బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 00:44:55

కామెర్లకు పసరు మందా?

కామెర్లకు పసరు మందా?

వర్షాకాలంలో హెపటైటిస్‌ లాంటి ఇన్‌ఫెక్షన్లు సహజం. ఇవి కాలేయానికి వచ్చే ఇన్‌ఫెక్షన్‌. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ల వల్లనే కాదు.. కాలేయంలో ఏ సమస్య ఉన్నా దాని ప్రధాన లక్షణం కామెర్లు రావడం. పచ్చ కామెర్లు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. పచ్చ కామెర్లు వచ్చినప్పుడు చాలామంది ఊళ్లకు వెళ్లి నాటు మందులు, పసరు వైద్యాలు తీసుకోవడం చూస్తుంటాం. వీటివల్ల ఇక కామెర్లు మళ్లీ రావని, పూర్తిగా తగ్గిపోతాయని నమ్ముతుంటారు. ఈ నమ్మకంలో నిజం ఉందా.. అంటే లేదనే చెప్తున్నారు డాక్టర్లు. 

కామెర్లయిందని తెలియగానే నలుగురూ నాలుగు రకాల సలహాలిస్తుంటారు. ఇంగ్లీషు వైద్యంలో దానికి మందు లేదట. మా ఊళ్లో కామెర్లకు మందు వేసేవాళ్లున్నారు.. అంటూ గైడ్‌ చేస్తుంటారు. కొందరైతే చేతి మీద కాలుస్తుంటారు. ఈ మూఢ నమ్మకాల వల్ల లాభం మాటేమో గానీ మరింత ప్రమాదం ఏర్పడుతుందంటారు వైద్యులు.

జాండిస్‌ ఉన్నప్పుడు పసరు మందు వేసుకోవాలనుకోవడం చాలా ప్రమాదకరమైన నిర్ణయం. కామెర్లు వ్యాధి కాదు. అది వ్యాధి లక్షణం. కాలేయంలో సమస్య ఉన్నప్పుడు కామెర్లుగా బయటపడుతుంది. కళ్లు పచ్చగా ఉన్నాయని కళ్లకు చికిత్స ఇవ్వకూడదు. దానికి కారణమైన సమస్యకు చికిత్స చేయాలి. కామెర్ల కోసం వాడే పసర్ల వంటి నాటు మందుల్లో భార లోహాలైన పాదరసం, కాడ్మియం, లెడ్‌ లాంటివి ఉంటాయి. ఇవి కళ్ల పచ్చదనానికి కారణమయ్యే బిల్‌రుబిన్‌ను మూత్రం ద్వారా బయటికి పంపే ప్రయత్నం చేస్తాయి. అందువల్ల ఈ పసర్లు తీసుకున్నప్పుడు కళ్ల పచ్చదనం తగ్గినట్టు అనిపిస్తుంది. దాంతో కామెర్లు తగ్గాయని అనుకుంటారు. కాని జబ్బు ముదిరే అవకాశం ఉంటుంది. కాలేయ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఈ పసరు మందుల వల్ల కాలేయంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ప్రాణాపాయం సంభవించవచ్చు. అందుకే కామెర్లు వచ్చినప్పుడు పసరు మందుల కోసం పరుగులు తీయకుండా డాక్టర్‌ దగ్గరకు వెళ్లి, అవసరమైన పరీక్షలు చేయించుకుని దానికి కారణమైన సమస్యకు తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.


logo