడదని తులసికి వినాయకుడు శాపం ఇచ్చినట్టు ప్రతీతి. అందుకే తులసి కాకుండా ఏ చెట్టు విత్తనాలనైనా వాడవచ్చు. 

ఇదే కొనసాగిద్దాం:

ఇప్పుడు మొదలైన ప్రకృతి ఉద్యమం ఇదే ఊపుతో కొనసాగితే కొవిడ్‌ లాంటి మహమ్మారులు మళ్లీ దాడి చేయకుండా ఉంటాయి. అందుకే మళ్లీ వెనక్కి వెళదాం. ప్రతి పండగనూ ప్రకృతి ఆరాధనగా చేసుకుందాం. ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం. మన తరువాతి తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిద్దాం. ఆహారాన్నిచ్చే వర్షాలను పచ్చని చెట్ల ద్వారా ఆహ్వానిద్దాం.

ఆరోగ్య గణపతినే పూజిద్దాం!


అన్నం వల్ల జీవజాలం పుడుతుంది. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతున్నది. వర్షాలు సక్రమంగా రావాలంటే యజ్ఞం చేయాలి. ఇది సత్కర్మ ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడ యజ్ఞం అంటే కర్మ. మనం చేసే కర్మ ప్రకృతిని పరిరక్షించేదిగా ఉండాలి. అప్పుడే జీవానికి అవసరమయ్యే వనరులు సమకూరుతాయి. ప్రకృతి ప్రేమికుడైన కేసీఆర్‌ గారికి ఈ విషయం బాగా తెలుసు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను పెంచి, పర్యావరణ పరిరక్షణ కోసం ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని స్ఫూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వినాయక చవితి పూజలనే పర్యావరణ పరిరక్షణకు కేంద్రంగా చేసుకున్నారు. విత్తన గణపతి రూపంలో పర్యావరణ హిత గణేశ విగ్రహాలను ప్రచారం చేస్తున్నారు. 

స్వచ్ఛమైన గాలినిచ్చే వేప

మన సంస్కృతినీ, సామాజిక ఆరోగ్యాన్నీ మేళవించి ఈసారి వినాయక పూజలను నిర్వహించాలని పిలుపునిస్తున్నారు ఎంపీ సంతోష్‌ కుమార్‌. ఇందుకోసం ఆరోగ్య దాయిని అయిన వేప విత్తనంతో కూడిన గణేశ విగ్రహాలను పూజించమని ప్రచారం చేస్తున్నారు. ఈ గణేశ విగ్రహాలను నిమజ్జనం  చేసిన తరువాత వేప మొక్క మొలకెత్తుతుంది. ఈ విత్తనాన్ని నాటిన 5 నుంచి 7 రోజుల్లో మొలక వస్తుంది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ విత్తన వినాయకుల పంపిణీని ప్రోత్సహిస్తున్నారు. ప్రాచీన కాలం నుంచీ మన వైద్య విధానాల్లో వేపకు అత్యంత ప్రాధాన్యం ఉంది. వేపలో యాంటీబయాటిక్‌ లక్షణాలు ఉన్నాయి. అలర్జీల నుంచి ఇన్‌ఫెక్షన్ల దాకా నివారించగల అనేక ఔషధ గుణాలున్నాయి. ఇంట్లో ఆరుబయట వేప చెట్టు ఉంటే స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరికినట్టే. వేప చెట్టు గాలి పీలిస్తే కూడా ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుంది. ఇన్ని ఔషధ గుణాలున్నాయి కాబట్టే ప్రతి ఇంటా ఒక వేప చెట్టు ఉండాలంటారు పెద్దలు. 

మహమ్మారులను తరిమికొట్టాలంటే..

“వాతావరణంలో ఆరోగ్యకరమైన మార్పులు రావాలంటే పెద్ద పెద్ద చెట్లను పెంచడమే పరిష్కారం. కాలుష్యం నుంచి భూమిని రక్షించే మార్గం. కొవిడ్‌ 19 లాంటి మహమ్మారి వ్యాధులకు చెక్‌ పెట్టగల సాధనం. కరోనా లాంటి విష క్రిములు పుట్టుకు రాకుండా, పర్యావరణం పాడుకాకుండా నివారించగల సత్తా ప్రకృతి మాతలైన వృక్షాలకే ఉంది. ఇప్పుడు విత్తన గణపతి రూపంలో వేప మొక్కను నాటితే మన తరువాతి తరాలకు కాలుష్యం లేని గాలినీ, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలం. అందుకే దీన్ని ప్రతి ఇంటి ఆవరణలో పెంచితే మంచిది. ప్రకృతి పచ్చగా ఉంటేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకు మన పండగల ద్వారానే తొలి అడుగు వేద్దాం. పర్యావరణహితంగా ఈ సారి వినాయకుడిని ఆరోగ్య గణపతిగా పూజిద్దాం” అని పిలుపునిస్తున్నారాయన.  

 ఎలా  చేస్తారంటే..

2017లో మేము 500 విత్తన గణపతి విగ్రహాలను తయారుచేశాం. ఈ విత్తనాలు మొలకెత్తుతాయా లేదా, కచ్చితంగా మొక్క రావాలంటే ఏం చేయాలి... అని పరిశోధనలు చేశాం. ఇప్పుడు ప్రతి విత్తన వినాయకుడి నుంచి ఒక మొక్క తప్పనిసరిగా వచ్చేలా తయారుచేశాం. చాలామంది మట్టి విగ్రహం, విత్తనం, తొట్టి విడివిడిగా ఇస్తారు. మేము విగ్రహంలోనే విత్తనం పెట్టి ఇస్తున్నాం. ఇది స్వచ్ఛమైన బంకమట్టితో తయారుచేసింది. నీళ్లు పోసిన వెంటనే కరిగిపోతుంది. విగ్రహంలోని మట్టి మొత్తం కరిగేవరకూ నీళ్లు పోస్తూనే ఉండాలి. సాధారణంగా ఒక రోజంతా నీళ్లు పోస్తుంటే కరిగిపోతుంది. ఆ తరువాత రెండుమూడు రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. ఈ విత్తన గణపతితో పాటు వర్జిన్‌ ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఆకర్షణీయమైన తొట్టి కూడా ఇస్తాం. ఈ ప్లాస్టిక్‌ను రీసైకిల్‌  చేయవచ్చు. హానికరం కాదు. ఈ తొట్టిలో కూడా కొన్ని విత్తనాలను పెట్టి ఇస్తాం. ఇప్పుడు బెండకాయ, టమాట, మిరపకాయ లాంటి కూరగాయల విత్తనాలను పెట్టి ఇస్తున్నాం. అప్పుడు నేను మొదలుపెట్టింది ఇప్పుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ గారి ద్వారా ఎక్కువ మందికి చేరడం చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర ఈ విత్తన వినాయకులు రూ.299, రూ.399, రూ.699 ధరల్లో దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం.  -గణేశ్‌, ప్లాన్‌ ఫర్‌ ఎ ప్లాంట్‌logo