ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 00:43:27

బాందినీతో బంధం బలపడేలా!

బాందినీతో  బంధం బలపడేలా!

పువ్వులు.. పండ్లు.. జంతువులు.. ఇలా రకరకాల డిజైన్లు చీరల మీద ఉన్నా.. మగువల మనసు ఇంకా దేని మీదకో లాగుతుంటుంది.. అది గమనించో ఏమో... ఆకాశంలోని చుక్కలను తీసుకొచ్చి.. చీర మీద పరిచి మరిన్ని అందాలను అద్దారు.. అదే బాందినీ చీర..ఈ చీరతో బంధం ఈనాటిది కాదు..ఈ చీరకు ఎంతో చరిత్ర ఉంది. ఇన్ని వన్నెలున్న ఈ బాందినీ చీరగానే కాదు.. డ్రెస్‌మెటీరియల్‌.. దుపట్టాల రూపంలో కూడా అతివల వార్డ్‌రోబ్‌ని ఆక్రమిస్తున్నాయి.. 

బంధన్‌ అనే హిందీ పదం నుంచి బాందినీ వచ్చిందని ప్రతీతి. బంధన్‌ అంటే ముడివేయడం, కట్టడం అని అర్థం. వివిధ రకాల రంగులను ఉపయోగించి టై అండ్‌ డై అనే ప్రక్రియ ద్వారా ప్రింట్‌ వేస్తారు కాబట్టే వీటిని బాందినీ చీరలని అంటారు. బంధిన్‌ అనే సంస్కృత శబ్దం నుంచి కూడా ఈ బాందినీ ఉద్భవించిందంటారు. గుజరాత్‌, రాజస్థాన్‌ రెండు రాష్ర్టాలు ఈ చీరలకు ప్రసిద్ధి. బాందినీ ప్రింట్‌ని.. బాందేజ్‌ చీర, బంధ్నీ, పిలియ అని అంటారు. చుంగిడి అని తమిళ ప్రాంతీయ మాండలికాలలో పిలుస్తారు. వస్త్రం కట్టుబడిన పద్ధతి ప్రకారం వీటిని మోత్రి, ఏక్దాలి, షికారి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఖోంబి, ఘర్‌, చోళ, పత్టోరి, చంద్రోఖనీ వంటి వివిధ పేర్లతో ఈ ఉత్పత్తులు పేరొందాయి. 

వేల సంవత్సరాల క్రితం.. 

గుజరాత్‌లోని ఖత్రీ సమాజానికి చెందిన నేతలే వీటిని చీరలపై అద్దుతారు. ఈనాటికీ ప్రత్యేకంగా ఈ కళ అక్కడ కనిపిస్తుంది. బాందినీ అనేది వేళ్ల గోళ్లతో లాగి.. వస్ర్తాన్ని అనేక చిన్న బైండింగుల్లో అలంకరించిన ఒక రకమైన టై అండ్‌ డై వస్త్రంతో చేస్తారు. గుజరాత్‌, రాజస్థాన్‌, సింధ్‌, పంజాబ్‌, తమిళనాడులో సన్గుడి అనే ప్రాంతాల్లో ఈ ప్రింట్‌కి ప్రసిద్ధి చెందిన తయారీ కేంద్రాలున్నాయి. సింధూలోయ నాగరికతకు సంబంధించి కూడా ఈ బాందినీ ప్రింట్‌ ఉందని ఆధారాలున్నాయి. అజంతా గుహ గోడలపై కనిపించే బుద్ధుని జీవిత చరిత్రను చుక్కలతో చూడవచ్చు. దీని ప్రేరణగానే ఈ అద్దకం పుట్టిందని అంటారు. ఈ కళ అలెగ్జాండర్‌ కాలంలో భారతదేశంలో మరింత ప్రాచుర్యం పొందిందని చెబుతారు. చారిత్రక గ్రంథాల్లో ఉన్న ఆధారాల ప్రకారం పూర్వకాలంలో ఈ చీర ధరించిన వధువుకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వసించేవారట.

 సహజసిద్ధంగా: వివిధ రంగుల కలయికతో ఈ బాందినీ ప్రింట్‌ చేస్తారు. ప్రింట్‌ ఏదైనా సహజమైన రంగులతోనే ఈ అద్దకం వేస్తారు. ప్రింట్‌ వేయడం కోసం తెలుపు వస్ర్తాన్ని ఉపయోగిస్తారు. వివిధ రంగుల మీద కూడా ఈ అద్దకం చేయొచ్చు. ఇందుకు ఉపయోగించే వస్త్రం మీద వివిధ చోట్ల బిగించి (టై చేసి), తర్వాత వేర్వేరు రంగులతో అద్దకం వేస్తారు. ఈ టై విధానంలో.. వస్ర్తాన్ని దారాలతో గట్టిగా కట్టి రంగులో ముంచుతారు. నానిన తర్వాత దాన్ని గాలిలో ఎండబెడతారు. అది ఎండడానికి పట్టే సమయం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో అయితే ఐదు గంటల్లో ఎండిపోతుంది. వర్షాకాలంలో రెండు రోజులు పడుతుంది. చలికాలంలో ఒక రోజు పడుతుంది. బాందినీ డిజైన్‌లో చుక్కలు, తరంగాలు, కుట్లు, చతురస్రాలు వంటి వివిధ రకాల చిహ్నాలు కూడా అద్దుతుంటారు. ఈ రీతులలో లెహేరియ, మోత్రి, ఏక్డాలి, షికారి.. ఇలా రకరకాల విధానాలుంటాయి. ఖోంబి, పటోరి, ఘర్చోళ, చంద్రఖని వంటి వస్తువులను ఉపయోగిస్తారు. బండిజ్‌ అనే డిజైన్లు.. చీరలు, కుర్తాలు, సల్వార్‌ కమీజ్‌, చానియా చోళీస్‌లలో కూడా చూడవచ్చు. డిజైన్లు ఏక్డి, (సింగిల్‌ నాట్‌), త్రికుంతి(మూడు నాట్లు), చౌబండి (నాలుగు నాట్లు), దుంగర్‌ షాహి (పర్వత నమూనా), బొండ్‌ (కృష్ణ కేంద్రంతో చిన్న చుక్క), కోడి (ట్రిర్డాప్‌ ఆకారంలో), లడ్డు - జిలేజీ (ఇండియన్‌ స్వీట్లు) లాంటి వివిధ రంగులతో ఈ డిజైన్లు ఉంటాయి. 

 అందమైన అద్దకం.. 

బాందినీలో ఉపయోగించే ప్రధాన రంగులు.. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు. ఏ రంగుతో డై చేయాలనేది మన చేతిలో ఉంటుంది. మంచి రంగుల కలయికను ఎంచుకోవచ్చు. ఒక మీటర్‌ పొడవుండే వస్ర్తాన్ని గుజరాతీ బీహెండి అని పిలుస్తారు. ఇది వేల సంఖ్యలో చిన్న నాట్లు కలిగి ఉంటుంది. దాని మీద ఈ అద్దకం చేస్తుంటారు. నాట్లు అద్దకం చేసి, ఒకసారి ఓపెన్‌ చేసిన తర్వాత మనకి అది ప్రకాశవంతమైన రంగులలో కనిపిస్తుంది. ఈ సంప్రదాయ ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన తుది ఉత్పత్తులను ‘ఖంబి, ఘర్చోళ, చంద్రఖని, షికారి, చౌకిదార్‌, అంబాదాల్‌' ఇలా పలు రకాలుగా వర్గీకరిస్తారు. గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతంలో ఉన్న గ్రేట్‌ రణ్‌ ఆఫ్‌ కచ్‌ ఎర్ర బాందినీకి చాలా పేరు పొందింది.  

డైయర్లలో వివిధ రకాల అంశాలను ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారు. బాందేజ్‌ నమూనాలు అవి ఉత్పత్తి చేసే ప్రాంతం ప్రకారం మారుతుంటాయి. పెతాపుర్‌, మాండవి, భుజ్‌, అంజర్‌, జాంనగర్‌, జెట్‌పుర్‌, పోరుబందర్‌, రాజ్‌కోట్‌, ఉదయ్‌పుర్‌, జైపుర్‌, అజ్మీర్‌, బికానెర్‌ మొదలైన ప్రాంతాల పేర్లతో ఈ చీరలు చెలామణి అవుతున్నాయి. ఏ సందర్భంలోనైనా ధరించేందుకు వీలుగా ఉండటంతో ఈ తరహా చీరలకు అధిక ఆదరణ లభిస్తున్నది.

ఫ్యాషనబుల్‌గా.. 

కనువిందు చేసే రంగుల్లో ముల్‌ముల్‌ లేదా మస్లిన్‌ వస్త్రంతో బాందినీ చీరలు తయారుచేస్తారు. ఈ రకం వస్త్రంతో తీర్చిదిద్దిన సల్వార్‌ కమీజ్‌ అనేకమంది రోజువారీ దుస్తులుగా వేసుకుంటారు. లెహెరియా నమూనాలతో కూడిన చీరలు సాధారణంగా వేడుకల సమయాల్లో కట్టుకుంటారు. అయితే లెహంగాలు, చీరలు రాత్రి వేళల్లో ఎక్కువగా ధరిస్తారు. తెల్లని సల్వార్‌ కమీజ్‌తో బంధీజ్‌ దుపట్టాలు పేరెన్నికగన్నవి. హెవీగా ఉన్న చీరలు కట్టడానికి ఇబ్బంది పడేవారు బాందినీ రకం ఎంపిక చేసుకోవచ్చు. కేవలం డై చేసిన వాటికి మనం బార్డర్‌ను జత చేసుకుంటే కొంచెం హెవీ లుక్‌ వస్తుంది. ఈ చీరలతో లాంగ్‌గౌన్లు, స్కర్ట్‌, వెస్టర్న్‌ టైప్‌, అనార్కలీ స్టయిల్‌లో వేసుకోవచ్చు. జీన్స్‌ పైకి టాప్స్‌ కూడా డిజైన్‌ చేయొచ్చు. ప్లెయిన్‌ అనార్కలి టైప్‌ డ్రెస్‌కి కాంట్రాస్ట్‌లో బాందినీ దుపట్టాలు జత చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్లెయిన్‌ లెహంగాపైకీ సెట్‌ అవుతాయి. కొన్ని సందర్భాల్లో గర్బా డ్యాన్సులలో అబ్బాయిలు పగిడీలలాగా వీటిని కట్టుకుంటుంటారు. ఎక్కువ వేడితో ఇస్త్రీ చేస్తే వీటి అందం తగ్గిపోతుంది. అందుకే.. అవసరమైతే తక్కువ వేడితో ఇస్త్రీ చేయాలి. లేదంటే డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడం చాలా మంచిది. 

రితీషా సతీష్‌రెడ్డి 

ఈశా డిజైనర్‌ హౌస్‌

ఫోన్‌: 7013639335

8500028855, facebook.com/eshadesignerworks


logo