శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 00:30:10

ఖరీదైన కోటు

ఖరీదైన కోటు

ఒక దొంగ... విలాసాలకు అలవాటు పడ్డాడు.   దొరికినంత డబ్బు దోచుకొనేవాడు.  ఒక రోజు సాధారణ వ్యక్తిగా ఓ సత్రంలోకి వెళ్లాడు.  రెండు రోజులు ఉన్నాడు.  అయినా అతనికి దోచుకొనే అవకాశం రాలేదు.   నిరాశ చెంది, ఏదో ఆలోచిస్తూ గది బయటకొచ్చి నిలబడ్డాడు.   సత్రం యజమాని డబ్బులు లెక్కబెట్టుకుంటూ బయట ఓ కుర్చీలో కూర్చున్నాడు.  లెక్కించిన ఆ డబ్బును  ఎంతో ఖరీదైన కొత్త కోటులో పెట్టుకున్నాడు సత్రం యజమాని.  దీన్ని గమనించిన దొంగ ఎలాగైనా కోటును, డబ్బును దొంగిలించాలని పతకం వేశాడు.  దొంగ యజమాని దగ్గరకు వెళ్లాడు. మెల్లగా వెళ్లి అతనితో మాటలు కలిపాడు. వారి ముచ్చట్లు మంచి ఊపుమీదుండగా దొంగ అత్యంత భయంకరంగా, అచ్చం తోడేలులా ఆవులించాడు. అది విన్న యజమానికి ఒళ్లు జలదరించి ‘ఎందుకింత భయంకరంగా ఆవలిస్తావు?’ అని అడిగాడు. ‘అది ఒక పెద్ద కథ. మీరు నమ్మినా, నమ్మలేపోయినా చెప్తాను. 

నేను ఇలా ఎప్పుడైతే మూడోసారి ఆవులిస్తానో, అప్పుడు నేను తోడేలులా మారిపోయి మనుషుల మీద దాడి చేస్తాను. ఇది గతజన్మలో నేను చేసిన పాపాల ఫలితం. అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎవరైనా నా దుస్తులను గట్టిగా పట్టుకోవాలి. లేదంటే నేను నా దుస్తులన్నీ చింపేసి తోడేలులా మారిపోతాను’ అని నమ్మబలికాడు . ఇదంతా చెబుతూనే రెండోసారి కూడా ఆవులించాడు. అది విన్న సత్రం యజమాని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, ‘అయ్యా! ఎక్కడికెళ్తున్నారు. నన్ను పట్టుకోండి. లేదంటే నేను నా దుస్తులు చింపుకొని తోడేలులా మారిపోతాను’ అంటూ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొంగ చేతిలో నుంచి తప్పించుకోవాలని చూశాడు సత్రం యజమాని. సాధ్యం కాకపోవడంతో కోటును వదిలించుకుని పారిపోయాడు.  కోటు దొంగ చేతిలోనే ఉండిపోయింది. దొంగ తన పంటపండిందనుకుని కోటుతో ఉడాయించాడు.